వరుణుడు ఫేస్ టర్నింగ్ ....అంతే సంగతులు !
ఎల్ నినో భారతదేశం మీద ప్రభావం బాగా చూపిస్తోంది. అందులో కూడా ఏపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
ఎల్ నినో భారతదేశం మీద ప్రభావం బాగా చూపిస్తోంది. అందులో కూడా ఏపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. నైరుతి రుతు పవనాలను వానలుగా మారనీయకుండా మేఘాల స్థాయిలోనే విచ్చిన్నం చేయడంలో ఎల్ నినో సూపర్ సక్సెస్ అవుతోంది. అల్ప పీడనాలు ఈ మధ్య కాలంలో డజన్ దాకా వచ్చినా చుక్క నీరు కూడా కురవనీయకుండా చేసిన క్రెడిట్ కూడా ఎల్ నినోదే అని అంటున్నారు. ఇపుడు చూస్తే కొత్త నెల సెప్టెంబర్ మొదలైంది. నైరుతికి కీలకంగా మిగిలినవి సెప్టెంబర్ అక్టోబర్ నెలలే. దాంతో వీటి పైన కోటి ఆశలు పెట్టుకుంటే చావు కబురు చల్లగా అన్నట్లుగా ఐఎండీ తాజా అంచనాలు కలవరపెడుతున్నాయి. దాంతో వర్షాలు ఈ నెలలో కూడా పడవని స్పష్టం అవుతోంది.
సెప్టెంబర్ ఎల్ నినోకే :
దీంతో సెప్టెంబర్ నెల కూడా ఎల్ నినోకి సమర్పితం అని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో కూడా పూర్తిగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని పొడి వాతావరణం ఉంటుందని అమరావతిలోని ఐఎండీ అంచనా కట్టింది. అంతే కాదు బోనస్ అన్నట్లుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది. అంతే కాదు వడ గాడ్పులు కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది. నిజానికి జూన్ తర్వాత అధిక ఉష్ణోగ్రతలు ఉండవు, క్రమంగా సాధారణ స్థాయికి వస్తాయి. కానీ ఈసారి ఎల్ నినో మహిమ వల్ల సెప్టెంబర్ వంటి వర్షాలు కురిసే నెలలో గరిష్ట ఉష్ణొగ్రతలు నమోదు అవుతాయని అంటున్నారు.
సాగుకు గడ్డు కాలం :
ఖరీఫ్ సీజన్ మొత్తం అంతా నైరుతి రుతు పవనాల మీదనే ఆధారపడి ఉంటుంది. అలాంటి సాగుకు ఎల్ నినో పెద్ద విలన్ గా మారింది అనుకుంటున్నారు. ఎల్ నినో వల్ల సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ చెబుతోంది. వరసగా జూన్ నుంచి చూసుకుంటే మూడు నెలలలోనూ తక్కువ వర్షపాతమే నమోదు అయి వ్యవసాయాన్ని కొంప ముంచేలా చేసింది. అంతే కాదు భూగర్భ జలాలు కూడా ఎన్నడూ లేని విధంగా ఇంకిపోయి నీటి కటకట స్టార్ట్ అయింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల నేలలోని తేమ వేగంగా తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇక సాగుకు కాని కాలంగా ఈ సెప్టెంబర్ కూడా మారడంతో పంటల దిగుబడి ఈసారి గణనీయంగా తగ్గిపోతుందని ఆందోళన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం చూస్తే పంటలు వేసి ఆకాశం వైపు చూస్తున్న వారికి ఈ వార్తలు కలవరం కలిగిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి :
సెప్టెంబర్ నెలలో రెండవ వారంలో కొంతవరకూ వానలు పడవచ్చు పడవచ్చు అని అమరావతిలోని ఐఎండీ చెబుతోంది. అయితే ఇది కూడా తాత్కాలిక ఆనందమే అని ఆ మిగిలిన రెండు వారాలూ పూర్తిగా వర్షాభావం తాండవిస్తుంది స్పష్టం చేస్తోంది.దీంతో రైతులు జాగ్రత్త పడాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. నీటి సంరక్షణ పద్ధతులు అవలంభించాలని అలాగే తక్కువ నీటితో ఎక్కువ పంటలు పడించే వాటిని అన్వేషించాలని కూడా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్టర్నేటివ్ పంటల మీద ఫోకస్ పెట్టాలని ఇప్పటికే రైతులకు సూచించింది. మొత్తానికి ఎల్ నినో ఇలా పగ పడుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ 2026 మాత్రమే కాదు 2027లోనూ నైరుతి రుతుపవనాలని పూర్తిగా మింగేందుకు కాచుకుని కూర్చుంది అని అంటున్న వాతావరణ నిపుణుల అంచనాలు తీవ్ర భయాందోళలను కలుగచేస్తున్నాయి.