కుర్ర టీమ్ఇండియా కేక‌.. 16 ప్ర‌పంచ క‌ప్ లు.. 10 సార్లు ఫైన‌ల్ కు

ప్ర‌స్తుత ప్ర‌పంచ క‌ప్ ను జింబాబ్వే, న‌మీబియా దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. శుక్ర‌వారం జ‌రిగే ఫైన‌ల్లో భార‌త్ హాట్ ఫేవ‌రెట్ గా బ‌రిలో దిగ‌నుంది.;

Update: 2026-02-04 17:20 GMT

మొత్తం 16 ప్ర‌పంచ క‌ప్ లు జ‌రిగితే.. 10 సార్లు ఫైన‌ల్ కు .. ఐదుసార్లు టైటిల్ విన్న‌ర్..! ఇప్పుడు ఆరోసారి కూడా చాంపియ‌న్ రేసులో..! ఇది టీమ్ ఇండియా ఆల్ టైమ్ రికార్డు.. ! ఇండ‌స్ట్రీ రికార్డు కూడా! అయితే, సీనియ‌ర్ స్థాయిలో కాదు. జూనియ‌ర్ స్థాయిలో. అండ‌ర్-19 జ‌ట్టు విష‌యంలో! భార‌త క్రికెట్ ఎంత ప‌టిష్ఠంగా ఉందో చాటిచెప్పేలా మ‌న కుర్రాళ్లు మ‌రోసారి ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ చేరారు. బుధ‌వారం అఫ్ఘానిస్థాన్ తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ఏడు వికెట్ల తేడాతో విజ‌య‌భేరి మోగించింది. ఫైన‌ల్లో ఇంగ్లండ్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ నెల 6వ తేదీన (శుక్ర‌వారం) ఫైన‌ల్ మ్యాచ్ జింబాబ్వే రాజ‌ధాని హ‌రారేలో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్ అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ ను ఐదుసార్లు గెలిచింది. ఇదే రికార్డు అనుకుంటే.. ఆరోసారి కూడా కొట్టేసే ఊపులో ఉంది.

పాక్ పై త‌డ‌బ‌డినా.. అఫ్ఘాన్ ను దంచికొట్టారు

సెమీఫైన‌ల్ కు ముందు చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా కుర్రాళ్లు కాస్త త‌డ‌బ‌డ్డారు. కానీ, అంత‌లోనే తేరుకుని విజ‌యం సాధించారు. అదే ఊపును సెమీస్ లో అఫ్ఘానిస్థాన్ పైనా కొన‌సాగించారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 310 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ల‌క్ష్యాన్ని కుర్రా భార‌త జ‌ట్టు 41.1 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ అరోన్ జార్జి 104 బంతుల్లో 115 (15 ఫోర్లు, 2 సిక్సులు) సెంచ‌రీతో మెరిశాడు. కుర్ర ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ 33 బంతుల్లో 68 (9 ఫోర్లు, 4 సిక్సులు) ఎప్ప‌టిలాగానే చెల‌రేగాడు. బ్యాట్ తో ఫామ్ లో లేడ‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కెప్టెన్ ఆయుష్ మాత్రే 59 బంతుల్లో 62 (5 ఫోర్లు, 4 సిక్సులు) కీల‌క స‌మ‌యంలో రాణించాడు. విహాన్ మ‌ల్హోత్రా (38 నాటౌట్), వేదాంత్ త్రివేది (5 నాటౌట్) జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చారు.

ఇక ఇంగ్లండ్ తో అమీతుమీ..

ఐదుసార్లు చాంపియ‌న్ టీమ్ఇండియా... 2022లో చివ‌ర‌గా టైటిల్ కొట్టింది. 2024లో ర‌న్న‌ర‌ప్ గా (ఆస్ట్రేలియా విన్న‌ర్) నిలిచింది. ఏజ్ గ్రూప్ టోర్న‌మెంట్ కాబ‌ట్టి ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హిస్తుంటారు. ఆస్ట్రేలియా నాలుగుసార్లు టైటిల్ కొట్టింది. 1998 త‌ర్వాత ఇంగ్లండ్ ఇంత‌వ‌ర‌కు ఈ క‌ప్ ను సాధించ‌లేదు. కాగా, పాకిస్థాన్ రెండుసార్లు, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికా ఒక్కోసారి అండ‌ర్ 19 ప్ర‌పంచ క‌ప్ ను నెగ్గాయి.

ఈసారి మ‌న‌దే క‌ప్...!

ప్ర‌స్తుత ప్ర‌పంచ క‌ప్ ను జింబాబ్వే, న‌మీబియా దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. శుక్ర‌వారం జ‌రిగే ఫైన‌ల్లో భార‌త్ హాట్ ఫేవ‌రెట్ గా బ‌రిలో దిగ‌నుంది. గ‌త నెల 12న ఇంగ్లండ్ పై ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓడినా.. మొత్త‌మ్మీద చూస్తే మ‌న జ‌ట్టుదే పైచేయి. ఇంకేం.. మ‌న కుర్రాళ్లు ఆరేయడం ఖాయం అనుకోవాలి.

Tags:    

Similar News