గృహప్రవేశంలో గందరగోళం: ఆశీర్వాదం పేరుతో 'ఆరు అంకెల' బెదిరింపులు

కొత్త కొంప కడితే పన్ను వసూలు చేయడానికి మున్సిపాలిటీ వారైనా కాస్త సమయం ఇస్తారేమో గానీ వీరు మాత్రం ముహూర్తం సమయానికే వచ్చి గల్లా పెట్టెపై కన్నేస్తున్నారు.

Update: 2026-09-04 17:17 GMT

కొత్త ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తైతే.. ఆ ఇంట్లో ప్రశాంతంగా అడుగుపెట్టడం ఇంకో ఎత్తు. అప్పులు సోప్పులు చేసి పైసా పైసా కూడబెట్టి పండగలా గృహప్రవేశం పెట్టుకుంటే.. అక్కడ బంధువుల కోలాహలం కంటే ముందు ప్రత్యక్షమయ్యేది హిజ్రాలే. హైదరాబాద్‌ చింతల్‌లోనూ సరిగ్గా ఇదే జరిగింది. అయితే ఈసారి వారు అడిగిన నజరానా చూసి ఆ యజమానురాలికి గృహప్రవేశం కాస్త 'ఖాతా ఖాళీ ప్రవేశం'లా అనిపించింది. పసుపు కుంకుమలు ఇచ్చి.. చల్లగా బతకమని దీవించాల్సిన వారు ఏకంగా ఏభై వేల రూపాయిల బిల్లు చేతిలో పెట్టారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమండీ.. తోచిన ఐదొందలో వేయో ఇస్తామని పాపం ఆ గృహలక్ష్మి ఎంత బతిమాలినా ససేమిరా అన్నారు. శాలువాలు కప్పి సన్మానించాల్సిన చోట గృహప్రవేశానికి వచ్చిన బంధువులందరి ముందూ వారు చేసిన రచ్చతో ఆ కుటుంబం తలపట్టుకుంది. ఆశీర్వాదాల రేట్లు పసిడి ధరల కంటే వేగంగా పెరిగిపోతుంటే సాధారణ ప్రజలు ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు.

కొత్త కొంప కడితే పన్ను వసూలు చేయడానికి మున్సిపాలిటీ వారైనా కాస్త సమయం ఇస్తారేమో గానీ వీరు మాత్రం ముహూర్తం సమయానికే వచ్చి గల్లా పెట్టెపై కన్నేస్తున్నారు. పది, వందల కాలం ఎప్పుడో పోయింది.. ఇప్పుడు ఐదంకెల సంఖ్య చెప్తేనే మాటలు.. లేదంటే శాపనార్థాలు.. రచ్చ రంబోలానే. చట్టాలు, పోలీసులు ఉన్నా సరే శుభకార్యం చెడిపోకూడదనే భయంతో జనం మౌనంగా జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అసలు ఇది ఆశీర్వాదమా లేక కార్పొరేట్ పన్నా అనే అనుమానం సగటు జీవికి రాకమానదు.

గౌరవప్రదమైన జీవితం కోసం పోరాడే హిజ్రా సమాజం ఒకవైపు ఉంటే శుభకార్యాల పేరుతో ఇలా పక్కా స్కెచ్‌తో బెదిరింపులకు దిగే వసూళ్ల రాయుళ్లు ఇంకోవైపు తయారయ్యారు. పోలీసులు ఈ గృహప్రవేశ పన్ను వసూలు చేసే వారిపై కన్ను వేయకపోతే రేపు పొద్దున కొత్త ఇల్లు కట్టేవాళ్లు ప్లాన్‌తో పాటు 'హిజ్రాల బడ్జెట్' అని ప్రత్యేకంగా ఒక ఐటెమ్ రాసుకోవాల్సి వస్తుంది.

కొద్దిమంది చేస్తున్న ఈ ఆగడాల వల్ల మొత్తం సమాజానికి చెడ్డపేరు వస్తుందని తెలిసినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడం విచారకరం. బాధితులు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేస్తేనే అసలు నిజాలు బయటపడతాయి. లేదంటే ఆశీర్వాదాల పేరుతో సాగే ఈ అమాంతం వసూళ్లు అమాయకులకు చుక్కలు చూపిస్తూనే ఉంటాయి.




Tags:    

Similar News