తరానికొక్కడు బుమ్రాకు ఆర్థిక న్యాయం.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం
ఇటీవలి టీ20 ప్రపంచ కప్ లో టీమ్ఇండియాను టైటిల్ దిశగా నడిపించిన మిస్టరీ శక్తి ఏది..? అంటే దీనికి సమాధానం మేటి పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.;
ఇటీవలి టీ20 ప్రపంచ కప్ లో టీమ్ఇండియాను టైటిల్ దిశగా నడిపించిన మిస్టరీ శక్తి ఏది..? అంటే దీనికి సమాధానం మేటి పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఇంగ్లండ్ తో సెమీఫైనల్లో అతడు వేసిన 16, 18 ఓవర్లే కాదు.. మెగా టోర్నీ మొదటి నుంచి బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్ పై ఫైనల్లో ఇక ఆయన ప్రదర్శన గురించి చెప్పేదేముంది? 4 ఓవర్లు వేస్తే ఇచ్చింది 15 పరుగులే. నాలుగు వికెట్లు తీశాడు. అందుకే అంత ఓపెనర్ సంజూ శాంసన్ ను కాదని మరీ అతడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. టి20 ప్రపంచ కప్ జరుగుతుండగానే, బుమ్రాను తరానికి ఒక్కడు అని దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అయితే.. బుమ్రా జాతీయ సంపద అని పొగిడాడు. ఇందుకు అతడు నిజంగానే అర్హుడు కూడా. కాగా, టి20 ప్రపంచ కప్ సమయంలోనే అటుఇటుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో బుమ్రాకు ఏ గ్రేడ్ ఇచ్చారు.
గ్రేడ్ తగ్గింది.. రూ.2 కోట్లు తగ్గాయి..
బీసీసీఐ ఓ దశాబ్ద కాలంగా వార్షిక కాంట్రాక్టుల్లో ఏ ప్లస్, ఏ, బీ, సీ అని నాలుగు గ్రేడ్ లు ఇస్తోంది. అంటే, టెస్టులు, వన్డే, టి20లు మూడు ఫార్మాట్లలో ఆడేవారికి ఏ ప్లస్ కేటాయిస్తోంది. మిగతావారిని వారి ప్రదర్శన ఆధారంగా ఏ, బీ, సీలకు పరిమితం చేస్తోంది. ఏ గ్రేడ్ లో చాలావరకు ముఖ్యమైన ఆటగాళ్లకు చోటిస్తోంది. తాజాగా కాంట్రాక్టుల్లో అనూహ్యంగా ఏ ప్లస్ గ్రేడ్ ను ఎత్తి వేసింది. ఈ గ్రేడ్ లో ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు కాంట్రాక్టు కింద వస్తాయి. ఏ లో రూ.5 కోట్లు, బిలో రూ.3 కోట్లు, సిలో రూ.కోటి వరకు ఇస్తుంది. ఏ ప్లస్ లో మొన్నటి వరకు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా ఉన్నారు. కోహ్లి, రోహిత్ టెస్టులకు, టి20లకు గుడ్ బై చెప్పి వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నప్పటికీ, గాయాల భయంతో అది పరిమితంగానే. మిగతా ప్లేయర్లలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్, టి20 వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాత్రమే మూడు ఫార్మాట్లలో కనిపిస్తున్నారు. టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్ మన్ గిల్ టి20లకు (ప్రస్తుతానికి) పరిగణనలో లేడు. ఈ నేపథ్యంలో ఏ ప్లస్ గ్రేడ్ ను తొలగించారు. దీంతో ఏ నుంచి గ్రేడ్ లు మొదలయ్యాయి. తద్వారా బుమ్రాకు రూ.2 కోట్లు లాస్ వచ్చింది.
బీసీసీఐ నష్ట నివారణ
ఏ ప్లస్ గ్రేడ్ లేనందుకు బుమ్రా రూ.2 కోట్లు నష్టపోతున్నాడు. దీంతో అతడికి న్యాయం చేసేందుకు బీసీసీఐ నడుం బిగించింది. వార్షిక కాంట్రాక్టులను రివైజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరారాబాదీ సిరాజ్ తో పాటు అక్షర్ పటేల్ ల కాంట్రాక్టులు కూడా మారొచ్చని చెబుతున్నారు. వీరిద్దరూ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నందున వీరికీ ఏ ప్లస్ ఇస్తారేమో చూడాలి. సహజంగా బీసీసీఐ నిర్ణయాల్లో మార్పులు ఉండవు. కానీ, బుమ్రా విషయంలో మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంటోంది. అందుకే అతడు తరానికొక్కడు.