సబ్జక్టు తెలీదు సర్.. తమ్ముళ్ల తలోమాట.. !
''టీడీపీ నాయకులు కలివిడిగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి కట్టుగా మాట్లాడాలి. కూటమి సర్కారును కాపాడుకునే ప్రయత్నం చేయాలి.'';
''టీడీపీ నాయకులు కలివిడిగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి కట్టుగా మాట్లాడాలి. కూటమి సర్కారును కాపాడుకునే ప్రయత్నం చేయాలి.'' మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎప్పుడు ఎవరు వెళ్లినా.. ఈ మాటలే వినిపిస్తాయి. అంతేకాదు.. మెయిన్ గేటు దాటుకుని లోపలికి వెళ్తే.. పెద్ద బ్యానర్ పై కూడా ఈ అక్షరాలే కనిపిస్తాయి. కలివిడి ముఖ్యం అంటూ నాయకులు పదే పదే చెబుతున్నారు. సరే.. కలివిడి ఎలా ఉన్నా.. ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే స్పందించాలని కూడా చెబుతున్నారు.
కానీ, ఈ స్పందనే కరువవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న రెండు కీలక అంశాలపై ఎక్కడా నాయకులు స్పందించడం లేదు. ఒకరిద్దరు మాట్లాడుతున్నారే తప్ప.. 130కి పైగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. 1) పీపీపీ విధానంలో ఆసుపత్రలు నిర్మాణం. దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కూడా చేపట్టింది. ఫలితంగా.. టెండర్లకు ఒక్కరూ రాలేదని ప్రభుత్వమే చెప్పింది.
ఈ నేపథ్యంలో వైసీపీకి కౌంటర్‌గా నాయకులు స్పందించాలని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. పీపీపీపై అధ్యయనం చేయాలని కోరుతూ.. ఆయన కొన్ని బుక్ లెట్లను కూడా ఆఫీసులో సిద్ధం చేశారు. చిత్రం ఏంటంటే.. ఈ బుక్ లెట్ల సీళ్లు ఇప్పటి వరకు తీయలేదు. వీటిని జిల్లాలకు పంపించాలని.. నాయకులు అధ్యయనం చేయాలని చెప్పినా.. ఇప్పటి దాకా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పీపీపీపై తమకు సబ్జక్టు తెలియదని నాయకులు వాదిస్తున్నారు. ఈ వ్యవహారం అలా ముగిసిపోతోంది.
ఇక, ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారంపైనా.. క్షేత్రస్థాయిలో నాయకులు ఠారెత్తాలని.. వైసీపీని కార్నర్ చేయాలని పార్టీ అధినేత నుంచి పెద్ద ఎత్తున ఆదేశం అయితే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. తమకు సబ్జెక్టుపై అవగాహన లేదని.. సీనియర్ నేతలే చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు నోరు చేసుకున్న యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారు కూడా నోరు విప్పడం లేదు. ``కాదు.. తమ్ముడూ.. సబ్జక్టు తెలియకుండా ఏం మాట్లాడమంటావ్?`` అంటూ.. గోరంట్ల విలేకరులను ప్రశ్నించడం కొసమెరుపు!. సో.. ఇదీ.. సంగతి!!.