అమెరికాలో ఇండియన్స్ కు సెగ మొదలైంది..

ఫిబ్రవరి 3న జరిగిన ఫ్రిస్కో కౌన్సిల్ సమావేశానికి సోషల్ మీడియా కన్జర్వేటివ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు కైలీ కాంబెల్, మార్క్ పలాసియానో పిలుపునిచ్చారు.;

Update: 2026-02-07 06:47 GMT

అమెరికాలో స్థిరపడిన భారతీయులకు ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులకు గడ్డుకాలం మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరంలో ఇటీవల జరిగిన సిటీ కౌన్సిల్ సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది. భారతీయుల జనాభా పెరుగుదలపై కొందరు స్థానిక నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండో-అమెరికన్లలో తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.

అసలేం జరిగింది?

ఫిబ్రవరి 3న జరిగిన ఫ్రిస్కో కౌన్సిల్ సమావేశానికి సోషల్ మీడియా కన్జర్వేటివ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు కైలీ కాంబెల్, మార్క్ పలాసియానో పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మాస్కులు 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' టోపీలు ధరించి వచ్చిన కొందరు వ్యక్తులు భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రధాన ఆరోపణలు ఇవే

హెచ్-1బీ వీసాదారులు అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని మార్క్ పలాసియానో ఆరోపించారు. ఫ్రిస్కోలో భారతీయుల సంఖ్య అసాధారణంగా పెరగడం వెనుక కుట్ర ఉందని ఇది యాదృచ్ఛికం కాదని వ్యాఖ్యానించారు. వీసాల జారీ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని.. దీనివల్ల స్థానికులకు నష్టం జరుగుతోందని వారు వాదించారు.

గణాంకాలు చెబుతున్న వాస్తవం

గడిచిన దశాబ్ద కాలంలో ఫ్రిస్కో నగర ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ సర్వేల ప్రకారం 2010లో భారతీయ మూలాలున్న జనాభా కేవలం 10% శాతం మాత్రమే.. ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 33%కి చేరింది. నగరంలోని ఐటి రంగానికి ఆర్థిక వ్యవస్థకు భారతీయులు వెన్నెముకగా మారారు. అయితే ఇదే అంశాన్ని ఇప్పుడు కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం గమనార్హం.

ధీటుగా స్పందించిన భారతీయులు

కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఈ పరిణామాలపై ఇండో-అమెరికన్లు మౌనంగా ఉండలేదు. అక్కడికక్కడే కన్జర్వేటివ్ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. "మేము ఇక్కడికి చట్టబద్ధంగా వచ్చాము. పన్నులు చెల్లిస్తూ ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాము. వీసా విధానంలో సమస్యలు ఉంటే ప్రభుత్వంతో తేల్చుకోవాలి కానీ ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషాన్ని చిమ్మడం సరికాదు" అని వారు స్పష్టం చేశారు.

అండగా నిలిచిన మేయర్

నగరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఫ్రిస్కో మేయర్ జెఫ్ చేనీ సానుకూలంగా స్పందించారు. నగరంలో నివసించే ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం ఉంటుందని.. జాతి వివక్షకు తావులేదని ఆయన భరోసా ఇచ్చారు. వలసదారుల కృషి వల్లే ఫ్రిస్కో అగ్రగామిగా నిలిచిందని ఆయన కొనియాడారు.

అమెరికాలో ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న కొద్దీ వలస విధానాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫ్రిస్కో ఘటన కేవలం ఒక నగరానికి పరిమితం కాకుండా అమెరికా అంతటా ఉన్న భారతీయులలో చర్చకు దారితీస్తోంది. చట్టబద్ధంగా ఉంటూ దేశానికి సేవలందిస్తున్న తమపై ఇలాంటి దాడులు జరగడం పట్ల ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News