రో-కో.. ర్యాంకింగ్స్ లో ఇప్పటికీ రారాజులే!
అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ఇచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. టెస్టులకు వీడ్కోలు పలికి కూడా ఏడాది అవుతోంది.;
అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ఇచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. టెస్టులకు వీడ్కోలు పలికి కూడా ఏడాది అవుతోంది. ఇక మిగిలింది వన్డేలే. అవి కూడా అడపాదడపా జరిగే మ్యాచ్ లే. అయినా, ఆ ఇద్దరూ మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతారా? అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కలిసి మళ్లీ ఎప్పుడు బ్లూ జెర్సీలో దేశానికి ఆడతారా? అని ఉత్సుకతతో ఉంటారు. అయితే, ఆడేది కొద్ది మ్యాచ్ లే కానీ, వాటిలోనూ రాణిస్తూ తామేంటో నిరూపిస్తున్నారు ఆ ఇద్దరు. అంతేకాదు.. మరో ఏడాదిన్నరలో జరిగే వన్డే ప్రపంచ కప్ నకూ సిద్ధం అంటున్నారు. ఎంపిక చేయాల్సిన బాధ్యత టీమ్ఇండియా సెలక్టర్లదే అంటూ సవాల్ విసురుతున్నారు. వారే, భారత బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు. తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో కింగ్స్ నిలిచారు.
ఏడాదిలో ఎంత మార్పు?
గత ఏడాది ఈ సమయానికి రో-కో (రోహిత్-కోహ్లి) టెస్టులకు వీడ్కోలు పలుకుతారని ఎవరూ ఊహించలేదు. రోహిత్ సంగతి ఏమో కానీ, కోహ్లి గురించి అసలు ఆలోచించలేదు. అయితే, అదే జరిగింది. కేవలం రోజుల వ్యవధిలో, అది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లు జరుగుతుండగా టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చారు. 2024 టి20 ప్రపంచ కప్ గెలిచాక ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. దీంతో వన్డేల నుంచి కూడా తప్పుకొంటారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, రో-కో మాత్రం 2027 ప్రపంచ కప్ ఆడే ఉద్దేశంలో ఉన్నారు. ఈక్రమంలోనే ఇటీవలి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్ లలో ఆడారు. రోహిత్ అయితే బరువు తగ్గి మరీ తన ఉద్దేశం ఏమిటో చెప్పాడు. ఈ ఇద్దరికీ వన్డే ప్రపంచకప్ గెలవకపోవడం అనే లోటు ఉంది. దానిని 2027లో భర్తీ చేసుకునే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
మనోళ్లే మొనగాళ్లు
అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) వన్డే తాజా ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ టాప్ లో నిలిచాడు. ఇటీవల భారత్ లో జరిగిన వన్డే సిరీస్ లో మిచెల్ అద్భుతంగా రాణించాడు. రెండు సెంచరీలు చేసి ఆ జట్టు తొలిసారి భారత్ పై భారత్ లో వన్డే సిరీస్ గెలవడంలో కీలకమయ్యాడు. కాగా, రెండో ర్యాంక్ మాత్రం కోహ్లికే దక్కింది. రోహిత్ 4, వన్డే కెప్టెన్ శుబ్ మన్ గిల్ 5వ ర్యాంక్ లో ఉన్నాడు. టీమ్ఇండియా మరో స్టార్ కేఎల్ రాహుల్ 5వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ లో మాత్రం చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (8) మాత్రమే టాప్-10లో ఉన్నాడు.