అమెరికా 'సూపర్' యుద్ధనౌకకు తుప్పు.. అసలు నిజం చూస్తే షాకవ్వాల్సిందే
సాధారణంగా అమెరికా అత్యంత శక్తివంతమైన విమాన వాహక యుద్ధనౌక అంటే ఆకాశాన్నంటే పరిమాణం.. మెరిసిపోయే లోహం, అత్యాధునిక ఆయుధ సంపత్తే మనకు గుర్తుకొస్తాయి.
సాధారణంగా అమెరికా అత్యంత శక్తివంతమైన విమాన వాహక యుద్ధనౌక అంటే ఆకాశాన్నంటే పరిమాణం.. మెరిసిపోయే లోహం, అత్యాధునిక ఆయుధ సంపత్తే మనకు గుర్తుకొస్తాయి. కానీ తాజాగా ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ నౌకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. నీటి మట్టానికి సమీపంలో నౌక అడుగు భాగమంతా భారీగా తుప్పు పట్టి రంగు ఊడిపోయి కనిపించడమే దీనికి కారణం. ప్రపంచంలోనే మహా శక్తివంతమైన నావికా దళానికి చెందిన నౌక ఇలా తయారవ్వడం ఏంటి? దీనికి వెనుక ఉన్న అసలు కారణమేంటి? అనే అంశంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది.
286 రోజుల సుదీర్ఘ సముద్ర ప్రయాణం
సుమారు 1,100 అడుగుల పొడవు ఉండే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ గతేడాది నవంబర్‌లో అమెరికాలోని శాన్ డియాగో పోర్టు నుంచి బయలుదేరింది. కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సహా పలు సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ ఏకంగా 286 రోజుల పాటు నిరంతరాయంగా సముద్రంలోనే గడిపింది. ఇటీవల ఈ నౌక థాయ్‌లాండ్‌లోని లామ్ చబాంగ్ ఓడరేవుకు చేరుకున్న సమయంలో తీసిన చిత్రాలు బయటకు వచ్చాయి.
సముద్రపు ఉప్పు నీటి తీవ్రత, నిరంతరం వీచే తేమతో కూడిన గాలుల వల్ల నౌకల పైపొరల పెయింట్ దెబ్బతినడం చాలా సహజమైన ప్రక్రియ అని రక్షణ రంగానికి చెందిన నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నిర్వహణ ఎందుకు ఆలస్యమైంది?
యుద్ధనౌకలు నిరంతర పెట్రోలింగ్ లేదా మిషన్‌లో ఉన్నప్పుడు, సిబ్బంది నౌక బయటి భాగాన్ని శుభ్రం చేయడం గానీ తుప్పును తొలగించి రంగులు వేయడం గానీ సాధ్యపడదు. మాజీ యూఎస్ నేవీ కెప్టెన్ కార్ల్ తెలిపిన వివరాల ప్రకారం ఏదేని నౌక 60 రోజులకు పైగా సముద్రంలో ఉంటే నీటి మట్టం వద్ద తుప్పు పట్టడం సర్వసాధారణం.
నౌకను తిరిగి పాత రూపునకు తీసుకురావాలంటే నావికా సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలతో నీటి మట్టం దిగువకు దిగాలి. ఉపరితలాన్ని క్లీన్ చేసి, ఉన్న తుప్పును పూర్తిగా తొలగించాలి. మొదట తుప్పు నిరోధక ప్రైమర్ పూయాలి. ఆ తర్వాతే ప్రతిష్టాత్మకమైన నేవల్ గ్రే పెయింట్‌ను వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 30 రోజుల సమయం పడుతుంది. థాయ్‌లాండ్ పోర్టులో ఈ నౌక నిలిచివున్న కొద్ది రోజుల్లోనే కొంతమేర శుభ్రత, మరమ్మతు పనులు ప్రారంభించనున్నారు.
పోరాట సామర్థ్యంపై ప్రభావం చూపుతుందా?
బయటకు చూసేందుకు తుప్పుపట్టి ఉన్నంత మాత్రాన నౌక సామర్థ్యం లేదా పోరాట సజ్జత దెబ్బతిన్నట్లు కాదని నిపుణులు పునరుద్ఘాటించారు. ఇది కేవలం బాహ్య ఉపరితలానికి సంబంధించిన సాధారణ నిర్వహణ అంశం మాత్రమే. 286 రోజుల అత్యంత కఠినమైన సముద్ర ప్రయాణం తర్వాత నౌక నిర్వహణతో పాటు సిబ్బందికి కూడా ఈ థాయ్‌లాండ్ పర్యటన మంచి విశ్రాంతిని, ఉపశమనాన్ని ఇస్తుందని నేవీ వర్గాలు పేర్కొంటున్నాయి.