అమెరికాను కుదిపేసిన లిండ్సే క్లాన్సీ కేసులో ఒక్క జడ్జితో ఊహించని ట్విస్ట్

అమెరికా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మసాచుసెట్స్ తల్లుల హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది.

Update: 2026-09-05 06:25 GMT

అమెరికా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మసాచుసెట్స్ తల్లుల హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ఏడు రోజుల పాటు, దాదాపు 38 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. జ్యూరీ సభ్యుల మధ్య స్పష్టమైన నిర్ణయం కుదరకపోవడంతో న్యాయమూర్తి ఈ విచారణను 'మిస్ట్రయల్'గా ప్రకటిస్తూ తీర్పు లేకుండానే కేసును తాత్కాలికంగా ముగించారు.

జనవరి 2023లో మసాచుసెట్స్‌లోని దుక్స్‌బరీలో జరిగిన ఈ ఘటన అప్పట్లో అమెరికా సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 32 ఏళ్ల లిండ్సే క్లాన్సీ తన ముగ్గురు చిన్న పిల్లలైన కోరా, డాసన్, ఎనిమిది నెలల పసికందు కాలని గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఆమె ఇంటి రెండవ అంతస్తు కిటికీ నుండి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి నడుము క్రింది భాగం పక్షవాతానికి గురైంది. పిల్లల మరణాలకు తానే కారణమని క్లాన్సీ అంగీకరించినప్పటికీ ఈ విచారణ అంతటా ఆమె మానసిక స్థితే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఈ విచారణ సమయంలో డిఫెన్స్, ప్రాసిక్యూషన్ వాదనలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. క్లాన్సీ తరఫు న్యాయవాదులు ఆమె తీవ్రమైన ప్రసవానంతర మానసిక రుగ్మత లేదా 'పోస్ట్‌పార్టమ్ సైకోసిస్'తో బాధపడుతోందని కోర్టుకు తెలిపారు. ఆ మానసిక పరిస్థితి కారణంగానే ఆమె తన స్మారకం తప్పి ఈ దారుణానికి ఒడిగట్టిందని.. ఆ సమయంలో మంచీచెడుల విచక్షణ లేకపోవడం వల్ల చట్టపరంగా ఆ పిచ్చి తత్వమే కారణమని డిఫెన్స్ వాదించింది. అయితే ప్రాసిక్యూటర్లు ఈ వాదనను పూర్తిగా ఖండించారు. క్లాన్సీకి తాను ఏం చేస్తున్నానో స్పష్టంగా తెలుసని.. భర్త బయటకు వెళ్లే సమయాన్ని చూసి పథకం ప్రకారమే ఉద్దేశపూర్వకంగా పిల్లలను హత్య చేసిందని వారు ఆరోపించారు. మానసిక పరిస్థితిని నెపంగా చూపి చట్టపరమైన శిక్ష నుండి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

అమెరికన్ క్రిమినల్ న్యాయ వ్యవస్థ ప్రకారం జ్యూరీ ఇచ్చే తీర్పు వంద శాతం ఏకగ్రీవంగా ఉండాలి. 12 మంది జ్యూరీ సభ్యులలో 11 మంది ఒకే నిర్ణయానికి వచ్చినప్పటికీ ఒక జ్యూరర్ మాత్రం తీవ్ర భిన్నాభిప్రాయంతో నిలిచారు. ఎంత సమయం ఇచ్చినా ఆ ఒక్క సభ్యుడు తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఏకగ్రీవ తీర్పు సాధ్యం కాక కేసు మిస్ట్రయల్‌గా ముగిసింది. అయితే మిస్ట్రయల్ అంటే నిందితురాలు నిర్దోషిగా విడుదలైనట్లు కాదు. ప్రాసిక్యూషన్ ముందు మళ్లీ కొత్త జ్యూరీతో విచారణ ప్రారంభించడం లేదా ప్లీ డీల్ వంటి ఇతర చట్టపరమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కేసు తదుపరి పరిణామాలపై స్పష్టత నిచ్చేందుకు సెప్టెంబర్ 29న స్టేటస్ హియరింగ్ జరగనుంది. అప్పటివరకు తుది న్యాయం కోసం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

Tags:    

Similar News