రాహుల్ గ్రాఫ్ పెరుగుతోందా...రీజన్ ఏంటి ?

మోడీ వర్సెస్ రాహుల్ అన్నది గత మూడు ఎన్నికలుగా దేశంలో సాగుతూ వస్తోంది. ఒక్కో ఎన్నికకూ కాంగ్రెస్ తన సీట్ల ఓట్ల షేర్ ని పెంచుకుంటూ కూడా వస్తోంది.

Update: 2026-07-21 22:30 GMT

దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మీద ఎపుడూ ప్రజలకు ఒక ఫోకస్ ఉంటుంది. ఆయనను తరువాత కాలానికి ప్రధానిగా కూడా చూస్తారు. కొన్ని దేశాలలో అయితే వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ గా అపొజిషన్ లీడర్లను పేర్కొంటారు. ఇక భారత్ లో రాహుల్ గాంధీ రాజకీయ నేపథ్యం, ఆయన వంశీకుల చరిత్ర, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చూసుకున్నపుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నది ఎక్కువ మంది అభిప్రాయపడతారు. అయితే నరేంద్ర మోడీ ఇమేజ్ ముందు రాహుల్ గాంధీ కొంత తగ్గినట్లుగా గడచిన ఎన్నికలలో కనిపించారు. మోడీ వర్సెస్ రాహుల్ అన్నది గత మూడు ఎన్నికలుగా దేశంలో సాగుతూ వస్తోంది. ఒక్కో ఎన్నికకూ కాంగ్రెస్ తన సీట్ల ఓట్ల షేర్ ని పెంచుకుంటూ కూడా వస్తోంది.

ఆ ఎన్నికలు కీలకంగా :

ఇదిలా ఉంటే 2024లో ఇండియా కూటమి సమిష్టిగా 232 సీట్లు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకుంది. 2019లో కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న దానితో పోలిస్తే ఇది గణనీయంగా మెరుగుపడిందని చెప్పాలి. ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షాలలో ఒకటి అయిన సమాజ్‌వాదీ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లోని 80 స్థానాలకు గాను 37 స్థానాలను గెలుచుకుని అక్కడ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిగిలిన మిత్రులు కూడా 2024 లో మంచి రాజకీయ ప్రదర్శన ఇవ్వడంతో ఇండియా కూటమి అధికారానికి సరిపడా అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ 272 కి 40 సీట్ల దూరంలో నిలిచింది. మరో వైపు చూస్తే బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీయే మొత్తం 292 సీట్లు గెలుచుకుంది. అంటే ఇండియా బ్లాక్ కి ఎన్డీయేకి మధ్య తేడా కేవలం 50 సీట్లు మాత్రమే. ఇందులో బీజేపీ సొంతంగా 240 సీట్లు మాత్రమే గెలుచుకున్న క్రమంలో మిత్రుల సాయం తీసుకోక తప్పింది కాదు.

రెండేళ్ళలో మార్పుగా :

ఇక మూడవసారి మోడీ ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉంది. టోటల్ గా చూస్తే పన్నెండేళ్ళుగా మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో అనేక మెరుపులు ఉన్నాయి, విరుపులూ ఉన్నాయి.ఇక 2029 నాటికి పదిహేనేళ్ళు పూర్తి చేసుకోనున్న ఎన్డీయే ప్రభుత్వానికి గణనీయమైన అవకాశాలనే దేశ ప్రజలు కట్టబెట్టారు అన్న అభిప్రాయం కూడా అంతటా ఉంది. ఇంకో విషయం ఏమిటి అంటే బీజేపీ రెండు టెర్ముల కంటే మూడవ టెర్ములో ప్రభుత్వ విజయాలు పెద్దగా లేవన్న భావన కూడా వ్యక్తం అవుతోంది, కొత్త పధకాలు కానీ కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రచారం చేసుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు.

యువతలో అసహనం :

ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ రంగంలో కోతలు ఉంటున్నాయి. ప్రభుత్వ విధానం చూస్తే ప్రైవేట్ రంగం విస్తరించాలని ఆలోచన ఉంది. అక్కడ ఉపాధి సృష్టి జరుగుతుందని భావించినా ఆశించిన స్థాయిలో అది లేదని అంటున్నారు. ఇక ఏఐ వంటి కొత్త సాంకేతికత వచ్చిన తరువాత ప్రైవేట్ లో ఉపాధి అవకాశాలు ఇంకా తగ్గుతాయని అంటున్నారు. వీటిని అన్నింటి నేపథ్యంలో నిరుద్యోగ యువతలో అసహనం మొదలైంది అని అంటున్నారు. లేకపోతే పేరూ ఊరూ లేని ఒక వాట్సప్ పార్టీ ఇచ్చిన పిలుపునకు యువత ఉవెత్తి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు.

రాహుల్ వ్యూహాలు :

మోడీ 56 ఏళ్ళ యువకుడు అని రాహుల్ గాంధీని సెటైరికల్ గా విమర్శించినా కూడా యువతతో రాహుల్ గాంధీ బాగానే కనెక్ట్ అవుతున్నారు. ఆయన తనదైన వ్యూహాలతో యువత నాడి పట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే మోడీ వర్సెస్ రాహుల్ పోలిక రాహుల్ కి కలసి వస్తోంది. మోడీ అనుభవం ముందు రాహుల్ మూడు ఎన్నికల్లో తేలిపోవడం అంతా చూశారు. కానీ జెన్ జీ తరం ఇపుడు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. అపుడు వారికి రాహుల్ లో యూత్ లీడర్ కనిపించడం యాధృచ్చికమైనదిగానే చూడాల్సి ఉంటుంది అని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ప్రవచిస్తున్న ఫిలాసఫీ కూడా కొత్త తరానికి ఆకట్టుకునే అంశాలుగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

కచ్చితంగా ఆల్టర్నేషన్ వైపుగా :

మరో వైపు రైతులు ప్రధాన సెక్షన్ గా ఉన్నారు. వారు కూడా ప్రభుత్వం మీద అసంత్పృతిగా ఉన్నారని అంటున్నారు. మరో ఉద్యమానికి వారు సిద్ధపడుతున్నారు. ఇక ధరల పెరుగుదల ఇతరత్రా అంశాల మీద సగటు జనంలో ఆవేదన పెరుగుతోంది. మంచి ఉద్దేశ్యంతో అమలు చేస్తున్నామని చెప్పినా సర్ ప్రక్రియ మాత్రం తమ ఓటు పోయేలా చేస్తోంది అన్న బెంగ సామాన్యుడిలో ఉంది. పెట్రోల్ లో ఇథనాల్ మిక్సింగ్ కూడా వారిని కలవరం పరచేదిగా ఉంటోంది. ఇంకా చెప్పాలీ అంటే దేశీయంగా అనేక సమస్యలు ఉన్నాయి. బీజేపీ విదేశీ విజయాలు కానీ దేశ రక్షణ రంగంలో తీసుకున్న నిర్ణయాలు కానీ వచ్చే ఎన్నికలలో ఏ మేరకు ప్రభావితం చేస్తాయి అన్నది కూడా చూడాలి, అదే సమయంలో దేశంలో పెరుగుతున్న సమస్యలే సామాన్యుడికి ముఖ్యమనుకున్నపుడు విభిన్న వర్గాలలో అసంతృప్తి పెరిగినపుడు కచ్చితంగా ఆల్టర్నేషన్ వైపుగా చూస్తారు. అదే రాహుల్ గాంధీకి ప్లస్ అవుతోంది అని ఆయన గ్రాఫ్ ఇటీవల కాలంలో పెరగడానికి అదే కారణం అని అంటున్నారు.

Tags:    

Similar News