ధర్మేంద్ర రాజీనామా.. మోడీ తాత్సారం వెనుక రీజనేంటి?!
మరి అలాంటి ప్రధాని.. కేవలం ఓ మంత్రి కోసం.. ఇంతగా వెయిట్ చేయడం.. తన సర్కారుకు బ్యాడ్ నేమ్ వస్తున్నా.. మౌనంగా ఉండడం వంటివి ప్రశ్నగా మారాయి.
ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ ఏడాది మే లో జరిగిన వైద్య విద్య ప్రవేశాల పరీక్ష `నీట్` పేపర్ లీక్ కావడం.. అనంతరం పలువురు విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మ హత్యలు చేసుకోవడంతో మంత్రి చుట్టూ పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ `బాధ్యతను` ప్రశ్నిస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీ జూన్‌లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ధర్నాలు కూడా చేసింది. తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా ఈ నిరసన తెలిపారు.
ఇక, ఈ ధర్నా తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యతగా కేంద్ర మంత్రి రాజీనామాతోపాటు.. ఆత్మ హత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నది ప్రస్తుతం ప్రధాన డిమాండ్లు. ఈ క్రమంలోనే సోమవారం పార్లమెంటు ముట్టడికి కూడా కాక్రోచ్ పార్టీ పిలునిచ్చిన విషయం తెలిసిందే. ఇది ఉద్రిక్తంగా మారి.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో విద్యార్థులు కూడా పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఇదిలావుంటే.. మంగళవారం ఈ నిరసనలు మరింత పుంజుకున్నాయి. మంత్రి రాజీనామాకు పట్టుబడుతూ.. కాంగ్రెస్ నాయకులు కూడా రంగంలోకి దిగారు.
అయితే.. ఇంత జరుగుతున్నా.. ప్రధాని మోడీ మాత్రం కేంద్ర మంత్రి రాజీనామా విషయంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేద ని సమాచారం. ఈ వ్యవహారాన్ని ఆయన లైట్‌తీసుకున్నారని కొందరు భావిస్తున్నారు. కానీ, ఇంత ఉద్రిక్తతలు నెటకొనడం, ఏకంగా ప్రధాని నివాసం ముందు ధర్నాకు ప్రతిపక్షాలు దిగిన నేపథ్యంలో ప్రధాన మంత్రి స్పందించి.. విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయిస్తే.. సరిపోతుందని అందరూ శాంతిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, ఈ పనిచేసేందుకు ప్రధాని సంసిద్ధంగా లేరన్నది బీజేపీ నాయకులు చెబుతున్నారు.
గతంలో..
వాస్తవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంత పట్టుబట్టే నాయకుడు అయితే కాదన్నది గతంలోనూ రెండు విషయాల్లో రుజువయ్యాయి. 1) మూడు వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చినప్పుడు.. రైతులు దేశవ్యాప్తంగా ధర్నాకు దిగారు. దాదాపు ఏడాది న్నర పాటు ఈ నిరసనలు కొనసాగాయి. ఆ తర్వాత..ప్రధాని దిగి వచ్చి.. క్షమాపణలు చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు. 2) జీఎస్టీ. పన్నుల భారం పెరిగిపోయి.. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పుడు కూడా ప్రధాని దిగి వచ్చారు. ఆ వెంటనే జీఎస్టీని తగ్గించడంతోపాటు.. శ్లాబుల్లోనూ మార్పులు చేశారు. ఇలా.. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రధాని దిగివచ్చారు.
ఇప్పుడు..?
మరి అలాంటి ప్రధాని.. కేవలం ఓ మంత్రి కోసం.. ఇంతగా వెయిట్ చేయడం.. తన సర్కారుకు బ్యాడ్ నేమ్ వస్తున్నా.. మౌనంగా ఉండడం వంటివి ప్రశ్నగా మారాయి. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించకపోవడం వెనుక రీజనేంటనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. దీనికి రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. 1) బీజేపీకి బలమైన నాయకుడు, ఒడిశాలో తొలిసారి బీజేపీ సర్కారు ఏర్పడేందుకు శక్తివంచనలేకుండా కృషి చేసిన నేతగా ఆయనకు పేరుంది. 2) ప్రతిపక్షాల డిమాండ్ లేదా.. ఒక వర్గం డిమాండ్‌ను అంగీకరించి.. కేంద్ర మంత్రితో రాజీనామా చేయిస్తే.. రేపు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ రెండు కారణాలతోనే మోడీ ఈ విషయంలో స్పందించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఈ నిరసనలు ఇలానే కొనసాగితే మాత్రం అప్పుడు ఆయనే దిగిరాక తప్పదని కొందరు చెబుతున్నారు.