రోహిత్ ఔట్..? ముంబై ఇండియన్స్ లో ఐపీఎల్ కు ముందే మంటలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మరొక్క రెండు వారాల్లో మొదలుకానుంది.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మరొక్క రెండు వారాల్లో మొదలుకానుంది. ప్రతిష్ఠాత్మక ఈ లీగ్ ను కేవలం రెండు జట్లు మాత్రమే 5 సార్లు సాధించాయి. వాటిలో ఒకటి ముంబై ఇండియన్స్, రెండోది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ,ఈ రెండు జట్లలో ముంబై టైటిల్ కొట్టక ఐదేళ్లు దాటింది. 2020లో చివరగా చాంపియన్ గా నిలిచిన ముంబై.. ఆ తర్వాత ఎన్నో మార్పులకు గురైంది. జట్టును తిరుగులేని స్థితిలో నిలిపిన టీమ్ఇండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి.. రెండేళ్ల కిందట గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి మరీ పగ్గాలు అప్పగించారు. కానీ, ఫలితం శూన్యం. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై వరుసగా పరాజయాల పాలైంది. పైగా ఆ జట్టులో తీవ్ర విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో హల్ చల్ మొదలైంది. మరీ ముఖ్యంగా రోహిత్ పట్ల పాండ్యా అనుసరిస్తున్న తీరును ముంబై అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. చివరకు అతడు తన తప్పు తెలుసుకునేలా చేశారు. అయితే, జట్టు మాత్రం విజయపథంలోకి రాలేకపోయింది. గత సీజన్ లో మొదట్లో వెనుకబడినా, తర్వాత పుంజుకుంది. కానీ, టైటిల్ కొట్టలేదు. మళ్లీ ఇప్పుడు 19వ సీజన్ లో అయినా చాంపియన్ కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కానీ, దానికంటే ముందే ముంబై ఇండియన్స్ గురించి వదంతులు మొదలయ్యాయి. అదికూడా హార్దిక్-రోహిత్ సెంట్రిక్ గా కావడం గమనార్హం.
రోహిత్ కు వార్నింగా?
టీమ్ఇండియాకు 2024లో టి20 ప్రపంచ కప్ అందించిన తర్వాత అంతర్జాతీయంగా ఆ ఫార్మాట్ నుంచి రిటైరయ్యాడు రోహిత్ శర్మ. గత ఏడాది లీగ్ సందర్భంగానే టెస్టులకూ గుడ్ బై చెప్పాడు. కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక నిరుడు ఐపీఎల్ లఓ రోహిత్ ప్రదర్శన సాధరణమే. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దించారు. కొన్ని మ్యాచ్ లకు గాయం పేరు చెప్పి పక్కనపెట్టారు. ఆ తర్వాతే అసలు కథ జరిగింది. టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రోహిత్ దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడిపై ఉన్న ప్రధాన విమర్శ ఫిట్ నెస్ లోపం. నిరుడు ఐపీఎల్ సమయంలో రోహిత్ శరీరం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ, తర్వాత 10 కిలోలకు పైగా బరువు తగ్గి అతడు ఆశ్చర్యపరిచాడు. అనంతరం ఆస్ట్రేలియా టూర్ లో రాణించాడు. అయితే, స్వదేశంలో ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యమే చూపుతూ రోహిత్ కు హార్దిక్ వార్నింగ్ ఇచ్చాడంటూ ఊహాగానాలు రాసాగాయి.
జట్టులో ఉంచుతాడా? ఉంచడా?
ఆటగాడి ప్రతిభ పరంగా బయట ఎన్ని చెప్పుకొన్నా.. మైదానంలో దిగే జట్టుపై కెప్టెన్ దే తుది నిర్ణయం. కాబట్టి ముంబై ఇండియన్స్ తుది జట్టులో రోహిత్ ను హార్దిక్ ఉంచుతాడా? లేక ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపుతాడా? అన్నది అతడి చేతుల్లోనే ఉంటుంది. ఈ విధంగానే రోహిత్ బాగా ఆడకుంటే కష్టమే అంటూ హార్దిక్ అల్టిమేటం ఇచ్చినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో నడుస్తోంది. వైరల్ కూడా కావడంతో ముంబై ఇండియన్స్ స్పందించింది. లాఫింగ్ ఎమోజీని పోస్ట్ చేసి.. మీరు ఏమైనా అనుకోండి అన్నట్లు చెప్పుకొచ్చింది. మరోవైపు ఐపీఎల్ పై వదంతులకు అడ్డు లేకుండా పోతోందని కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.