ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ మృతి

అన్నమయ్య జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంబేపల్లి మండలం యర్రగుంట్ల సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.;

Update: 2025-04-07 10:46 GMT

అన్నమయ్య జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంబేపల్లి మండలం యర్రగుంట్ల సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా కెనాల్‌ (హెచ్‌ఎన్‌ఎస్‌) పీలేరు యూనిట్‌-2 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి (50) మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఉదయం చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై యర్రగుంట్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి వెళ్తుండగా రమాదేవి ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన రమాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతి చెందిన డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

రమాదేవి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ విధుల్లో భాగంగా రాయచోటి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన ట్వీట్ చేశారు.

మంత్రి లోకేష్ కూడా రమాదేవి మృతికి సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదం అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News