పాక్ ప్లేయర్ ఎంపికపై సెగలు.. సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీకి ఊహించని షాక్!

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక 'ది హండ్రెడ్' టోర్నమెంట్ వేలంలో చోటుచేసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది;

Update: 2026-03-13 04:56 GMT

అసలే మనోళ్లకు.. వాళ్లకు పడదు.. అందులోనూ గతంలో మన దేశంపై నోరు పారేసుకున్న పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌నే ఏరికోరి ఏరినందుకు" నెటిజన్లు ఇప్పుడు సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ గారికి 'బిగ్ సెల్యూట్' కొడుతున్నారు. పక్కాగా ఐపీఎల్ టైమ్‌లోనే ఇలాంటి 'సెల్ఫ్ గోల్' వేసుకోవడం సన్‌రైజర్స్‌కు మాత్రమే సాధ్యమని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అటు అకౌంట్ చూస్తే 'ఎక్స్' లో మాయమైపోయింది.. ఇటు ఫ్యాన్స్ చూస్తే 'బాయ్‌కాట్' అంటూ బ్యాట్లు ఎత్తేశారు. మొత్తానికి వికెట్లు తీస్తాడో లేదో తెలియదు కానీ అబ్రార్ రాకతో సన్‌రైజర్స్ పరువు మాత్రం గాల్లో 'గూగ్లీ'లు తిరుగుతోంది!

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ప్రతిష్టాత్మక 'ది హండ్రెడ్' టోర్నమెంట్ వేలంలో చోటుచేసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేయడం పెను వివాదానికి దారితీసింది. సుమారు ₹2.34 కోట్లు వెచ్చించి అతడిని దక్కించుకోవడంపై భారతీయ క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్) మద్దతుదారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివాదానికి అసలు కారణం ఏమిటి?

సాధారణంగా విదేశీ లీగ్‌లలో పాక్ ఆటగాళ్లను ఇతర ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం సహజమే అయినప్పటికీ అబ్రార్ అహ్మద్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. గతంలో అబ్రార్ సోషల్ మీడియా వేదికగా భారతదేశాన్ని, భారత సైన్యాన్ని కించపరిచేలా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దేశ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన ఆటగాడికి భారతీయ మూలాలున్న ఫ్రాంచైజీ మద్దతు తెలపడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ యజమాన్యాలు విదేశీ లీగ్‌లలో జట్లను కొనుగోలు చేసినప్పుడు వారు పాక్ ఆటగాళ్లకు దూరంగా ఉంటారనే అలిఖిత నిబంధనను పాటిస్తారని భావిస్తారు. కానీ కావ్య మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

సోషల్ మీడియాలో 'బహిష్కరణ' సెగ

ఈ వ్యవహారం బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. #BoycottSRH , #ShameOnSRH వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్స్ (ట్విట్టర్)లో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. "దేశం కంటే ఆట ఏమీ ఎక్కువ కాదు" అంటూ కొందరు అభిమానులు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లను చూడబోమని స్పష్టం చేస్తున్నారు. జట్టు యజమాని కావ్య మారన్‌ను టార్గెట్ చేస్తూ "డబ్బు కోసం దేశభక్తిని ఫణంగా పెడతారా?" అంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్: 'ఎక్స్' ఖాతా సస్పెండ్!

వివాదం ముదురుతున్న తరుణంలో సన్‌రైజర్స్ లీడ్స్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన అధికారిక ఎక్స్ ఖాతా అకస్మాత్తుగా సస్పెండ్ అయ్యింది. అబ్రార్ ఎంపికపై ఆగ్రహంతో ఉన్న వేలాది మంది యూజర్లు సదరు ఖాతాపై 'మాస్ రిపోర్టింగ్' చేయడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్ నిబంధనల ఉల్లంఘన కింద ఈ చర్య తీసుకున్నట్లు కనిపిస్తున్నా టెక్నికల్ కారణాల కంటే ప్రజల నిరసన ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది.

ఫ్రాంచైజీ ఇమేజ్‌కు ముప్పు?

ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉంది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే ఇప్పుడు మైదానం వెలుపల జరుగుతున్న ఈ పరిణామాలు జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారాయి. అబ్రార్ అహ్మద్‌ విషయంలో ఫ్రాంచైజీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అధికారికంగా వివరణ ఇస్తుందా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా ఒక చిన్న వేలం నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.



Tags:    

Similar News