భారత్‌లో ఉంటే నేను సీఈవో అయ్యేదాన్ని కాదు.. ఇంద్రా నూయి వ్యాఖ్యలు వైరల్
ప్రపంచ వ్యాపార రంగంలో అత్యంత విజయవంతమైన మహిళా నాయకుల్లో ఒకరిగా, కార్పొరేట్ దిగ్గజం 'పెప్సికో' మాజీ సీఈవోగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ వ్యాపార రంగంలో అత్యంత విజయవంతమైన మహిళా నాయకుల్లో ఒకరిగా, కార్పొరేట్ దిగ్గజం 'పెప్సికో' మాజీ సీఈవోగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భారత్, అమెరికా, చైనా వంటి అగ్ర దేశాలలో ఉండే అవకాశాలు, అక్కడి జీవనశైలి, ప్రతిభకు లభించే గుర్తింపుపై ఆమె చేసిన ఆసక్తికర విశ్లేషణ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా నిర్వహించిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొన్న ఇంద్రా నూయి, తన కెరీర్ ఎదుగుదలకు అమెరికా ఇచ్చిన మద్దతును కొనియాడారు. తాను అమెరికాలో అడుగుపెట్టడం వల్లే ఒక ప్రపంచ స్థాయి కంపెనీకి సీఈవోగా ఎదిగే అవకాశం దక్కిందని ఆమె స్పష్టం చేశారు.
అమెరికాలో ప్రతిభకే పెద్దపీట
తన విజయ ప్రస్థానం గురించి ఇంద్రా నూయి మాట్లాడుతూ.. "నేను గనక భారత్‌లో కానీ.. లేదా ప్రపంచంలోని మరే ఇతర దేశంలో కానీ ఉండి ఉంటే పెప్సికో లాంటి అంతర్జాతీయ సంస్థకు సీఈవో అయ్యేదాన్ని కాదు. అమెరికాలో ప్రతిభకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ మీరు మహిళా లేక పురుషుడా? అనే లింగ బేధాల కంటే, మీలో ఉన్న సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని మాత్రమే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. నిలకడగా కష్టపడి పనిచేసే ఎవరికైనా అక్కడ అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి" అని ఆమె వ్యాఖ్యానించారు.
భారత్ ఒక 'డ్రగ్' లాంటిది.. చైనాలో క్రమశిక్షణ!
ఇదే వేదికపై భారత్, చైనా దేశాల జీవనశైలిని ఆమె పోల్చారు. భారతదేశంలో ఉండే ఉత్సాహభరితమైన వాతావరణం, కుటుంబ బంధాలు, పండుగలు, సామాజిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకుంటాయన్నారు. అయితే ఇక్కడి సందడితో కూడిన విలక్షణమైన జీవనశైలిని ఒకసారి ఇష్టపడితే అది ఒక రకంగా "డ్రగ్‌లా అడిక్ట్" చేసేంతగా అలవాటైపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
మరోవైపు చైనా గురించి ప్రస్తావిస్తూ.. క్రమశిక్షణ, శుభ్రత, సమయపాలనను ఇష్టపడే విదేశీయులకు చైనాలో జీవించడం చాలా సులభంగా ఉంటుందన్నారు. అక్కడి నగరాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, క్రమబద్ధమైన వ్యవస్థ కారణంగా సందర్శకులు చాలా త్వరగా ఆ వాతావరణానికి అలవాటు పడతారని పేర్కొన్నారు.
నెట్టింట మిశ్రమ స్పందనలు.. రేగుతున్న చర్చ
ఇంద్రా నూయి చేసిన ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికలపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని కార్పొరేట్ సంస్కృతి మెరిటోక్రసీ ప్రతిభ ఆధారిత పై నడుస్తుందని.. అందుకే ఎందరో భారతీయ ప్రతిభావంతులు అక్కడ గ్లోబల్ లీడర్లుగా రాణిస్తున్నారని ఇంద్రా నూయి వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు. ప్రస్తుత భారతదేశం మునుపటిలా లేదని.. భారతీయ కార్పొరేట్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఎందరో మహిళలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో అత్యున్నత నాయకత్వ బాధ్యతలు సీఈవోలు, ఎండీలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.
మొత్తానికి.. మారుతున్న కాలంలో అవకాశాలు, ప్రతిభకు లభిస్తున్న గుర్తింపు, అలాగే భిన్న దేశాల సామాజిక వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసాలపై ఇంద్రా నూయి చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మేధోమథనానికి కారణమ్యాయి.