బృహత్ విశాఖ కార్పొరేషన్ దిశగా అడుగులు

మహా విశాఖ నగర పాలక సంస్థ వార్డుల పునర్విభజనపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది.

Update: 2026-09-04 17:19 GMT

మహా విశాఖ నగర పాలక సంస్థ వార్డుల పునర్విభజనపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. దాంతో జీవీఎంసీలో 98 నుంచి 120 వార్డులను పెంచేందుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జీవీఎంసీకి అందాయి. దీంతో జీవీఎంసీ వార్డుల పునర్ విభజన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అయితే 120 వార్డులుగానా లేక 150 వార్డులుగా పునర్ విభజన జరుగుతుందా అన్నది చర్చగా ఉంది. ఒక వైపు జీవీఎంసీని ఆనుకుని ఉన్న నాలుగు మండలాలు 79 పంచాయతీల భవితవ్యం ఏమిటి అన్నది తెలలేదని అంటున్నారు. వీటిని కూడా జీవీఎంసీలో విలీనం చేసి మొత్తంగా 150 వార్డులుగా చేసి మార్చి ఎన్నికలకు వెళ్లాలని ప్రజా ప్రతినిధుల నుంచి సూచనలు వస్తున్నాయి. ఈ విషయంలో మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అయితే 150 వార్డులుగా జీవీఎంసీని చేయడం ఉత్తమం అని స్పష్టం చేస్తున్నారు. ఆయన ఇంకా దూరం వెళ్లి భోగాపురం ఎయిర్ పోర్టు ఉన్న ప్రాంతం అంతా కూడా జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. అది ఇప్పట్లో జరగకపోయినా నాలుగు మండలాల విలీనం సంగతి ఏమిటి అన్నది చర్చకు వస్తోంది.

కలిస్తే మేలుగానే :

ఇదిలా ఉంటే జీవీఎంసీతో కలసి ఇప్పటికే ఉన్న ఈ మండలాలను వేరు చేసి చూడడం వల్ల అభివృద్ధి కూడా కుంటుబడుతుందని ఒక అభిప్రాయం ఉంది. పైగా విశాఖకు వస్తున్న పరిశ్రమలు కూడా ఈ మండలాలలో ఉన్నాయి. దాంతో వాటికి కావాల్సిన పారిశ్రామికమైన మౌలిక సదుపాయల కల్పనను అందించేందుకు జీవీఎంసీలో ఉంటేనే భారీ ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. అలాగే ఏ అనుమతి కావాలన్న వేగంగా వస్తుందని అలాగే సిటీ లుక్ తో ఉంటే మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందని అంటున్నారు.

అలాగైతే మరింత లేట్ :

అయితే ప్రస్తుతం ఈ నాలుగు మండలాల్లో జరిగిన గ్రామ సభలలో ప్రజాభిప్రాయ సేకరణ సవ్యంగా లేదని మరో మారు జరపాలని కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చినట్లుగా చెబుతున్నారు. దాంతో గ్రామ సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణతో నివేదికలు సిద్ధం చేసిన తరువాత అంతా ఓకే అయితే విలీనం జరుగుతుంది. ఆ మీదట వార్డుల పునర్ విభజన జరగాల్సి ఉంది. ఈ మొత్తం తతంగం అంతా పూర్తి అయ్యేసరికి మరో ఆరేడు నెలలు పడుతుందని అంటున్నారు. దాంతో అక్టోబర్ లోగా పూర్తి చేయాలనుకుంటున్న స్థానిక ఎన్నికల్లో జీవీఎంసీ ఉండకుండా పోతుంది. ఈ కారణంగా ఇపుడు ఆ విలీనం వద్దు అంటున్నారు ఆశావహులు. ఇపుడు కాకపోతే మరెప్పుడు అని మరి కొందరు అంటున్నారు. ఈ విషయం ఇలా ఉండగానే 120 వార్డులతో జీవీఎంసీ పునర్ విభజన జరిగి తీరడం పక్కా అని అంటున్నారు.

కసరత్తుకి సిద్ధం :

జీవీఎంసీలో 120 వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలు సెప్టెంబర్ 5 నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జీవీఎంసీ వెబ్‌సైట్‌తో పాటు ప్రధానమైన 10 జోనల్ కార్యాలయాలు ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల్లో వివరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో సూచనలు అభ్యంతరాలను సెప్టెంబర్ 11వ తేదీలోపు జీవీఎంసీ కమిషనర్‌కు సమర్పించాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా పునర్ విభజిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన నియమాలు–1996కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 570 ప్రకారం జీవీఎంసీ పరిధిని 120 వార్డులుగా పునర్విభజిస్తూ ఆయా వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News