ఈ రనౌట్.. నైతికమా? అనైతికమా? ప్రపంచ క్రికెట్ లో చర్చ-రచ్చ
మెహదీ హసన్ మిరాజ్ వేసిన 39వ ఓవర్ లో పాక్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ కొట్టిన షాట్ కు బంతి వచ్చి నాన్ స్ట్రయికింగ్ లో ఉన్న ఆఘా బ్యాట్ కు తగిలింది.;
ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు రెండు దేశాల మధ్య జరుగుతున్న సిరీస్ కేవలం ఒకటే ఒకటి..! అది పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్. భారత్ లో గత వారం ముగిసిన టి20 ప్రపంచ కప్ ను బంగ్లాదేశ్ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి పాక్ ఒక దశలో వత్తాసు కూడా పలికింది. భారత్ తో తాము మ్యాచ్ ఆడేది లేదంటూ బీరాలు పోయింది. చివరకు తోక ముడిచింది. ఇప్పుడు పాకిస్థాన్.. బంగ్లాలో పర్యటిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి వన్డేలో పాక్ దారుణంగా ఓటమిపాలయింది. శుక్రవారం రెండో వన్డేలో మాత్రం పాక్ గెలిచి పరువు నిలుపుకొంది. అప్పటికీ తొలుత బ్యాటింగ్ చేసి 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఈమాత్రం స్కోరును ఛేదించలేక 114 పరుగులకే చాపచుట్టేసింది. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉంది. అయితే, శుక్రవారం నాటి మ్యాచ్ లో పాక్ బ్యాట్స్ మన్ సల్మాన్ ఆఘా (టి20 కెప్టెన్) రనౌట్ వ్యవహారం ప్రపంచ క్రికెట్ లో చర్చకు రచ్చకు దారితీస్తోంది.
బంతిని చేతికి ఇవ్వబోయి..
మెహదీ హసన్ మిరాజ్ వేసిన 39వ ఓవర్ లో పాక్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ కొట్టిన షాట్ కు బంతి వచ్చి నాన్ స్ట్రయికింగ్ లో ఉన్న ఆఘా బ్యాట్ కు తగిలింది. అప్పటికే ఆఘా క్రీజు బయటకు వచ్చాడు. బౌలర్ మిరాజ్.. బంతిని తీసుకునే ప్రయత్నం చేస్తుండగా, ఆఘాని అందుకుని వికెట్లకేసి కొట్టాడు. అనంతరం అంపైర్ కు హౌ ఈజ్ దట్ అంటూ అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ కుమార ధర్మసేనకు నివేదించాడు. చివరకు ఆఘా ఔట్ అనే ఫలితం వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన అతడు గ్లౌజ్ లు, బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. పెవిలియన్ కు చేరుతూ కూడా హెల్మెట్ ను విసిరేశాడు.
అసలు అవసరమా?
ఆఘా అంతర్జాతీయ అనుభవం ఉన్న క్రికెటర్. పాక్ టి20 కెప్టెన్ కూడా. అలాంటివాడు రూల్స్ పట్ల కనీస అవగాహన లేకుండా వ్యవహరించాడని కొందరు.. అతడు చేసినదాంట్లో తప్పేమీ లేదని, క్రీడా స్ఫూర్తి కొరవడింది బంగ్లా జట్టు (ముఖ్యంగా మిరాజ్)లోనే అని మరికొందరు వాదించడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆఘా.. బంతి డెడ్ అయినట్లుగా భావించి బౌలర్ కు అందించేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్న వైనాన్ని చూపుతూ సమర్థిస్తుండగా.. బౌలర్ యాక్షన్ లో ఉండగా అసలు అతడికి ఆ అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా క్రీజు బయట ఉన్న సంగతిని గుర్తుచేస్తున్నారు.
ఏది న్యాయం..?
సల్మాన్ ఆఘా చేసినది సరైనదా? బంగ్లా క్రికెటర్ల తీరు సరైనదా? అంటే, ఇక్కడ లోపించినది క్రీడా స్ఫూర్తి అని చెప్పాలి. వాస్తవానికి మ్యాచ్ లో ఇలాంటివి చూసీ చూడనట్లు పోవాలి. కానీ, అదేదో ఔట్ చేసేందుకు వచ్చిన అవకాశం అని బంగ్లా ఆటగాళ్లు ప్రవర్తించారు. ఈ సందర్భంగానే గతంలో శ్రీలంక ప్లేయర్ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ షమీ వ్యవహరించిన తీరును గుర్తుచేస్తున్నారు. ఔట్ అయినప్పటికీ.. లంక బ్యాటర్ ను వెనక్కు పిలిచిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.