ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ లొకేషన్.. రూ.2 వేల ఎంట్రీ ఫీజు.. హైదరాబాద్ శివారులో వెలుగుచూసిన భారీ పూల్ పార్టీ

ఈ పార్టీకి శంకరపల్లి మండలం దొంతన్‌పల్లిలోని ఓ యూనివర్సిటీకి చెందిన బీబీఏ, ఇంజినీరింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం.

Update: 2026-10-31 09:10 GMT

హైదరాబాద్ శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో రాత్రివేళ నిర్వహించిన ఓ ‘‘పూల్ పార్టీ’’ తీవ్ర కలకలం రేపింది. కమ్మెట గ్రామం వద్ద ఉన్న ఎల్జీ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థులతో భారీ పూల్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్.ఓటీ), చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో సుమారు 108 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 

 

పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీకి ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించిన ఒక అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫ్రెండ్స్ , ఫాలోవర్లకు ఆహ్వానాలు పంపాడు. పార్టీ వేదికను ముందుగా చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. ఎంట్రీ ఫీజు కింద ఒక్కొక్కరి నుంచి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు డిజిటల్ విధానంలో వసూలు చేశాడు. డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే చివరి నిమిషంలో ఫామ్‌హౌస్ లొకేషన్ షేర్ చేసి రప్పించినట్లు విచారణలో తేలింది.

 

ఈ పార్టీకి శంకరపల్లి మండలం దొంతన్‌పల్లిలోని ఓ యూనివర్సిటీకి చెందిన బీబీఏ, ఇంజినీరింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. గతంలో అక్కడ జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో పరిచయాల ఆధారంగా సదురు యువకుడు వీరిని ఆహ్వానించాడు. పోలీసులు దాడి చేసిన సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారందరికీ పరీక్షలు నిర్వహించగా.. ప్రధాన నిర్వాహకుడు తో పాటు మరో ఇద్దరు విద్యార్థులకు గంజాయి పాజిటివ్‌గా వచ్చింది. సంఘటనా స్థలంలో భారీగా మద్యం సీసాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫామ్‌హౌస్‌లో గంజాయి ఎలా లభ్యమైంది? దీని వెనుక ఎవరున్నారు? ఫామ్‌హౌస్ యజమాని ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా 'ఈగల్ ఫోర్స్' ఏర్పాటు చేసి దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో విద్యార్థులు లక్ష్యంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.

Tags:    

Similar News