సొంత ఊర్లో జగన్ కు బిగ్ సవాల్.. పులివెందుల గెలవక తప్పని పరిస్థితి

పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబం కంచుకోటగా చెబుతున్నారు. గత 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబం చెప్పిన వారే స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు.

Update: 2026-10-31 11:30 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో విషమ పరిస్థితి ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నడూ లేనట్లుగా పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ ఏకగ్రీవాలు చేసుకోవడాన్ని మాజీ సీఎం జగన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. తన అడ్డాలో టీడీపీ జెండా పట్టుకున్న వారే లేరనుకున్న ధీమాలో జగన్ రెడ్డి ఉండేవారని చెబుతున్నారు. అయితే ఏకంగా 20 వార్డులు ఏకగ్రీవం చేసుకునే స్థాయికి టీడీపీ చేరుకుంటుందని జగన్ రెడ్డి ఎప్పుడూ ఊహించలేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పులివెందుల చైర్ పర్సన్ గా బరిలోకి దిగిన తన సొంత పిన్ని వైఎస్ ప్రమీలమ్మను గెలిపించాల్సిన బాధ్యత జగన్ రెడ్డి భుజస్కందాలపై పడిందని అంటున్నారు. దీంతోనే మున్సిపల్ ఎన్నికల రోజు జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారని చెబుతున్నారు.

పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబం కంచుకోటగా చెబుతున్నారు. గత 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబం చెప్పిన వారే స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పులివెందుల నియోజకవర్గంలో మాత్రం వైఎస్ కుటుంబం పెత్తనమే నడిచేదని అంటున్నారు. అటువంటిది తొలిసారిగా వైఎస్ కుటుంబం జీర్ణించుకోలేని స్థితిలో టీడీపీ ఏకగ్రీవాలు చేసుకోవడమే రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోందని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు పులివెందులలో తనకు ఎదురే లేదన్నట్లు భావించిన మాజీ సీఎం జగన్ రెడ్డికి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత సొంత నియోజకవర్గంలోనూ సవాళ్లు ఎదురుకావడమే హాట్ టాపిక్ అవుతోందని అంటున్నారు.

నిజానికి పులివెందుల రాజకీయాల్లో జగన్ రెడ్డి ఎప్పుడూ నేరుగా జోక్యం చేసుకోలేదని చెబుతున్నారు. తన కుటుంబ సభ్యులు అయిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ గా పోటీ చేస్తున్న వైఎస్ ప్రమీలమ్మ భర్త మనోహరరెడ్డి మాత్రమే స్థానిక రాజకీయం చూసుకునే వారంటున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన సొంత ఇలాకాలో పాతుకుపోయేలా చేస్తున్న ప్రయత్నాలతో జగన్ రెడ్డి ఆందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు. భాస్కర్ రెడ్డి పులివెందులలో లేకపోవడం, అవినాశ్ రెడ్డి, మనోహర్ రెడ్డిని పోలీసుల సాయంతో అడ్డుకునేలా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్న కారణంగా తానే నేరుగా రంగంలోకి దిగాలని జగన్ రెడ్డి భావించారని అంటున్నారు.

ఇప్పటికే ఒకసారి పులివెందుల వెళ్లి వచ్చిన ఆయన ఆదివారం జరిగే పోలింగ్ కు వస్తానని, ఓటు వేస్తానని చేసిన ప్రకటన పులివెందుల వైసీపీ కేడర్ లో ధైర్యం నింపిందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానికంగా ఉంటే తమ కేడర్ స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలు ఉంటుందని, లేదంటే వైసీపీ సానుభూతిపరులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయని వైసీపీ నేతలు భయపడుతున్నారని చెబుతున్నారు. దీంతో జగన్ రెడ్డి రాకతో పులివెందుల పోలింగ్ శాతం పెరుగుతుందని, ఇది తమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి పులివెందుల మున్సిపల్ చైర్మన్ పీఠం గెలవడం పార్టీ కన్నా మాజీ సీఎం జగన్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టే ముఖ్యం అంటున్నారు. సొంత నియోజకవర్గంలో సొంత కుటుంబ సభ్యులను గెలిపించుకోలేని పరిస్థితులు ఉంటే జగన్ రాజకీయ భవిష్యత్తుకు కూడా పెను ప్రమాదమన్న సంకేతాలుగానే భావించాల్సివుందని అంటున్నారు. దీంతో పులివెందుల గెలుపు కోసం జగన్ రెడ్డి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనే ఉత్కంఠ ఎక్కువ అవుతోందని అంటున్నారు.

Tags:    

Similar News