జీతం లేకుండా పని చేసేది మన వాళ్ళే...సంచలన నివేదిక !
ఎక్కడైనా పని చేయడం అంటే దానికి తగిన ప్రతిఫలం పొందాలి. ఇక జీతాల విషయంలో భారత్ లో తక్కువ ఉంటాయని అంటారు.
ఎక్కడైనా పని చేయడం అంటే దానికి తగిన ప్రతిఫలం పొందాలి. ఇక జీతాల విషయంలో భారత్ లో తక్కువ ఉంటాయని అంటారు. కేవలం పదిశాతం మంది మాత్రమే తమ పనికి తగినంతగా ఇంకా ఎక్కువగా వేతనాలు పొందుతున్నారు తప్పించి మిగిలిన తొంబై శాతం మాత్రం పనికి తగిన వేతనం అందుకోలేకపోతున్నారు అన్నది అయితే చాలా నివేదికలు వెల్లడించాయి. అయితే ఇపుడు ఆ అరకొర వేతనాలు కూడా లేకుండా పూర్తి ఉచితంగా వెట్టి చాకిరి చేసే వారిలో భారతీయులదే రికార్డు అని ఒక సంచలన నివేదిక బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే భారత్ లోనే అధికం అని అంటున్నారు. ఇది నిజంగా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే అని చెబుతున్నారు.
అగ్ర స్థానంలో ఇండియా :
జీతం లేకుండా పని చేసే గంటలు ఇండియాలోనే ఎక్కువ అని అంటున్నారు. మామూలుగా చూస్తే ఎనిమిది గంటల పని కార్మిక చట్టాల ప్రకారం ఉంది. అయితే అంతకు మించి అదనంగా పనిచేసినా ఆ అధిక పని గంటలకు జీతాలు లేవని అంటున్నారు. ఇలా చూస్తే వారానికి ఆరు రోజులకు ఈ జీతం లేని పని గంటలను లెక్కిస్తే పదహారు గంటలు అని తేలింది. అంటే రోజుకు అదనంగా రెండున్నర గంటల కంటే ఎక్కువగా ఉచితంగా భారతీయులు పనిచేస్తున్నారు అన్న మాట. ఇందులో ముఖ్యంగా ఇంటి నుంచి పనిచేసే రిమోట్ ఉద్యోగులు వారితో పాటు యువత కూడా ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఇలా తమ మీద అధిక పని భారం పడుతోందని ఈ వెట్టి చాకిరి భరించలేమని ఉద్యోగాలను మానేయాలని ఆలోచిస్తున్న వారు కూడా ఎక్కువ మంది ఉన్నారని అంటున్నారు. ఈ వివరాలను అన్నింటినీ తాజా అధ్యయనంగా ఏడీపీ సంస్థ విడుదల చేసిన పీపుల్ ఎట్ వర్క్ 2026లో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం చూస్తే ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ప్రతీ నలుగురిలో ఒకరు :
ఈ దేశంలో పనిచేస్తున్న ప్రతీ నలుగురిలో ఒకరు అధిక పని గంటల వెట్టి చాకిరీ బారిన పడిన వారే అని నివేదిక చెబుతోంది. అంటే మొత్తం దేశంలోని ఉద్యోగార్ధులలో ఇది 24 శాతంగా నమోదు అయింది. అంతే కాదు మరో 40 శాతం మంది దాకా ఉద్యోగులు వారానికి ఆరు నుంచి 15 గంటల పాటు జీతం లేని అదనపు పని చేస్తున్నారని నివేదికలో పేర్కొంటున్నారు. ఇలా లెక్క వేస్తే మన దేశంలోని అధిక శాతం శ్రామిక శక్తి గణనీయమైన సమయాన్ని ఎలాంటి జీతం బత్తెం లేకుండానే ఉద్యోగం పేరుతో వెచ్చిస్తోంది అన్నది అర్ధం అవుతోంది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ కొన్ని దేశాలలో మాత్రమే వారానికి 16 గంటల అదనపు పని చేస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 12 శాతం మంది మాత్రమే వెట్టి చాకిరి చేస్తూంటే ఒక్క భారత్ లో మాత్రమే ఆ శాతం 24 శాతానికి పైగా ఉంది.
ఉత్పాదన పెరగలేదు :
పోనీ అధిక గంటలు పనిచేయించుకుంటున్నారు కదా దాని వల్ల ఆయన సంస్థలలో ఉత్పాదకత ఏమైనా పెరిగిందా అంటే లేదని ఈ నివేదిక వెల్లడిస్తోంది. జీతం లేని పని వల్ల సంస్థలకు కూడా మేలు జరగదని అంటున్నారు. పనిచేసే వారిలో ఉత్సాహం కొరవడుతుంది. అలాగే నిరాశ మానసిక ఒత్తిళ్లతో నిబద్ధత లేకుండా పోతోందని అంటున్నారు. దాని వల్ల ఎక్కువగా గంటలు పని చేయించుకున్నామన్న తృప్తి తప్ప ఆయా సంస్థలకు ఒనగూడేది ఏదీ లేదని అంటున్నారు. అంతే కాదు ఇలా చేయించుకోవడం వల్ల ఎక్కువ కాలం సదరు సంస్థలలో కూడా ఎవరూ నిలకడగా పనిచేయడం లేందని నివేదిక చెబుతోంది.
నాణ్యతే కొలమానంగా :
ఇదిలా ఉంటే ఉద్యోగి ఎక్కువ గంటలు పనిచేశారు అన్నది కొలమానంగా చూస్తున్నారు కానీ పనిలో నాణ్యతను చాలా మంది చూడడం లేదని అంటున్నారు. దాని వల్ల ఉత్పాదకత పడిపోతోందని అంటున్నారు. జీతం లేని పనిగా కాకుండా జీతం క్రమం తప్పకుండా ఇచ్చి పని చేయించుకుంటే ఆ నిర్దిష్టకాలంలో వారు చేసే పనిలో నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దాని వల్ల ఒక్కోసారి ప్రతిభావంతులు కూడా సంస్థలను వీడే పరిస్థితి ఏర్పడి సంస్థలకే దెబ్బ అని అంటున్నారు. అందువల్ల వెట్టి చాకిరి చేయించుకోకుండా నాణ్యమైన పనికి సంస్థలు స్వాగతం పలకాలని నివేదిక సూచిస్తోంది.