పోలింగ్ కి అంతా రెడీ....పోలీసుల వలయంలోనే !
ఏపీలో తొలి విడతగా కార్పోరేషన్లు, మునిసిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో తొలి విడతగా కార్పోరేషన్లు, మునిసిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఏడు నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ ఏకధాటిగా పది గంటల పాటు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసారి ఎన్నికలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గట్టి బందోబస్తు చేశారు. ఏకంగా 75 వేల మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటున్నారు. అంతే కాదు 36,351 మంది పోలీసులతో బందోబస్తు అంటే ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. అత్యంత కట్టుదిట్టంగా పోలింగ్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
స్వేచ్ఛగా ఓటు హక్కు కోసం :
ప్రతీ ఓటరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి స్వేచ్చగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లుగా అనిల్ చంద్ర పునేఠా చెప్పారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై గత మూడు నాలుగు నెలలుగా విస్తృత స్థాయిలో సమీక్షలు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చామని ఆయన గుర్తు చేశారు. ప్రతీ చోటా సీసీటీవీ వెబ్‌కాస్టింగ్ పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వాతావరణాన్ని కల్పించడం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
92 చోట్ల ఎన్నికలు :
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి 100 పట్టణ స్థానిక సంస్థలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే వీటిలో ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలను మినహాయించినట్లు అయితే 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలలో మాత్రమే ఆదివారం స్థానిక ఎన్నికలు జరగనున్నాయని అనిల్ చంద్ర పునేఠా చెప్పారు. పిడుగురాళ్ల, గుడిజాల, దాచేపల్లి, దర్శి, పలమనేరు, ప్రొద్దుటూరు, రాయచోటి, కమలాపురం మునిసిపాలిటీలలో ఏకగ్రీవాలు అయ్యాయి. అలాగే మొత్తం 3,942 వార్డులకు గాను 756 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లలో 118 మంది, మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో 638 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా వివరించారు. అలాగే మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో 17 మంది చైర్పర్సన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
మొత్తం 9,642 మంది అభ్యర్థులు :
రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు 153 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎక్కడా ఏకగ్రీవం అన్నది లేకుండా అన్ని కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 70 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు 367 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్లలోని 922 వార్డులకు 3,073 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల్లోని 2,382 వార్డులకు 6,669 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 9,642 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటికే 6,600 ప్రాంతాల్లో సుమారు 12,000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ క్రిటికల్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. వీటి పరిధిలో సుమారు 5,500 ప్రాంతాలు గుర్తించి భారీ పోలీస్ బందోబస్తుని నిర్వహిస్తున్నారు.
భారీ ఎత్తున సిబ్బంది :
ఎన్నికలు అంటే మహా యజ్ఞం. అందుకోసం భారీ ఎత్తున సిబ్బందిని వినియోగిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణ కోసం వివిధ స్థాయిల్లో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు కమిషనర్ వివరించారు. రిటర్నింగ్ అధికారులు1,449 మంది, ఏఆర్ఓలు 2,543 మంది, ప్రిసైడింగ్ అధికారులు 13,504 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 13,504 మంది, ఇతర పోలింగ్ అధికారులు 51,716 మంది, మైక్రో అబ్జర్వర్లు 3,720 మంది, వెబ్ కాస్టింగ్ సిబ్బంది 1,835 మందిని వినియోగిస్తున్నామని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మొత్తం పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వెబ్ కాస్టింగ్, అవసరమైన చోట్ల ఇతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని ముందుగానే ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
రెండు నెలల పాటు వీడియో ఫుటేజీ :
ఇదిలా ఉండగా గతంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎన్నికలకు సంబంధించిన వీడియో ఫుటేజీ భద్రపరిచే గడువును 40 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించినట్లుగా ఎన్నికల ప్రధానాధికారి వివరించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల వివాదాలకు సంబంధించి ఎన్నికల ట్రిబ్యునల్ లేదా న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న సందర్భాల్లో సంబంధిత వీడియో ఫుటేజీని కేసుల పరిష్కారం అయ్యే వరకు భద్రపరిచేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.