మైదానంలో దిగకముందే టీమిండియాకు భయపడిన పాకిస్తాన్.. చేతులెత్తేసింది..
క్రీడలంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు, అంతకు మించిన క్రీడా స్ఫూర్తి. కానీ, రాబోయే టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఆ స్ఫూర్తికే విరుద్ధంగా ఉంది.;
క్రీడలంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు, అంతకు మించిన క్రీడా స్ఫూర్తి. కానీ, రాబోయే టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఆ స్ఫూర్తికే విరుద్ధంగా ఉంది. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ నుంచి పాకిస్తాన్ తప్పుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. పోరాడి ఓడిపోవడం గౌరవప్రదం.. కానీ పోరాడకుండానే వెనకడుగు వేయడం ఆ జట్టు బలహీనతను, నైతిక పతనాన్ని సూచిస్తోంది.
భయం వెనుక గణాంకాల భారమా?
"ఆడలేక మద్దెల ఓడు" అన్న సామెత ప్రస్తుతం పాక్ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. చరిత్ర పుటలు తిరగేస్తే, ప్రపంచకప్ వేదికలపై భారత్‌ను ఎదుర్కోవడంలో పాకిస్తాన్ ఎప్పుడూ తడబడుతూనే ఉంది. వన్డే ప్రపంచకప్‌లో 8-0 క్లీన్ స్వీప్ రికార్డు, టీ20 ప్రపంచకప్‌లోనూ అదే తరహా పేలవ ప్రదర్శన ఆ జట్టు మానసిక ధైర్యాన్ని దెబ్బతీసి ఉండవచ్చు. మైదానంలో ఎదురయ్యే అవమానం కంటే ఆడకుండా తప్పించుకోవడమే మేలని పాక్ భావించిందా? అన్న అనుమానాలు సోషల్ మీడియాలో సెటైర్లకు తావిస్తున్నాయి.
పాయింట్ల వేటలో భారత్‌కు భారీ ఊరట
ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ 'ఫోర్ఫిట్' (తప్పుకోవడం) చేయడంతో భారత్‌కు అనాయాసంగా రెండు పాయింట్లు లభించాయి. ఇది గ్రూప్-ఏ సమీకరణాలను పూర్తిగా భారత్‌కు అనుకూలంగా మార్చేసింది. నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా వంటి జట్లతో తదుపరి మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో భారత్ సూపర్-8కు చేరడం ఇప్పుడు నల్లేరుపై నడకలా మారింది. మరోవైపు పాకిస్తాన్ తన సెమీస్ ఆశలను స్వయంగా క్లిష్టతరం చేసుకుంది.
క్రికెట్‌కు ఇది చేదు పరిణామం
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే 'హై-వోల్టేజ్' డ్రామా భారత్-పాక్ సమరం. రాజకీయాలను, దౌత్యపరమైన విభేదాలను క్రీడా మైదానంలోకి తీసుకురావడం ఆట యొక్క మౌలిక సూత్రాలకే విఘాతం. అభిమానుల ఆగ్రహం సబబే.. ఎందుకంటే వారు కోరుకునేది మైదానంలో హోరాహోరీ పోరును.. కానీ ఇలాంటి ఏకపక్ష 'వాకోవర్'లను కాదు.
మైదానంలో దిగకుండానే వెనక్కి తగ్గడం ద్వారా పాకిస్తాన్ తన అశక్తతను చాటుకుంది. భారత్ టోర్నీని భారీ ఆధిక్యంతో ప్రారంభించినా ఒక గొప్ప మ్యాచ్‌ను వీక్షించే అవకాశం క్రికెట్ అభిమానులకు చేజారడం విచారకరం. పాకిస్తాన్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే అది ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపైనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో వారి ప్రతిష్ఠపై కూడా చెరగని ముద్ర వేస్తుంది.