2027 వరల్డ్‌కప్‌పై హార్దిక్ ఫోకస్.. టీమిండియాకు దొరికేనా అసలైన బ్యాలెన్స్?
2027 వన్డే ప్రపంచకప్‌ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హార్దిక్ ఇప్పటికే ప్రత్యేక శిక్షణను ప్రారంభించినట్లు సమాచారం.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి జట్టుకు అత్యంత కీలక ఆటగాడిగా మారేందుకు సిద్ధమవుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న హార్దిక్ ఇప్పటికే ప్రత్యేక శిక్షణను ప్రారంభించినట్లు సమాచారం. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కఠినమైన ప్రాక్టీస్ చేస్తూ తన ఫిట్‌నెస్, బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు.
తాజా నివేదికల ప్రకారం.. హార్దిక్ బెంగళూరుకు మకాం మార్చి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సమీపంలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో తన శిక్షణను ప్రారంభిస్తున్నాడు. అప్పటికే ఎక్కువ మంది ఆటగాళ్లు ప్రాక్టీస్ ముగించుకుని వెళ్లిపోవడంతో ఎలాంటి అంతరాయాలు లేకుండా మూడు నుంచి నాలుగు గంటల పాటు పూర్తి స్థాయి ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హార్దిక్ శిక్షణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అతని బ్యాటింగ్ డ్రిల్. షార్ట్ పిచ్ బంతులను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్లాస్టిక్ బంతులతో కాంక్రీట్, టైల్స్ వంటి గట్టి ఉపరితలాలపై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని సమాచారం. ఈ విధానం ద్వారా బంతి వేగాన్ని, అనూహ్యమైన బౌన్స్‌ను అంచనా వేసే సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో రిఫ్లెక్సులు మరింత మెరుగుపడటమే కాకుండా వేగవంతమైన బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యం పెరుగుతుందని కోచ్‌లు విశ్వసిస్తున్నారు.
అంతేకాదు హార్దిక్ ప్రతిరోజూ ఫిట్‌నెస్ వ్యాయామాలు, స్ట్రెచింగ్, బౌలింగ్ ప్రాక్టీస్, బ్యాటింగ్ సెషన్లు కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాడు. స్పెషలిస్ట్ త్రోడౌన్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు స్థానిక బౌలర్ల సహాయంతో గంటల తరబడి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. గతంలో గాయాల కారణంగా పలుమార్లు జట్టుకు దూరమైన హార్దిక్, ఈసారి ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
టీమిండియాకు హార్దిక్ విలువ కేవలం ఒక ఆల్‌రౌండర్‌గా మాత్రమే కాదు. అతను జట్టులో ఉంటే బ్యాటింగ్ లోతు పెరగడంతో పాటు అదనపు పేస్ బౌలింగ్ ఎంపిక కూడా లభిస్తుంది. దీంతో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో పాటు అదనపు బౌలింగ్ ఆప్షన్ లభించడం జట్టు సమతుల్యతను మరింత బలపరుస్తుంది. హార్దిక్ లేని సమయంలో భారత జట్టు సరైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం ఎన్నో ప్రయోగాలు చేసినా అతనికి సమానమైన ఆటగాడిని ఇప్పటివరకు కనుగొనలేకపోయింది.
2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సుమారు 14 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే లక్ష్యంపై దృష్టి పెట్టిన హార్దిక్ పాండ్యా తన కెరీర్‌లో మరో అత్యుత్తమ దశను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని ఈ ప్రత్యేక శిక్షణ ఫలిస్తే, ప్రపంచకప్‌లో టీమిండియాకు అతనే అతిపెద్ద బలంగా మారే అవకాశం ఉంది. భారత్ ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సమస్యకు హార్దిక్ పూర్తి స్థాయిలో సమాధానంగా నిలుస్తాడా? అనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.