టీమిండియా జెర్సీ : నీలం పోయి కాషాయం వచ్చే.. సోషల్ మీడియాలో ఠాం.. ఠాం.. రచ్చ
భారత క్రీడారంగంలో దశాబ్దాలుగా ‘బ్లీడ్ బ్లూ’ అనే పదం ఒక బ్రాండ్‌గా కోట్ల మంది అభిమానుల సెంటిమెంట్‌గా నిలిచింది.
‘బ్లీడ్ బ్లూ’ శకానికి తెరపడిందా? దశాబ్దాల సెంటిమెంట్‌ను పక్కనబెట్టి భారత్ హాకీ కొత్త రంగు పూసుకుందా? మైదానంలో పక్కా ప్లాన్‌తో దిగుతున్నారా లేక కాంట్రవర్సీకి డోర్లు ఓపెన్ చేశారా? వచ్చే వరల్డ్ కప్‌లో నీలాన్ని తుడిచేసి, కాషాయాన్ని తొడిగేందుకు హాకీ ఇండియా వేసిన సంచలన అడుగు.. ఇప్పుడు క్రీడా లోకంలో పెను మంటలే రేపుతోంది..
భారత క్రీడారంగంలో దశాబ్దాలుగా ‘బ్లీడ్ బ్లూ’ అనే పదం ఒక బ్రాండ్‌గా కోట్ల మంది అభిమానుల సెంటిమెంట్‌గా నిలిచింది. కానీ త్వరలో జరగబోయే ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌లో ఒక చారిత్రాత్మక మార్పు చూడబోతున్నాం. భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తమ సంప్రదాయ నీలిరంగు జెర్సీలను పక్కనబెట్టి తొలిసారిగా కాషాయ రంగు జెర్సీలతో మైదానంలోకి దిగనున్నాయి. హాకీ ఇండియా తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీసింది.
మాజీల తీవ్ర అసంతృప్తి.. ఎందుకీ నిర్ణయం?
ఈ మార్పుపై భారత మాజీ హాకీ కెప్టెన్ విరెన్ రస్క్విన్హాతో పాటు పలువురు మాజీ క్రీడాకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దశాబ్దాల చరిత్ర, గుర్తింపు ఉన్న నీలిరంగును మార్చడం "ఇబ్బందికరమైన నిర్ణయం" అని రస్క్విన్హా వ్యాఖ్యానించారు. భారత క్రీడా రంగానికి నీలం రంగు ఒక బ్రాండ్ ఇమేజ్ అని, అలాంటి సంప్రదాయాన్ని వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు.
సైంటిఫిక్ రీజన్ చెప్తున్న హాకీ ఇండియా
అయితే ఈ విమర్శలపై హాకీ ఇండియా క్లారిటీ ఇచ్చింది. జెర్సీ రంగు మార్పు వెనుక ఎలాంటి రాజకీయాలు లేదా ఇతర కారణాలు లేవని, ఇది కేవలం ఆటగాళ్ల మైదాన ప్రదర్శనను మెరుగుపరచడానికి తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది. ప్రస్తుతం చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు నీలిరంగు మైదానాలపైనే జరుగుతున్నాయి. టర్ఫ్, జెర్సీలు రెండూ నీలిరంగులోనే ఉండటం వల్ల ఆట సమయంలో తోటి ఆటగాళ్లను త్వరితగతిన గుర్తించడం, పాస్‌లు ఇవ్వడం కష్టమవుతోందని కోచ్‌లు, ప్లేయర్లు తెలిపారు. నీలిరంగు టర్ఫ్‌పై కాషాయ రంగు జెర్సీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్, సమన్వయం పెరిగి మెరుగైన ఫలితాలు వస్తాయని హాకీ ఇండియా విశ్లేషించింది.
రెండుగా చీలిపోయిన సోషల్ మీడియా
హాకీ ఇండియా ఇచ్చిన వివరణతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆటలో చిన్న విజువల్ మార్పు కూడా ప్రదర్శనపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆటగాళ్ల సౌకర్యానికి, సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైన నిర్ణయమేనని ఒక వర్గం సమర్థిస్తోంది. రంగు మార్చడం వల్ల జాతీయ జట్టు ఐడెంటిటీ దెబ్బతింటుందని, నీలిరంగులోనే ఇతర ఆల్టర్నేటివ్ షేడ్స్ వాడొచ్చు కదా అని మరొక వర్గం వాదిస్తోంది.
మొత్తానికి వరల్డ్ కప్ నాటికి ఈ కొత్త కాషాయ జెర్సీ వివాదాలకు స్వస్తి చెప్పి, భారత హాకీ రంగానికి సరికొత్త అదృష్టాన్ని, విజయాన్ని తీసుకొస్తుందో లేదో వేచి చూడాలి.