ఉన్నత చదువులకు మీనాక్షి.. తెలంగాణకు కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్ని చూసేందుకు అధిష్టానం కొత్త నేతను త్వరలో పంపనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్ని చూసేందుకు అధిష్టానం కొత్త నేతను త్వరలో పంపనుంది. ప్రస్తుతం ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లనుండటం.. దాదాపు పది నెలల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండనున్న నేపథ్యంలో.. కొత్త ఇంఛార్జ్ ఎంపిక అనివార్యంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ని చూసేందుకు దీపా దాస్ మున్షీ స్థానంలో మీనాక్షి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో ఇంఛార్జ్ బాధ్యతల్ని చేపట్టిన మీనాక్షి.. మొదట్లో మెరుపులు మెరిపిస్తుందని ఆశించినా.. తన ముద్రను వేసే విషయంలో విఫలమయ్యారన్న మాట ఉంది.
అయితే.. ఆమెకు ముందున్న దీపాదాస్ మున్షీతో పోలిస్తే.. పార్టీ వ్యవహారాల్లో అవసరానికి మించిన జోక్యం చేసుకోలేదన్న పేరుంది. మొత్తంగా మీనాక్షి కారణంగా పార్టీకి కొత్త వివాదాలు రాకపోవటమే ఆమె కారణంగా జరిగిన మేలుగా చెప్పాలి. మీనాక్షి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలతో పాటు.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించొచ్చన్న మాట బలంగా వినిపిస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నలుగురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఖాయంగా ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రేసులో ఉన్నట్లుగా బలంగా వినిపిస్తున్న పేర్లలో ముకుల్ వాస్నిక్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వీరితో పాటు శక్తిసిన్హా గోహిల్.. దిగ్విజయ్ సింగ్.. అశోక్ గెహ్లాట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నలుగురిలో వివాదాలకు దూరంగా ఉంటూ..పలు రాష్ట్రాల్లో పార్టీ ఇంఛార్జ్ గా వ్యవహరించిన ముకుల్ వాస్నిక్ కు ఇంఛార్జ్ గా ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రేసులో ఆయన పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీలోనూ.. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవంతో పాటు.. కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. రాజస్థాన్.. గుజరాత్.. మధ్యప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాలకు ఆయన ఇంఛార్జ్ గా వ్యవహరించటంతో పాటు.. ఆ సందర్భంగా ఎలాంటి వివాదాలు ఆయన పేరుతో ప్రచారం కాకపోవటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.
దీనికి తోడు దక్షిణాది రాజకీయాల మీద మంచి అవగాహన ఉందంటున్నారు. తెలంగాణలోని పార్టీ నేతల మధ్య సమన్వయాన్ని మరింత పెంచేందుకు ఆయనే సరైన వ్యక్తిగా చెబుతున్నారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు శక్తి సిన్హా గోహిల్ పేరు కూడా వినిపిస్తోంది. గుజరాత్ ప్రభుత్వంలో ఆర్థిక.. విద్యాశాఖల మంత్రిగా.. అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరించిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది. ఢిల్లీ.. బిహార్ రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా పని చేసిన అనుభవం ఉంది. ఎన్నికలకు వ్యూహాల్ని సిద్ధం చేయటం.. పార్టీ క్యాడర్ ను సమన్వయం చేయటంలో ఆయనకు ప్రత్యేక అనుభవం ఉందంటున్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలకు ఇంఛార్జ్ గా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్ ను ఎంపిక చేస్తే మాత్రం.. కొత్త తలనొప్పులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు దిగ్విజయ్ సొంతం. ఇప్పటికే అచ్చ కాంగ్రెస్.. పచ్చ కాంగ్రెస్.. వైఎస్ కాంగ్రెస్ అంటూ మూడు వర్గాలు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ సరిపోనట్లుగా దిగ్విజయ్ కానీ రాష్ట్ర పార్టీ రాజకీయాల్లోకి ఇంఛార్జ్ గా ఎంట్రీ ఇస్తే మాత్రం.. టీకాంగ్రెస్ లో సీనియర్ నేతల మధ్య ఉన్న గ్యాప్.. మరింత పెరగటం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ గా.. అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.