అబ్బో అభిషేక్.. అమ్మాయిల పాపులారిటీ మ‌హా ఎక్కువ‌!

టీమ్ఇండియా టి20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి వారం రోజులు అవుతోంది. ఇప్ప‌టికీ ఆ విజ‌యం తాలూకు మ‌ధురానుభూతిని అభిమానులు ఆస్వాదిస్తున్నారు.;

Update: 2026-03-15 17:30 GMT

టీమ్ఇండియా టి20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి వారం రోజులు అవుతోంది. ఇప్ప‌టికీ ఆ విజ‌యం తాలూకు మ‌ధురానుభూతిని అభిమానులు ఆస్వాదిస్తున్నారు. అంతా క‌ల‌లా జ‌రిగిపోయిన మెగా టోర్నీలో భార‌త్ అదే త‌ర‌హాలో చాంపియ‌న్ గా నిల‌వ‌డాన్ని గుర్తుచేసుకుని ఆనందిస్తున్నారు. టోర్నీ మొత్తంలో చివ‌రి ఐదు మ్యాచ్ లు జ‌రిగిన తీరు.. అందులో వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ సంజూ శాంస‌న్ చెల‌రేగిన వైనాన్ని త‌ల‌చుకుని మైమ‌రిచిపోతున్నారు. ఇక మ‌రోవైపు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్ లు ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తూ త‌మ విజ‌యానుభూతిని మ‌రింత మ‌ధురంగా మార్చుకుంటున్నారు. మిగ‌తా కుర్రాళ్లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ వ‌స్తున్నారు. ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ నిర్వ‌హించిన స‌ద‌స్సులో ఓపెన‌ర్లు సంజూ శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జంటేట‌ర్ అడిడిన ప్ర‌శ్న‌ల‌కు సంజూ స‌మాధానాలు ఇచ్చాడు.

స‌హచ‌ర ఓపెన‌ర్ పై ప్ర‌శంస‌లు

ప్ర‌జంటేట‌ర్ ప్ర‌శ్న‌ల‌కు సంజూ బ‌దులిస్తూ స‌హ‌చ‌ర ఓపెన‌ర్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇటీవ‌లి టి2 ప్ర‌పంచ క‌ప్ న‌కు ముందు వీరిద్ద‌రిలో అభిషేక్ పేరు మార్మోగిన సంగ‌తి తెలిసిందే. సిరీస్ ల మీద సిరీస్ ల‌లో చెల‌రేగి ఆడుతూ అత‌డు నంబ‌ర్ వ‌న్ టి20 బ్యాట‌ర్ అయ్యాడు. మ‌రోవైపు సంజూ శాంస‌న్ మాత్రం వ‌రుస వైఫ‌ల్యాల‌తో వెన‌క్కి వెళ్లిపోయాడు. తుది జ‌ట్టులో చోటు కూడా కోల్పోయాడు. ప్ర‌త్యామ్నాయంగా ఇషాన్ కిష‌న్ వ‌చ్చాడు. కానీ, టి20 ప్ర‌పంచ క‌ప్ మొద‌ల‌య్యాక అంతా మారిపోయింది. అభిషేక్ వైఫ‌ల్యాలు మూట‌గ‌ట్టుకోగా అనుకోని విధంగా సంజూ జ‌ట్టులోకి వ‌చ్చాడు. క్వార్ట‌ర్స్ కాని క్వార్ట‌ర్స్ లో వెస్టిండీస్ పై, సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్ పై, ఫైన‌ల్లో న్యూజిలాండ్ పై అద్భుత ఇన్నింగ్స్ లు ఆడి ఏకంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. అభిషేక్ హ్యాట్రిక్ డ‌క్ ల‌తో ప్ర‌పంచ‌కప్ లో ఓ ద‌శ‌లో తేలిపోయాడు. ఎట్ట‌కేల‌కు ఫైన‌ల్లో హాఫ్ సెంచ‌రీ సాధించి జ‌ట్టు గెలుపులో భాగ‌మ‌య్యాడు. కాగా, ఇంగ్లిష్ మీడియా ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా అభిషేక్ ను సంజూ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తాడు.

అత‌డి చుట్టూ అమ్మాయిలే..

త‌మ జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌లోకెల్లా అభిషేక్ కే అమ్మాయిల్లో పాపులారిటీ ఎక్కువ అని సంజూ అన్నాడు. అత‌డు ఎక్క‌డ‌కు వెళ్లినా అమ్మాయిలు చుట్టు ముడ‌తార‌ని.. ఇలా ఎవ‌రికీ జ‌ర‌గ‌ద‌ని తెలిపాడు. అంతేకాదు, టీమ్ ఇండియా సూప‌ర్ స్టార్ అని కొనియాడాడు. జ‌ట్టు బ‌స్సును చుట్టుముట్టే అభిమానులు.. గ‌ట్టిగా చేసే అరుపుల్లో వినిపించే ఏకైక‌ పేరు అభిషేక్ మాత్ర‌మేన‌ని కూడా తెలిపాడు.

Tags:    

Similar News