ముందు కేసీఆర్...తరువాత కేటీఆర్ !

బీఆర్ఎస్ రంగంలోకి దిగుతోంది. కార్యక్షేత్రంలోనే అమీ తుమీ తేల్చుకోవాలని అనుకుంటోంది. మరో రెండేళ్లలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి.

Update: 2026-09-05 03:54 GMT

బీఆర్ఎస్ రంగంలోకి దిగుతోంది. కార్యక్షేత్రంలోనే అమీ తుమీ తేల్చుకోవాలని అనుకుంటోంది. మరో రెండేళ్లలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఇప్పటి నుంచే పూర్తిగా జనంలో ఉండేలా గులాబీ పార్టీ కార్యాచరణను రూపొందించింది. షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబరులో తెలంగాణా శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తారు. అందుకే ఈ ఏడాది డిసెంబర్ నుంచి జనంలోకి రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు అని అంటున్నారు. 2023లో పార్టీ ఓడిన దగ్గర నుంచి ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినది కూడా రెండు సార్లే. అది బడ్జెట్ సెషన్ లో మాత్రమే. ఇక 2024 లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రచారం చేశారు. అలాగే రెండు సార్లు బీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన ప్రసంగాలు చేశారు.ఈ ఏడాది అయితే ఆయన సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కీలక జిల్లాలలో సభలు సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. కానీ అది కూడా జరగకుండానే 2026 ముగుస్తోంది.

బస్సు యాత్రతో అలా :

అయితే ఈ ఏడాది చివరిలో మాత్రం కేసీఆర్ జనంలోకి రానున్నారు అని అంటున్నారు. బస్సు యాత్రతో ఆయన తెలంగాణా మొత్తం అన్ని జిల్లాలో పర్యటిస్తారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు అని అంటున్నారు. అలాగే ఆయా జిల్లాలలో సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎండగడుతూ మీటింగులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా క్యాడర్ లో కొత్త జోష్ ని తేవడమే కేసీఆర్ బస్సు యాత్ర ఉద్దేశ్యం అని అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ బస్సు యాత్ర తరువాత కేసీఆర్ పాదయాత్ర మొదలవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలలో కేసీఆర్ పాదయాత్ర స్టార్ట్ అవుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

విజయమే లక్ష్యంగా :

ఇక చాలా కాలానికి కేసీఆర్ జనంలోకి వస్తూండడంతో ఆ అసక్తి పెద్ద ఎత్తున ఉంటుందని అది బీఆర్ఎస్ పునరుత్తేజానికి ఎంతగానో దోహదపడుతుందని గులాబీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాదు పార్టీకి ఫుల్ రీచార్జిని తీసుకుని రావడానికి కేసీఆర్ బస్సు యాత్ర ఉపయోగపడుతుందని అంటున్నారు. కేటీఆర్ పాదయాత్ర అయితే పూర్తిగా జనంతో మమేకం అయ్యేలా సాగుతుందని అంటున్నారు. ఆయన మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగేలా డిజైన్ చేశారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వేయి రోజుల పాలనను రేవంత్ రెడ్డి పూర్తి చేసుకున్న సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి పాలన మూడేళ్లు పూర్తి అయ్యేనాటికి ఎన్నికల యుద్ధ సన్నాహలకు తెర తీస్తుంది అన్న మాట. ఈసారి విజయమే లక్ష్యంగా చేసుకుని రంగంలోకి బీఆర్ఎస్ దిగుతోంది. తండ్రీ కొడుకులు ఇద్దరూ కూడా జనంలోనే ఉంటారు. దాంతో కాంగ్రెస్ ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు అన్నది ఆ పార్టీ మాస్టర్ ప్లాన్ గా ఉంది. మరి దీనిని రేవంత్ రెడ్డి ఏ విధంగా ధీటుగా ఎదుర్కొంటారు అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News