మార్చి 27.. ఈ తేదీ తర్వాత వైభవ్ సూర్యవంశీ టీమ్ఇండియాలోకి!
సరిగ్గా ఏడాది కిందట కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడతాడనే కథనాలు వచ్చినప్పుడు అంతా ఊహాగానాలే అని కొట్టిపారేశారు.;
సరిగ్గా ఏడాది కిందట కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడతాడనే కథనాలు వచ్చినప్పుడు అంతా ఊహాగానాలే అని కొట్టిపారేశారు. సంవత్సరం ముగిశాక ఇప్పుడు చూస్తే.. వైభవ్ ను టీమ్ఇండియాలోకి ఎప్పుడు తీసుకుంటారు? అనే ప్రశ్నలు వరుసగా వస్తున్నాయి. ఇదేదో తాజాగా ముగిసిన అండర్ -19 ప్రపంచ కప్ విజయం అనంతరం కాదు.. ఆరు నెలల కిందటి నుంచే సూర్యవంశీని భారత జట్టులోకి తీసుకుకోవాలని కోరుతున్నారు. అయితే, కేవలం 14 ఏళ్ల సూర్యవంశీని 140 కిలోమీటర్లపైగా వేగంతో బంతులు వేసే అంతర్జాతీయ క్రికెట్ ఆడించడం సరైనదేనా? అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మాత్రం ఇంత చిన్న కుర్రాడిని ఎలా ఆడనిస్తుందనే విమర్శలు తలెత్తాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి? అని వెదికిన వారు కూడా ఉన్నారు. కానీ, అదంతా గతం. ఇప్పుడు అసలు విషయం ఏమంటే.. వైభవ్ రేపోమాపో టీమ్ ఇండియా గడప తొక్కడం ఖాయం. అది కూడా వచ్చే జూన్ లోనే అయినా ఆశ్చర్యం లేదు.
ముందు వచ్చే ఐపీఎల్..
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ మార్చి 27న మొదలుకానుంది. సరిగ్గా అదే రోజుతో వైభవ్ 15 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం.. జాతీయ జట్టుకు ఎంపిక చేసేందుకు 15 ఏళ్లు నిండాలి. అంటే, వైభవ్ టీమ్ఇండియా ఎంట్రీకి మార్గం సుగమం అయినట్లే. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున గత సీజన్ లో నాటి కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా మధ్య నుంచి మ్యాచ్ లు ఆడాడు సూర్యవంశీ. ఈసారి మాత్రం నేరుగా ఓపెనింగ్ కు దిగే చాన్సుంది. సంజూ.. చెన్నై సూపర్ కింగ్స్ కు వెళ్లిపోవడంతో వైభవ్ కు రాజస్థాన్ ఓపెనింగ్ స్లాట్ ఖాయమైంది. టీమ్ఇండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తో కలిసి ఇన్సింగ్స్ ఓపెనింగ్ చేస్తాడు.
ఆ తర్వాత టీమ్ ఇండియాలోకే?
ఐపీఎల్ మే నెలాఖరుకు అయిపోతుంది. ఆ తర్వాత టీమ్ఇండియా జూన్ నుంచి మ్యాచ్ లు ఆడనుంది. జూన్ లో అఫ్ఘానిస్థాన్ మన దేశానికి రానుంది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడాల్సిన ఈ సిరీస్ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే, జూలైలో టీమ్ఇండియా టి20 సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ రెండింటిలో దేనికైనా సూర్యవంశీని తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.. అదే జరిగితే, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (16 ఏళ్లు) తర్వాత అత్యంత చిన్న వయసులో టీమ్ఇండియాకు ఎంపికైన క్రికెటర్ గా వైభవ్ చరిత్రలో నిలిచిపోతాడు.