టి 20 ప్రపంచ కప్.. బంగ్లాలా తోకాడిస్తున్న పాకిస్థాన్..ఇక కత్తెరే
బంగ్లాదేశ్ కు మద్దతుగా పాక్ టి20 ప్రపంచ కప్ నుంచి వైదొలగుతుందట... అలాకాకుండా శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తుందట.;
సరిహద్దుల్లోనే కాదు.. క్రీడల్లోనూ పాకిస్థాన్ తన కపట బుద్ధిని చాటుకుంటోంది. అనేకసార్లు భారత్ చేతిలో భంగపాటుకు గురైనా బుద్ధి మార్చుకోవడం లేదు. ఇటీవలి కాలంలో మన దేశంలో చేతిలో యుద్ధంలో, మైదానంలో చావు దెబ్బలు తిన్నా పాక్ కు మాత్రం మంచి ఆలోచనలు రావడం లేదు. భారత్ లో జరిగే టి20 ప్రపంచ కప్ లో పాల్గొనవద్దని తాజాగా బంగ్లాదేశ్ నిర్ణయించుకోగా, దానిని ఆసరాగా తీసుకుని పాకిస్థాన్ తోక జాడించాలని చూస్తోంది. ఒకవేళ అదే పనిచేస్తే .. తోక మొత్తం కోతకు పడడం ఖాయం.అది కూడా తోక ఇక ఎప్పటికీ జాడించలేని స్థాయిలో కావడం గమనార్హం.
మంచిగా ఉంటే పాక్ కే అవకాశం దక్కేది
భారత్ తో మంచిగా ఉండి ఉంటే పాకిస్థాన్ కు శ్రీలంక బదులుగా టి20 ప్రపంచ కప్ ఆతిథ్యం అవకాశం దక్కేది. కానీ, అదే చేస్తే అది పాకిస్థాన్ ఎందుకు అవుతుంది? దాని తీరు ఎప్పటికీ మారదు కదా? ఇది చాలదన్నట్లు బంగ్లాదేశ్ టి20 ప్రపంచ కప్ నుంచి తప్పుకోవడాన్ని తనకు అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది. మెగా టోర్నీలో పాల్గొనేది లేనిది వచ్చే శుక్రవారం లేదా సోమవారాల్లో నిర్ణయం తీసుకుంటామని పాక్ క్రికెట్ బోర్డు (పీబీసీ) చెబుతోంది.
బంగ్లాకు మద్దతా?
బంగ్లాదేశ్ కు మద్దతుగా పాక్ టి20 ప్రపంచ కప్ నుంచి వైదొలగుతుందట... అలా కాకుండా శ్రీలంక రాజధాని కొలంబోలో భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తుందట. లేదంటే నల్ల బ్యాడ్జీలతో మైదానంలోకి దిగుతుందట..! కాగా, పాక్ గనుక టి20 ప్రపంచ కప్ లో ఆడకుంటే అది ఆ దేశ క్రికెట్ బోర్డు, ఆ దేశానికి భారీ దెబ్బగా మారుతుంది. ఎందుకంటే.. పాక్... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పూర్తికాల సభ్య దేశం. ఏదైనా ఐసీసీ టోర్నీ ఉంటే దాంట్లో పాల్గొనడంపై కొన్ని నెలల ముందే సంతకం చేస్తాయి. చివర్లో తప్పుకుంటే గనుక అది భారీగా ఆర్థిక నష్టానికి దారితీస్తుంది.
రూ.316 కోట్లు ఇవ్వం.. సభ్యత్వం రద్దు చేస్తాం..
టి20 ప్రపంచ కప్ లో పాక్ పాల్గొనకుంటే భారత కరెన్సీలో రూ.316 కోట్లు. (పాక్ కరెన్సీలో చూస్తే రూ.500 కోట్ల వరకు) ఇవ్వబోం అని ఐసీసీ తేల్చిచెప్పింది. ఇది ఐసీసీకి ఏటా వచ్చే ఆదాయంలోంచి ఆయా దేశాలకు వచ్చే వాటా. పాక్ క్రికెట్ బోర్డుది అసలే దివాలా పరిస్థితి. ఇక ఆ మాత్రం డబ్బులు కూడా రాకుంటే ఎత్తిపోవడమే. ప్రభుత్వం గనుక జోక్యం చేసుకున్నట్లు తెలిస్తే పాక్ సభ్యత్వమూ రద్దు చేస్తామని ఐససీ హెచ్చరించింది. ఆసియాకప్ లో ఆడకుండా నిషేధం, 2028 మహిళల టి20 ప్రపంచకప్ ఆతిథ్యం హక్కులను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. పాక్ ఆటగాళ్లను విదేశీ లీగ్ లలో ఆడనివ్వకుండా చేస్తుంది. పాక్ లీగ్.. పీఎస్ఎస్ లో ఎవరూ పాల్గొనవద్దని విదేశీ ఆటగాళ్లకు సూచిస్తుంది. మిగతా జట్లేవీ పాక్ తో సిరీస్ లు ఆడకుండా ఐసీసీ కఠిన చర్యలకు దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇన్ని పరిణామాలు ఎదుర్కొనాల్సిన నేపథ్యంలో.. పాక్ ప్రభుత్వం దుస్సాహసానికి ఒడిగట్టదని క్రీడా పండితులు పేర్కొంటున్నారు.