డ్రంక్ అండ్ డ్రైవ్: అమెరికాలో అలా.. ఇండియాలో ఇలా.. ఎందుకు?
అమెరికాలో తాగి వాహనం నడపడం(డ్రంక్ అండ్ డ్రైవ్) అనేది కేవలం ఒక చిన్న సాధారణ పొరపాటు కాదు.
అమెరికాలో తాగి వాహనం నడపడం(డ్రంక్ అండ్ డ్రైవ్) అనేది కేవలం ఒక చిన్న సాధారణ పొరపాటు కాదు. అది ఒక వ్యక్తి జీవితాన్ని, భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసే పెద్ద చిక్కు. అక్కడ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పోలీసులకు ఆల్కహాల్ స్మెల్ లేదా వాహనం నడిపే వేగంలో మార్పుల వల్ల ఏమాత్రం అనుమానం వచ్చినా.. తక్షణమే వాహనాన్ని పక్కకు నిలిపి బ్రీత్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షకు నిరాకరించడం.. అధికారులతో వాదించడం అక్కడ తీవ్ర నేరంగా పరిగణిస్తారు.
అమెరికా చట్టాల ప్రకారం 21 ఏళ్లు దాటిన వారికి బ్లడ్ ఆల్కహాల్ లిమిట్ (బీఏసీ) 0.08 కంటే ఎక్కువ ఉంటే వారిపై నేరుగా `డియుఐ` (డ్రైవింగ్ అండర్ ది ఇన్‌ఫ్లూయెన్స్) కేస్ నమోదు చేస్తారు. ఈ కేసు నమోదైతే 24 గంటల నుండి కొన్ని నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు 200 డాలర్ల నుండి 4000 డాలర్ల వరకు భారీ ఫైన్ విధించడమే కాకుండా.. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తారు.
పరిస్థితి తీవ్రతను బట్టి కార్లలో `ఇగ్నిషన్ ఇంటర్లాక్ డివైస్` వంటి పరికరాలను అమర్చి... ఆల్కహాల్ శాతం శ్వాసలో ఉందో లేదో తరచూ తనిఖీ చేస్తారు. వాహనంలో చిన్న పిల్లలు ప్రయాణిస్తున్నా లేదా ఆ సమయంలో అనుకోకుండా ఏవైనా ప్రమాదాలు (ఆక్సిడెంట్స్) జరిగినా.. చట్టపరమైన శిక్షలు రెట్టింపు అవుతాయి. ఈ క్రిమినల్ కేసులు అమెరికాలో ఉన్నంత కాలం జీవితాంతం పర్మనెంట్‌గా రికార్డుల్లో ఉండిపోతాయి.
ఈ తీవ్రమైన పరిణామాల వల్ల అమెరికాలో డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడం ఎంతమాత్రం వినోదం కాదు. అది ఒక వ్యక్తి భవిష్యత్తును, కెరీర్‌ను అంతం చేసే పెద్ద శిక్షగా మారుతుంది. అందుకే అక్కడ మద్యం సేవించిన వారు స్వయంగా డ్రైవింగ్ చేయకుండా ఉబెర్ లాంటి టాక్సీ సేవలను ఉపయోగించడం లేదా మిత్రుల సహాయంతో ప్రయాణించడం ఉత్తమమైన మార్గంగా భావిస్తారు.
అలాగే ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించడం కూడా అక్కడ చట్టవిరుద్ధం. అందుకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశాలు, పబ్స్ లేదా అనుమతి ఉన్న ప్రదేశాలలో మాత్రమే ఆల్కహాల్ తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. భారతదేశంలోనూ ఇటీవలి కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టాస్కులతో పోలీసులు దడ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడా కఠినంగానే రూల్స్ అమలవుతున్నాయి.