12 బంతుల్లో హాఫ్‌సెంచరీ.. యూవీ రికార్డు ఎప్పటికీ భద్రమేనా?
ఇక పొట్టి ఫార్మాట్ అంటేనే ధనాధన్ కాబట్టి.. టి20ల్లో రికార్డుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక రికార్డు మాత్రం భారతీయుడి పేరుమీదనే ఉంది.;
చూస్తూచూస్తూనే టి20 అంతర్జాతీయ మ్యాచ్ లు ప్రారంభమై 20 ఏళ్లు గడిచిపోయాయి. తొమ్మిది ప్రపంచ కప్ లు జరిగాయి. మరికొద్ది రోజుల్లో పదో టి20 ప్రపంచ కప్ భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో మొదలుకానుంది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు టి20 ఫార్మాట్ దే అంతా హవా. ఒకప్పుడు వన్డేల జోరులో టెస్టు మ్యాచ్ ల మనుగడకు ముప్పు అని క్రికెట్ అభిమానులు భయపడ్డారు. కానీ, టెస్టులు అలాగే ఉండగా.. టి20లు వచ్చి వన్డేలను దెబ్బకొట్టాయి. ఒకప్పుడు ఏడాదికి భారత్ వంటి జట్లు 40పైగా వన్డేలు కూడా ఆడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అందులో పావు వుంతు వన్డేలు కూడా జరగడం లేదు దీన్నిబట్టే టి20లు ఎంతగా కమ్మేశాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహా అనేక అంతర్జాతీయ లీగ్ లు పుట్టుకొచ్చాయి. ఐపీఎల్ ఒక్కదాని విలువే రూ.లక్ష కోట్లకు పైమాటే. ఇక పొట్టి ఫార్మాట్ అంటేనే ధనాధన్ కాబట్టి.. టి20ల్లో రికార్డుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక రికార్డు మాత్రం భారతీయుడి పేరుమీదనే ఉంది. టి20ల్లో దుమ్మురేపుతున్న భారతీయ కుర్రాళ్లు కూడా దీనిని బ్రేక్ చేయలేకపోతున్నారు.
6 సిక్సులు అజరామరం
పైన చెప్పుకొన్న ఆ చెక్కుచెదరని రికార్డు టీమ్ఇండియా మాజీ డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఖాతాలోది. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు యువీ. ఇది జరిగింది 2007 టి20 ప్రపంచ కప్ లో. ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ను ఉతికి ఆరేస్తూ యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేశాడు. ఇప్పటికి 18 ఏళ్లు దాటినా ఈ రికార్డును భారతీయులే అందుకోలేకపోతున్నారు.
అభిషేక్ లు, హార్దిక్ లు, దూబెలు వచ్చినా..
ఎంతమంది అభిషేక్ లు, హార్దిక్ లు, దూబెలు వచ్చినా యువీ రికార్డు అలానే ఉంటోంది. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సిరీస్ లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇది భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఇక బుధవారం విశాఖపట్నంలో జరిగిన నాలుగో టి20లో ఆల్ రౌండర్ శివమ్ దూబె 15 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 16 బాల్స్ లోనే ఈ మార్క్ ను అందుకున్నాడు. 2021లో బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. కానీ, వీరెవరూ యువీ రికార్డును బీట్ చేయలేకపోతున్నారు.
నేపాల్ ఐరీ కొట్టినా..
నేపాల్ కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 9 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కానీ, నేపాల్.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పూర్తిస్థాయి సభ్యత్వ దేశం కాదు. అసోసియేట్ సభ్య దేశం. అందుకనే దీపేంద్ర రికార్డును పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేం. అఫ్ఘాన్ కు చెందిన హజ్రతుల్లా జజాయ్ 2018లో ఐర్లాండ్ పై 13 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం యూవీ తర్వాత రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.
అందుకోవడం అసాధ్యమా?
యువీ రికార్డును అందుకోవడం అతడి శిష్యుడు అభిషేక్ సహా ఎవరికైనా సాధ్యమా? అంటే ఎందుకు కాదు? అనే సమాధానం వస్తుంది. యువీ వరుసగా ఆరు సిక్సులు కొట్టడంతో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. ఇదే ఫీట్ ను సాధిస్తే 11 బంతుల్లో అయినా హాఫ్ సెంచరీ చేయొచ్చు. దీపేంద్ర 9 బంతుల్లో సాధించగగా లేనిది అభిషేక్ 10 బంతుల్లో చేయలేడా...? అది కూడా వచ్చే టి20 ప్రపంచ కప్ లోనే కావొచ్చు కదా?