నో షేక్ హ్యాండ్స్.. ఆసియా కప్ అండర్-19 ఫైనల్లో భారత్-పాక్ ఢీ
అదే వేదిక.. అదే ప్రత్యర్థులు.. అదే టోర్నీ.. అదే రోజు...! అప్పుడు టీమ్ ఇండియా సీనియర్ జట్టు ఒకవైపు.. మరొకవైపు పాకిస్థాన్ సీనియర్ జట్టు..!;
అదే వేదిక.. అదే ప్రత్యర్థులు.. అదే టోర్నీ.. అదే రోజు...! అప్పుడు టీమ్ ఇండియా సీనియర్ జట్టు ఒకవైపు.. మరొకవైపు పాకిస్థాన్ సీనియర్ జట్టు..! ఇప్పుడు ఇటు అండర్-19 టీమ్ ఇండియా.. అటు అండర్ 19 పాకిస్థాన్ జట్టు! వచ్చే ఆదివారం మళ్లీ సెప్టెంబరు 28 నాటి ఆసియా కప్ ఫైనల్ రిపీట్...! అభిమానులకు మాంచి మజా మజా మ్యాచ్ ఖాయం..! దుబాయ్ లో శుక్రవారం జరిగిన అండర్-19 ఆసియాకప్ సెమీఫైనల్లో టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంకను చిత్తు చేసింది. వర్షం కారణంగా అసలు మొదలవుతుందా? లేదా? అనే తీవ్ర ఉత్కంఠ నెలకొన్న ఈ మ్యాచ్ ను చివరకు 20 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహించారు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 138/8 పరుగులు మాత్రమే చేసింది. బదులుగా టీమ్ ఇండియా యువ జట్టు 18 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ టార్గెట్ ను ఛేదించేసింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (7), కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీ (9) విఫలమైనా.. విహాన్ మల్హోత్రా (61నాటౌట్), ఆరోన్ జార్జ్ (58 నాటౌట్) మూడో వికెట్ కు అజేయంగా 114 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
అటు నుంచి పాక్ సవాల్..
బంగ్లాదేశ్ తో జరిగిన మరో సెమీఫైనల్లో పాకిస్థాన్ గెలుపొందింది. ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 27 ఓవర్లకు కుదించారు. బంగ్లా 26.3 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని పాకిస్థాన్ 16.3 ఓవర్లలో రెడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో ఆదివారం దుబాయ్ లో జరిగే ఫైనల్లో అండర్ 19 భారత యువ జట్టును ఎదుర్కోనుంది.
నోషేక్ హ్యాండ్స్..
ఈ టోర్నీలోనూ టీమ్ ఇండియా కుర్రాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయలేదు. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా టీమ్ ఇండియా సీనియర్ జట్టు సెప్టెంబరులో జరిగిన ఆసియాకప్ లో పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని సంగతి తెలిసిందే. ఇదే పద్ధతిని ఆ తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్ లోనూ కొనసాగించారు. ఇప్పుడు యువ క్రికెటర్లు దానిని అనుసరించారు. ఈ ఆదివారం అండర్-19 ఫైనల్లోనూ షేక్ హ్యాండ్స్ ఉండనట్లే.
ఇంతకూ ఆ ఆసియా కప్ ఎక్కడ..?
సెప్టెంబరులో వరుసగా నాలుగు ఆదివారాలు (3 పురుషుల, ఒక మహిళల మ్యాచ్) పాకిస్థాన్ తో భారత్ తలపడింది. ఈ నెల 14న అండర్ 19 కుర్రాళ్లు ఆడారు. 21న ఫైనల్లో మరోసారి ఆడనున్నారు. అయితే, సెప్టెంబరు 28న జరిగిన ఆసియా కప్ సీనియర్స్ ఫైనల్లో టీమ్ ఇండియా నెగ్గిన అనంతరం ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) చైర్మన్ అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి తీసుకోని సంగతి తెలిసిందే. దీంతో అతడు ట్రోఫీని అతడు తనవెంట హోటల్ కు తీసుకెళ్లాడు. అప్పటినుంచి ట్రోఫీ ఇవ్వలేదు. కొంతకాలం ఏసీఏ ప్రధాన కార్యాలయం (దుబాయ్)లోనే ఉంచినట్లు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత భారత్ కు అప్పగిస్తాడని కథనాలు వచ్చాయి. కానీ, మూడునెలలైనా ఇంతవరకు చేతికి అందివ్వలేదు. మళ్లీ ఇప్పుడు ఆసియాకప్ అండర్ 19 టోర్నీ ఫైనల్ వచ్చేసింది. ఏసీఏ చైర్మన్ గా నఖ్వీనే కప్ అందిస్తాడేమో చూడాలి.. అలాగైతే టీమ్ ఇండియా విజేతగా నిలిచాక తీసుకోదు అని చెప్పొచ్చు.