ప్రధాని పదవికి సోనియా నో ..బిలాంగింగ్‌’ లో సంచలన విషయాలు ?

సోనియా గాంధీ ఇటలీలో పుట్టినా తన జీవితంలో మూడు వంతులు భారత లోనే గడిపారు.

Update: 2026-09-05 03:02 GMT

సోనియా గాంధీ ఇటలీలో పుట్టినా తన జీవితంలో మూడు వంతులు భారత లోనే గడిపారు. ఆమె 22 ఏళ్ళ వయసులోనే భర్త రాజీవ్ గాంధీతో కలిసి ఇండియా వచ్చేశారు. నాటి నుంచి భారతీయ సంప్రదాయాలు అవగాహన చేసుకుని వాటికి తగిన విధంగా వ్యవహరించారు. అత్త ఆనాటి ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీతో ఎక్కువ సాన్నిహిత్యం సోనియాగాంధీకి ఉండేది. అలా ఇందిర నుంచి ఆమె ఎంతో స్పూర్తి పొందారు, వారిద్దరి మధ్యన అత్తాకోడళ్ల బంధం కంటే కూడా తల్లీ కూతుళ్ళ బంధం ఉండేదని సన్నిహితులు చెబుతారు. ఇదిలా ఉంటే సోనియా గాంధీ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఒక సాధారణ మహిళగా ఇటలీలో జన్మించిన సోనియా భారత్ లో అతి పెద్ద రాజకీయ కుటుంబంలో సభ్యురాలు అయ్యారు. ఆ తరువాత ఆమె భర్త రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. అనివార్యంగా తానూ రావాల్సి వచ్చింది. ఇప్పుడు కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక కూడా రాజకీయంగా వెలుగుతున్నారు. ఇలా చూసుకుంటే సోనియా గాంధీ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆమె బిలాంగింగ్‌ బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌ పేరుతో తాను స్వయంగా రచించిన పుస్తకంలో పొందుపరచారు.

ప్రధానిగా చాన్స్ :

ఇదిలా ఉంటే ఈ పుస్తకం రిలీజ్ కాకముందే సంచలనం రేకెత్తిస్తోంది. ఎందుకంటే సోనియా జీవితంతో భారత్ రాజకీయ పరిణామాలు కూడా ముడిపడి ఉన్నాయి. అలాగే దేశంలో అతి పెద్ద పురాతనమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. దాంతో ఆమె పుస్తకంలో ఏమేమి అంశాలు ఉంటాయి, ఆమె ఏ విధంగా వాటిని జనం ముందు పెడతారు అన్నది అయితే చూడాల్సి ఉంది. ఇక 2004లో యూపీఏ పూర్తి మెజారిటీ సాధించింది. ఆ సమయంలో యూపీఏ లో పెద్ద పార్టీగా కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నారు. ఆమె చేతుల దాకా ప్రధాని పీఠం వచ్చింది. ఆమె సరేనంటే ఈ దేశానికి ప్రధాని అయి ఉండేవారు. మరి ఆమె ఎందుకు కాదనుకున్నారు, దాని వెనక బలమైన కారణాలు ఏమిటి అన్నది ఈ పుస్తకంలో ఉండొచ్చు అని అంటున్నారు. విదేశీయత అడ్డంకిగా మరిందా అంటే అప్పటికే ఆమె భారతీయ పౌర సభ్యత్వం తీసుకున్నారు. రాజ్యాంగంలో కూడా ప్రత్యేకంగా దీని మీద నిబంధనలు లేవు, సో సోనియా గాంధీ అంతటి పెద్ద పదవిని ఎందుకు వద్దు అనుకున్నారు అన్నది ఈ రోజుకీ సస్పెన్స్ గానే ఉంది. దాంతో ఆ విషయాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం మీద అందరికీ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతోంది.

భారత్ లో విడుదల :

ఇదిలా ఉంటే సోనియా గాంధీ పుస్తకానికి కొత్త పబ్లిషర్‌గా హార్పర్‌కాలిన్స్‌ వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ పుస్తకానికి పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా ప్రచురణకర్తగా ఉంటుందని ప్రచారం సాగింది. అయితే ఈ పుస్తకంలోని కొన్ని అంశాలపై రచయితతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ఆ సంస్థ తెలిపింది. అయితే సంపాదకీయ మార్పులకు సోనియా గాంధీ అంగీకరించకపోవడంతో పుస్తక ప్రచురణ నుంచి తప్పుకున్నారన్న వార్తలను పెంగ్విన్‌ ఖండించింది. అదే విధంగా ఏ ఇతర ఒత్తిళ్లు కూడా కారణం కాదని స్పష్టం చేసింది. ఇపుడు హార్పర్‌కాలిన్స్‌ పబ్లిషర్స్ గా ఉంటున్నారు. దాంతో నవంబర్‌ 10న భారత్‌లో బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌ విడుదల కానుంది. అదే సమయంలో బిలాంగింగ్‌ పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్‌ ఏ.నాఫ్‌ నవంబర్‌ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది

సమాంతరంగా అనేక అంశాలు :

సోనియా గాంధీది రాజకీయ కుటుంబం కాబట్టి ఆమె వ్యక్తిగత అంశాలతో పాటుగా సమాంతరంగా రాజకీయ అంశాలు భారత్ లోని సమకాలీన అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు. అలాగే ఈ పుస్తకమలో ఇందిర రాజీవ్‌ గాంధీ హత్యల ప్రభావాన్ని సోనియా ప్రస్తావించారని అంటున్నారు. ఒక సాధారణ యువతిగా భారత్ కి వచ్చిన సోనియా జీవితంలో మొదట ప్రేమతోనే భారత్ తో అనుబంధం ఏర్పడింది, ఆ మీదట ఒక పెద్ద రాజకీయ కుటుంబ సభ్యురాలిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఇక బాధ్యతలు అనుబంధాలు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడం ఇవన్నీ కూడా ఆమె వ్యక్తిగత జీవితంలో కీలకంగా మారాయి. వీటి గురించి పుస్తకంలో ఎక్కువగా చర్చ ఉంటుందని అంటున్నారు.

ఆరు దశాబ్దాల అనుభవాలు :

ఈ పుస్తకం ద్వారా సోనియా గాంధీ ఆరు దశాబ్దాల తన జీవిత అనుభవసారాన్ని వివరించనున్నారు. అందులో 1984లో అత్త ఇందిరా గాంధీ హత్యతో తన జీవితం ఎలా మారిందో కూడా తెలియ చెప్పనున్నారు. అలాగే 1991లో భర్త రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత ఎదురైన పరిస్థితులనూ ఆమె ఇందులో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఇక తాను స్వయంగా రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని కూడా పుస్తకంలో ప్రస్తావించారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె సుదీర్ఘ కాలం కొనసాగారు. వాటి అనుభవాలు కూడా పొందుపరచారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించారు. దాని వెనక ఏముందో కూడా చెప్పనున్నారు. 2014లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన పరిణామాలనూ ఆమె తన పుస్తకంలో ప్రస్తావించారని అంటున్నారు. దాంతో రాజకీయంగా కూడా ఈ పుస్తకం సంచలనాలు రేకెత్తిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News