హుజూరాబాద్ ఉపఎన్నిక తప్పదా ?!

అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి 2023లో బీఆర్ఎస్ తరపున హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

Update: 2026-09-05 04:33 GMT

శాసనసభలో గత మార్చిలో మైనింగ్ అక్రమాలపై చర్చ జరుగుతుండగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంతరాయం కలిగించడమే కాకుండా తుపాకీ కాల్చే సైగలతో బెదిరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణల నేపథ్యంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విషయాన్ని శాసనసభ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. దీనిపై ఎథిక్స్ కమిటీ వేగంగా జరుపుతున్న విచారణ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి మీద అనర్హత వేటు వేస్తారా ? త్వరలోనే హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు తప్పవా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు అంశం స్పీకర్ వద్ద, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి మీద అనర్హత వేటు తప్పదన్న అంశం ఆసక్తికరంగా మారింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి 2023లో బీఆర్ఎస్ తరపున హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఇందులో సభ్యులుగా బీఆర్ఎస్ నుండి వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బీజేపీ నుండి పైడి రాకేష్ రెడ్డి, సీపీఐ నుండి కూనంనేని సాంబశివరావు ఉన్నారు. గత ఆగస్టు 29న జరిగిన ఎథిక్స్ కమిటీ సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి శాసనసభలో వ్యవహరించిన వీడియోను చూసి, ఇరుపక్షాల వాదనలు విన్నారు.

తదుపరి సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిని పిలిచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా స్పీకర్ 10వ షెడ్యూల్ కింద నిర్ణయం తీసుకుంటారు. సభ హుందాతనాన్ని కాపాడటం అనుచిత ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అంటుండగా, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు ధోరణి అని బీఆర్ఎస్ వాదిస్తోంది.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారని, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ ఎందుకు విచారణ చేయడం లేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మందుల సామేలు, దానం నాగేందర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎథిక్స్ కమిటీకి ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ తీసుకునే నిర్ణయం మీద ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్ ఉపఎన్నిక తప్పదా అన్నది కొంతకాలం ఆగితే గానీ తెలియదు.

Tags:    

Similar News