ప్ర‌ధాని మోడీ ఇంటి ముందు రాహుల్ ధ‌ర్నా.. 5 డిమాండ్లు!

ప్ర‌ధాని నివాసం ముందు ధ‌ర్నాకు దిగిన కాంగ్రెస్ నేత‌ల‌తో త‌క్ష‌ణ‌మే చ‌ర్చ‌ల‌కు దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో రాయ‌బారం పంపింది.

Update: 2026-07-21 17:02 GMT

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ, ఆయ‌న సోద‌రి, ఎంపీ ప్రియాంక గాంధీలు అనూ హ్య రీతిలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.. ఢిల్లీలోని ప్ర‌ధాన మంత్రి నివాసం ముందున్న రోడ్డుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేతో క‌లిసి వీరు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ ధ‌ర్నాకు కూడా భారీ సంఖ్య‌లో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయ‌కులు, కాక్రోచ్ జ‌న‌తాపార్టీ కార్య‌కర్త‌లు హాజ‌ర‌య్యారు. ప్ర‌ధానంగా సోమ‌వారం ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న ఉద్రిక్త‌త‌ల‌కు దారితీయ‌డం, కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీ చార్జి చేయ‌డం వంటి ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర‌స‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా ఐదు డిమాండ్ల‌ను కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెర‌మీదికి తెచ్చారు. 1. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలి,

2. నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలి, 3. నీట్ పేపర్ లీక్ పై హోంమంత్రి సమాధానం చెప్పాలి, 4. నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్రేషియా ఇవ్వాలి, 5. ఢిల్లీలో హింసపై విచారణ జరిపించాలి, వంటి కీల‌క డిమాండ్ల‌పై కేంద్రం త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని కోరారు. ఈ స‌మ‌యంలో మ‌ల్లికార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీలు త‌మ చేతుల‌కు సంకెళ్లు వేసుకుని నిర‌స‌న తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ఒక ర‌కంగా ఇది భారీ నిర‌స‌నేన‌ని చెప్పాలి. సోమ‌వారం కాక్రోచ్ పార్టీ నుంచి సెగ‌త‌గిలిన మ‌ర్నాడే కాంగ్రెస్ పార్టీ నేత‌లు మంగ‌ళ‌వారం ప్ర‌ధాని నివాసం ముందు ఇలా ధ‌ర్నాకు దిగ‌డంతో కేంద్రం ఉలిక్కి ప‌డింది.

త‌క్ష‌ణ చ‌ర్చ‌లు..

ప్ర‌ధాని నివాసం ముందు ధ‌ర్నాకు దిగిన కాంగ్రెస్ నేత‌ల‌తో త‌క్ష‌ణ‌మే చ‌ర్చ‌ల‌కు దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో రాయ‌బారం పంపింది. అన్ని విష‌యాల‌పైనా చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మేన‌ని.. వెంట‌నే నిర‌స‌న‌ను విరమించాల‌ని విజ్ఞ‌ప్తిచేశారు. కానీ, కాంగ్రెస్ నాయ‌కులు మాత్రం నిర‌స‌నను విర‌మించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో పొద్దు పోయే వ‌ర‌కు ఈ నిర‌స‌న కొన‌సాగింది. మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీకి ఇత‌ర పార్టీల నుంచి కూడా మ‌ద్ద‌తు ల‌భించింది. ఇండియా కూట‌మి పార్టీలు.. ఈ ధ‌ర్నాకు నిర‌స‌న కు మ‌ద్ద‌తుగా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో ధ‌ర్నాకు మ‌రింత మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్టు అయింది.

విర‌మించ‌ని కాక్రోచ్‌..

గ‌త నెల 20వ తేదీ నుంచి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌కర్త‌లు.. త‌మ నిర‌స‌న‌ను మంగ‌ళ‌వారం కూడా కొన‌సాగించారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన నిర‌స‌న‌లో సోమ‌వారం నాడు పోలీసుల లాఠీ దెబ్బ‌ల‌తో గాయ‌ప‌డిన వారు కూడా పాల్గొన్నారు. మ‌రోవైపు.. జోరు వ‌ర్షం కురిసినా వెర‌వ‌కుండా వ‌ర్షంలోనే త‌న నిర‌స‌న‌ను కొన‌సాగించారు. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను రాజీనామా చేయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. మొత్తంగా.. ఢిల్లీలో అటు కాక్రోచ్ జ‌న‌తా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు చేప‌ట్టిన ధ‌ర్నాతో పెద్ద ఎత్తున ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి.

Tags:    

Similar News