ఇండీ కూటమి దూకుడు...ఎన్డీయే వ్యూహమేంటి ?
దేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయంగా దూకుడు చేస్తోంది.
దేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయంగా దూకుడు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం మీద తమ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ క్రమంలో అభిశంసన తీర్మానం ఆమోదించింది. నవంబర్ 1న భారీ మార్చ్ కి రెడీ అవుతోంది. ఇది నిరంతర పోరాటం అని స్పష్టం చేస్తోంది. అధికార ఎన్డీయేకు ఒక విధంగా సవాల్ చేస్తూ ఇండీ కూటమి అడుగులు వేస్తోంది. మరి ఎన్డీయే వ్యూహం ఏమిటి అన్నదే చర్చగా ఉంది.
అనుకున్నది చేసింది :
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి తమ పోరాటంలో కొత్త అడుగు వేసింది. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. ఆయన తక్షణం పదవికి రాజీనామా చేయాల్సిందే అని స్పష్టం చేసింది. సర్ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని మరో డిమాండ్ చేసింది. ప్రజలందరి ఓటు హక్కుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం కాపాడాల్సింది అని పేర్కొంది. ఇది తమ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ముందడుగు అని ఇండీ కూటమి పేర్కొంది. రానున్న రోజుల్లో మరింత గా ఉద్యమిస్తామని స్పష్టం చేసింది.
కోట్ల ఓట్లు తొలగింపు :
ఇదిలా ఉంటే దేశంలో వంద కోట్ల ఓటర్లు ఉంటే అందులో 13.2 కోట్ల ఓట్లను తొలగించారు అని ఇండియా కూటమి భారీ ఆరోపణలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణం తన పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని డిమాండ్ చేసింది. ఆయన మీద ఇండియా కూటమి నాయకత్వంలో ప్రతిపక్షాలు అంతా కలసి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాయి. ప్రజాస్వామ్యం కాపాడుకునేందుకే ఈ నిర్ణయం అని విపక్షాలు తమ వాదనను బలంగా వినిపించాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో ప్రజా అభిశంసన పేరుతో మాక్ పార్లమెంట్ ని నిర్వహించారు.
మాజీ స్పీకర్ అధ్యక్షత :
విపక్షాల మాక్ పార్లమెంట్ కి స్పీకర్ గా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అనేక ఆరోపణలు చేశారు. దేశంలో ఎన్నికల నిర్వహణ తీరు సక్రమంగా లేదని విమర్శించారు. దానితో పాటు ఈవీఎంల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగ్గా లేదని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏకంగా 13.2 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని ఖర్గే తీర్మానంలో పేర్కొన్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ ఫైర్ :
ఇదిలా ఉండగా ఇండీ కూటమి ప్రవేశపెట్టిన సీఈసీ మీద అభిశంసన తీర్మానానికి సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ పేరుతో దేశంలో దాదాపు 13.2 కోట్ల మంది ఓట్లను తొలగించారు అంటే ప్రతి ఏడుగురిలో ఒకరు ఓటు పోయింది అని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో గత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన పక్షానికి, విపక్షానికి మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 3 శాతం మాత్రమేనని ఉందని రాహుల్ గుర్తు చేశారు. కానీ ఏకంగా 15 శాతం ఓటర్లను తొలగించడం అంటే లోక్ సభ ఎన్నికల ప్రాధాన్యతను పూర్తిగా దెబ్బ తీశారు అని రాహుల్ ఫైర్ అయ్యారు. ఇదంతా దేశ ప్రజల ఓటు హక్కును కాలరాసే వ్యవహారంగా ఉందని ఆయన విమర్శించారు.
ప్రజాస్వామ్యం కోసం :
ఇదిలా ఉంటే సీఈసీ మీద ప్రజా అభిశంసన అనేది కేవలం ఒక రాజకీయ ప్రదర్శన మాత్రమే కాదని రాహుల్ చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి విపక్షాలన్నీ కలిసికట్టుగా ప్రయోగించిన అత్యంత పదునైన రాజకీయ ఆయుధమని ఆయన పేర్కొన్నారు. ఈ మాక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన 21 ప్రతిపక్ష పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.