గోదావరి కాలుష్యం... యాక్షన్ కి పవన్ రెడీ !

అయితే మొదటి తప్పుగా సంస్థకు హెచ్చరించి పరిష్కార మార్గాలని సూచించినా సంస్థ నుంచి స్పందన రాలేదని అంటున్నారు.

Update: 2026-09-05 03:52 GMT

ఏపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కీలక స్థానంలో ఉన్నారు. అంతే కాదు ఆయన చేతిలో అయిదు ముఖ్య శాఖలు ఉన్నాయి. వాటిలో పర్యావరణం కాలుష్య నియంత్రణ శాఖలు కూడా ఉన్నాయి. దాంతో పవన్ ఈ శాఖల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. గతంలో ఈ శాఖలకు మంత్రులు ఉన్నా ఇంతలా వీటి గురించి చర్చించుకునేందుకు వీలు అయితే లేదనే అంటున్నారు. కానీ పవన్ కి పర్యావరణం మీద ప్రేమ ఉంది, కాలుష్యాన్ని వీలైనంతగా నియంత్రించాలని పట్టుదల ఉంది. అందుకే ఈ శాఖలు తరచూ వార్తలలోకి వస్తున్నయి. ఇక ప్రత్యేకించి ఈ శాఖల మంత్రిగా పవన్ జిల్లాలలో పర్యటిస్తూ ఎక్కడ ఉల్లంఘనలు జరిగాయో స్వయంగా తనిఖీలు చేసి మరీ ఆయా సంస్థలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే ఆయన రాజమండ్రీలో పర్యటించి మరీ ఆంధ్రా పేపర్ మిల్స్ వల్లనే గోదావరి నదిలో కాలుష్యం అధికం అయింది అన్నది గుర్తించారు. అయితే మొదటి తప్పుగా సంస్థకు హెచ్చరించి పరిష్కార మార్గాలని సూచించినా సంస్థ నుంచి స్పందన రాలేదని అంటున్నారు. దాంతో పవన్ ఇపుడు ఈ సంస్థ మీద చర్యలకు దిగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

సగం కాలుష్యం వాటా :

రాజమండ్రీ నగరంలో రోజుకు 70 మిలియన్ లీటర్ల ద్రవ్య వ్యర్ధాలు విడుదల అవుతూంటే అందులో సగానికి సగం 35 మిలియన్ లీటర్లు ఆంధ్రా పేపర్ మిల్స్ నుంచే వస్తున్నాయని కాలుష్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతే కాదు 2016 తరువాత కాతేరు గ్రామ పంచాయతీకి అలాగే రాజమండ్రి కార్పోరేషన్ కి ఒక్క పైసా కూడా పన్ను ఈ సంస్థ చెల్లించలేదని కూడా గుర్తించింది అంటున్నారు. అలా స్థానిక సంస్థలకు 21.34 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అధికారుల వద్ద లెక్క ఉంది. పన్నులు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన ప్రతీ సారీ కోర్టుని ఆశ్రయిస్తూ కాలయాపన చేస్తున్నారు అని కూడా కాలుష్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.

నీటిలో ఆక్సిజన్ తగ్గింది :

సదరు సంస్థ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న ద్రవ వ్యర్థాల కారణంగా నీటిలో కాలుష్యం పేరుకుని పోయి ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోయింది అని కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దాంతో జల చరాలు నదిలో మనుగడకు ఇబ్బందికరంగా ఈ పరిస్థితులు మారుతున్నాయని అంటున్నారు. ఇక దుర్గంధంతో పాటు గోదావరి నీటిలో నాణ్యతా ప్రమాణాలు పడిపోయి నగర ప్రజల ఆరోగ్యం జీవన ప్రమాణాల మీద అధికంగా ప్రభావం చూపిస్తోంది అని నివేదిక వెల్లడిస్తోంది.

తక్షణం సమన్లు జారీ :

ఈ పరిస్థితుల్లో మూడు నెలల క్రితం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టి హెచ్చరించినా సదరు సంస్థలో మార్పు లేదని అధికారులు పలు మార్లు సూచనలు చేసినా పాటించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఇక ఉపేక్షించేది లేదని తక్షణం ఆ సంస్థకు సమన్లు జారీ చేసి చర్యలకు ఉపక్రమించాలని పవన్ సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. ఇక న్యాయపరంగా కూడా ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ అదనపు అడ్వకేట్ జనరల్ స్టాండింగ్ కౌన్సిల్ కి ఈ కాలుష్య ఉల్లంఘన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.

మద్దతు ఇవ్వాలి :

ఇక వచ్చే ఏడాది 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి నదిని పవిత్రంగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పౌర సమాజంతో పాటు పర్యావరణవేత్తల నుంచి మద్దతు ఇవ్వాలని పవన్ కోరడం విశేషం. ప్రజా ప్రయోజనాలతో పాటు పర్యావరణ హితానికి అత్యధిక ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని కూడా తేల్చి చెప్పారు.

Tags:    

Similar News