సీనియర్లను ఇరకాటంలో పెట్టిన అయ్యన్న !
నిజానికి రాజకీయం అలాంటిది. ఆ మోజు ఒక పట్టాన తీరేది కాదు, కానీ అనకాపల్లి జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీరే వేరు.
రాజకీయాల్లోకి ఒకసారి ప్రవేశించడమే కానీ అందులో నుంచి విరమణ అన్నది లేదన్నది అందరికీ తెలిసిందే. వయసు కూడా ప్రశ్న కాదని చాలా మంది భావిస్తారు. అనేక మందికి ఉన్న సాధారణమైన కోరిక ఏమిటి అంటే పదవిలో ఉంటూ అందులోనే పోవాలని. అందుకే వయో వృద్ధులైనా రాజకీయాలను మాత్రం వదలరు, అంతే కాదు ఎన్నికల్లో పోటీకి ప్రతీ సారీ తయారుగా ఉంటారు, వారి విషయంలో పార్టీ కొత్త నిబంధనలు తెచ్చి ఏజ్ ఫ్యాక్టర్ తో పక్కన బలవంతంగా పెడితేనే తప్ప కానీ వారు స్వచ్ఛందంగా తప్పుకోరు. నిజానికి రాజకీయం అలాంటిది. ఆ మోజు ఒక పట్టాన తీరేది కాదు, కానీ అనకాపల్లి జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీరే వేరు.
ఎక్కడా ఆపాలో తెలుసు :
ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని గడచిన మూడు ఎన్నిల నుంచి చెబుతూ వస్తున్నారు. ఆయన చేయని పదవి లేదు, చూడని అధికార హోదా లేదు, ఇక ప్రస్తుతం ఆయన స్పీకర్ గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. దాంతో తన రాజకీయం ఇక చాలు అనుకుంటున్నారు. నిజానికి అయ్యన్న వరకూ చూస్తే ఇది ఉత్తమైన నిర్ణయమే. రాజకీయాల్లో పరుగు మొదలెట్టడం అందరికీ తెలుసు. ఆ పరుగు ఎక్కడ ఆపాలో అయ్యన్న లాంటి నాయకులకు మాత్రమే తెలుసు అని అంటారు. అందుకే అయ్యన్న తన రిటైర్మెంట్ గురించి సందర్భం వచ్చిన ప్రతీ సారీ ఏకంగా బహిరంగ వేదికల మీదన ప్రకటిస్తూ వస్తున్నారు. అయ్యన్న అయితే తాను తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎక్కడా రాజీ పడే తత్వం లేని వారు, గతంలో అయితే పార్టీ కోసం ఆయన వాయిదా వేసుకున్నారు, కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి బాగానే ఉంది కాబట్టి ఇక రిటైర్మెంట్ డెసిషన్ ఆపేది లేదని అంటున్నారు.
ఏజ్ అయిపోయింది అంటూ :
అయ్యన్న దానికి చెబుతున్న కారణం వయసు అయిపోయింది అని. 2029 ఎన్నికల నాటికి తనకు 73 ఏళ్ళు వస్తాయి కాబట్టి తాను తప్పుకుంటాను అంటున్నారు. మళ్లీ పదవులు చేపట్టినా తిరగాలి కదా అని ఆ పని తన వల్ల కాదని చెప్పేస్తున్నారు. ఇక్కడే అయ్యన్న సీనియర్ నేతలను కూడా ఇరకాటంలో పెట్టేశారు అని అంటున్నారు. నిజానికి టీడీపీలో అయ్యన్న కంటే వయసులో పెద్ద నాయకులు ఎంతో మంది ఉన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎనభై ఏళ్ల వారుగా ఉన్నారు. ఆయన కూడా అయ్యన్నతో పాటే 1983 నుంచి పార్టీలో ఉన్నారు. బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీకి తయారు అవుతున్నారని అంటున్నారు. మరి అయ్యన్న కంటే పెద్ద అయిన బుచ్చయ్య వంటి వారి పరిస్థితి ఇపుడు ఏంటి అన్న చర్చ వస్తోంది. అలాగే మరో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు ఉన్నారు. ఆయన రాజ్యసభ పదవి కోరుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా అయ్యన్న కంటే పెద్దవారే కావడం విశేషం. అలాగే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కిమిడి కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారు కూడా సీనియర్ నేతలుగా ఉన్నారు. వీరే కాదు అత్యధిక సంఖ్యలోనే టీడీపీలో సీనియర్ నేతలు ఉన్నారు.
అయ్యన బాటలోనేనా :
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 2029 ఎన్నికల నాటికి యువతరాన్ని కొత్త వారిని ప్రోత్సహించాలని చూస్తోంది అని అంటున్నారు. దాంతో అయ్యన్న తానుగానే తప్పుకున్నారు. ఆయన అంటే ఇష్టపడే రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ అనేక మంది ఇంకా రాజకీయాల్లో ఉండాలని గట్టిగానే ఉన్నారు. వారికి ఇపుడు అయ్యన్న బాటనే అధినాయకత్వం చూపించేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయ్యన్న వంటి వారే తప్పుకున్నారు కదా అని చెప్పి వారి పొలిటికల్ లైన్ కూడా క్లియర్ చేసేందుకు అధినాయకత్వం చూడవచ్చు అని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి డెబ్బై కి అటూ ఇటూ ఉన్న నేతలు అంతా టికెట్ మీద ఆశలు పెట్టుకోరాదు అన్నది అయ్యన్న స్టేట్మెంట్ తరువాత పార్టీలో చర్చకు వస్తున్న విషయంగా ఉంది. మొత్తానికి అయ్యన్న రిటైర్మెంట్ ప్రకటన ఆయన ఒక్కరితోనే సరిపోదని అనేక మంది సీనియర్లకు కూడా స్వచ్ఛందంగానో లేక కంపల్సరీగానో రాజకీయ రిటైర్మెంట్ కి రూట్ వేస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.