ఐపీఎల్-19 షెడ్యూల్.. హైఓల్టేజ్ మ్యాచ్ లేదు.. తొలుత 20 మాత్రమే!

ప్ర‌పంచ క‌ప్ సంబరం ముగిసింది.. టీమ్ఇండియా క‌ప్ గెలిచిన ఆనందం ఆస్వాదిస్తుండ‌గానే.. అభిమానుల‌ను అల‌రించేందుకు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) వ‌చ్చేసింది.;

Update: 2026-03-11 17:50 GMT

ప్ర‌పంచ క‌ప్ సంబరం ముగిసింది.. టీమ్ఇండియా క‌ప్ గెలిచిన ఆనందం ఆస్వాదిస్తుండ‌గానే.. అభిమానుల‌ను అల‌రించేందుకు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) వ‌చ్చేసింది. ప్ర‌పంచంలోనే ధ‌నిక లీగ్ ఐపీఎల్.. ముందుగా అనుకున్న దానికంటే రెండు రోజులు వెన‌క్కు జ‌రిగింది. ఈ నెల 28 నుంచి లీగ్ షురూ కానుంది. అయితే, ఎప్ప‌టిలా హై ఓల్టేజ్ మ్యాచ్ లేక‌పోవ‌డం ఈసారి ప్ర‌త్యేక‌త‌. అంటే.. నిరుటి సీజ‌న్ లో చాంపియ‌న్ గా నిలిచిన జ‌ట్టు, ర‌న్న‌ర‌ప్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ తో కొత్త సీజ‌న్ మొద‌ల‌వ‌డం. కానీ, కార‌ణాలు ఏమైనా.. ఈసారి మొద‌ట‌ డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), ర‌న్న‌ర‌ప్ప పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ‌డం లేదు. ఆర్సీబీని మ‌న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఢీకొన‌నుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ సొంత‌గ‌డ్డ బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

మ‌రొక్క 17 రోజులే..

ముందుగా అనుకున్న ప్ర‌కారం అయితే, ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 19వ సీజ‌న్ ఈ నెల 26 నుంచే మొద‌ల‌వ్వాలి. కానీ, టి20 ప్రపంచ క‌ప్ సంద‌డి నేప‌థ్యంలో, ఆట‌గాళ్ల‌కు కాస్తంత రిలాక్సేష‌న్ ఇచ్చేందుకు రెండు రోజులు ముందుకు జ‌రిపారు. దీంతో లీగ్ 28న మొద‌లుకానుంది. మ‌రుస‌టి రోజు ముంబై ఇండియ‌న్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, 30న రాజ‌స్థాన్ రాయ‌ల్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్, 31న పంజాబ్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ‌తాయి.

20 మ్యాచ్ లు మాత్ర‌మే..

ఈ వేస‌విలో ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వీటిలో త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్, అసోం, కేర‌ళంతో పాటు కేంద్ర పాలిత పుదుచ్చేరి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ తొలుత 20 మ్యాచ్ ల‌కే ప‌రిమితం కానుంది. అంటే, ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ్డాక ఐపీఎల్ మిగ‌తా మ్యాచ్ ల వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. ఏప్రిల్ 12తో 20 మ్యాచ్ ల షెడ్యూల్ పూర్తికానుంది. ఈలోగానే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తేదీలు వ‌స్తాయి. ఆ త‌ర్వాత కొత్త ప్ర‌ణాళిక‌ల‌ను వివ‌రించ‌నున్నారు.

Tags:    

Similar News