ఈ టీమిండియా బౌలింగ్‌తో వరల్డ్ కప్ కలా? నవ్విపోదురుగాక
ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలింగ్ అంతా జస్ప్రీత్ బుమ్రా భుజాలపైనే ఉంది.
వన్డే క్రికెట్‌లో మన బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదేస్తూ ఉంటే సంబరపడాలా? లేక మన బౌలర్లు ఇచ్చే "రన్ల విరాళాలు" చూసి ఏడవాలా? అర్థం కాక అభిమానులు బుర్ర పీక్కుంటున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ చూశాక అందరి నోటా వస్తున్న ఒకే మాట... "బాబోయ్.. ఈ బౌలింగ్‌తో 2027 వన్డే వరల్డ్ కప్ కొడతామంటే పక్కన ఉన్న లంక వాళ్లు కూడా నవ్వుతారు"
యార్కర్ల బుమ్రా ఒక్కడే దిక్కు... మిగతావారు రన్ల దాతలు
ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలింగ్ అంతా జస్ప్రీత్ బుమ్రా భుజాలపైనే ఉంది. బుమ్రా ఉంటే ప్రత్యర్థులకు ‘లైట్’... లేకపోతే మన బౌలర్లకు ప్రత్యర్థులు చూపిస్తారు ‘సైట్’ గాయాల వల్ల బుమ్రాను మ్యాచ్ మ్యాచ్‌కూ అద్దంలో దాచి పెట్టినట్లు దాచి వాడుకుంటున్నాం. మరి ఆయన లేనప్పుడు దారినపోయే దానయ్యలంతా వచ్చి మన బౌలింగ్‌ను ఉతికి పారేస్తుంటే.. మేనేజ్‌మెంట్ మాత్రం "మా దగ్గర బెంచ్ స్ట్రెంగ్త్ ఉందోచ్" అని కవరింగ్‌లు ఇస్తోంది.
లార్డ్స్‌లో పరుగుల పండగ... మనోళ్ల దాతృత్వం!
లార్డ్స్ వన్డేలో మనోళ్లు వేసిన స్పెల్స్ చూస్తే ఏకంగా గిన్నిస్ బుక్ కూడా అవాక్కవుతుంది. గుర్నూర్ బ్రార్ ఐపీఎల్ ఛానెల్ మారగానే ఏకంగా 97 పరుగులు ధారపోశారు. స్పెషల్ ఆఫర్ లాగా.. ఇక ప్రిన్స్ యాదవ్ పేరులోనే రాజు ఉన్నా, ఇచ్చింది మాత్రం 79 పరుగులు. తీసింది ఒక్కటే వికెట్. అర్ష్‌దీప్ సింగ్ అయితే 10 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చి వికెట్ల ఖాతాలో "సున్నా" చుట్టేశారు. ప్రసిద్ధ్ కృష్ణ 69 పరుగులు సమర్పించుకుని ఎకానమీ రేటును ఆకాశానికి ఎత్తేశారు.
విదేశీ పిచ్‌లపై అనుభవం ఉన్న షమీ, భువనేశ్వర్‌లను పక్కన పెట్టేసి.. ఏకంగా ఇలాంటి ప్రయోగాలతో బరిలోకి దిగితే ఫలితం లార్డ్స్ బోర్డు మీద స్పష్టంగా కనిపించింది.
ప్రయోగాలు ఓకే... మరీ పసికూనలా?
యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదే. కానీ, వరల్డ్ కప్‌కు ఇంకా కేవలం ఏడాదిన్నర మాత్రమే ఉందనే సంగతి మేనేజ్‌మెంట్ మరచిపోయినట్లుంది. ప్రయోగాల పేరుతో రన్ల వర్షం కురిపించే బౌలర్లను పట్టుకుని టోర్నీలకు వెళ్తే ప్రత్యర్థి బ్యాటర్లు రన్ రేట్ పెంచుకోవడానికి మన మ్యాచ్‌లే ఎంచుకుంటారు.
ఇప్పటికైనా కళ్లు తెరచి బుమ్రాకి తోడుగా నిలకడగా వికెట్లు తీసే ఇద్దరు గట్టి పేసర్లను విదేశాల్లో తిప్పగలిగే స్పిన్నర్లను తయారు చేయకపోతే... 2027 వరల్డ్ కప్ కప్పు గెలవడం కాదు కదా.. మ్యాచ్‌లు చూడటానికి కూడా ధైర్యం సరిపోదు..