ముందస్తు నిఘా.. కార్గిల్ వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి!
గడిచిన 27 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే... నిఘా లోపాల వల్ల భారత్ ఎన్నో దాడుల రూపంలో భారీ మూల్యాన్ని చెల్లించింది.
అది ఒక ఉద్వేగం.. అసాధారణ పోరాటంలో అజేయమైన వీరసైనికుల ఉద్విగ్నత... చావో రేవో తేల్చుకునేందుకు గడ్డకట్టే మైనస్ డిగ్రీల చలిలో భారతీయ సైనికులు తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి సాధించిన విజయం.. అందుకే కార్గిల్ యుద్ధం చాలా ప్రత్యేకమైనది. అందుకే ప్రతియేటా మనం `కార్గిల్ దివస్`ని జరుపుకుంటున్నాం.
కార్గిల్ విజయ్ దివస్ అనేది ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక అపూర్వమైన ఉద్వేగాన్ని, గర్వాన్ని రగిల్చే పవిత్రమైన రోజు. 1999లో జమ్మూ కాశ్మీర్‌లోని ముష్కో వ్యాలీ నుండి చోర్బత్ లా వరకు గడ్డకట్టే మైనస్ డిగ్రీల చలిలో అసాధ్యమైన కొండలపై శత్రువులు పొంచి ఉన్నా.. మన భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారు. 527 మంది వీర జవాన్లు తమ రక్తాన్ని ధారపోసి.. పాకిస్థాన్ సైన్యాన్ని సరిహద్దుల అవతలకు తరిమికొట్టి తోలోలింగ్ శిఖరాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ అజేయమైన విజయం... అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థమే మనం ఏటా ఈ దివస్‌ను అత్యంత గౌరవంతో జరుపుకుంటున్నాం.
అయితే కార్గిల్ పోరాటంలో విజయం సాధించినా భారత్ నేర్చుకోవాల్సిన అత్యంత కఠినమైన పాఠం `ముందస్తు నిఘా` ప్రాముఖ్యత. 1999 లహోర్ ప్రకటన తర్వాత పాకిస్థాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో నాటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ అత్యంత కుట్రపూరితంగా కార్గిల్‌లోకి చొరబాటుకు ప్రణాళిక వేశారు. మన నిఘా వర్గాలు, మిలిటరీ నాయకత్వం పాకిస్థాన్ నయవంచనను ముందే గుర్తించలేకపోవడం వల్ల భారత్ భారీగా ఆర్థిక - మానవ ప్రాణ నష్టాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ముందస్తు నిఘా వ్యవస్థ బలంగా ఉండి ఉంటే ఈ యుద్ధాన్ని.. ఈ ప్రాణనష్టాన్ని ముందే అడ్డుకునే అవకాశం ఉండేది.
గడిచిన 27 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే... నిఘా లోపాల వల్ల భారత్ ఎన్నో దాడుల రూపంలో భారీ మూల్యాన్ని చెల్లించింది. ఐసీ-814 విమానం హైజాక్... 2001 పార్లమెంట్ దాడి... 2008 ముంబై 26/11 దాడులతో పాటు ఇటీవలి పహల్గామ్ దాడి, పుల్వామా, యూరి, పఠాన్‌కోట్ ఉగ్రదాడుల వరకు ఏదో ఒక స్థాయిలో నిఘా లోపాలు బహిర్గతమయ్యాయి. ప్రభుత్వం సైనికపరంగా ప్రతి దాడికి గట్టి సమాధానమే ఇచ్చినా.. నిఘా వ్యవస్థ కేవలం సాంకేతిక విశ్లేషణలపై ఆధారపడటం.. హ్యూమన్ ఇంటెలిజెన్స్ (మానవ నిఘా) తగ్గుముఖం పట్టడం వల్ల దేశానికి అపారమైన నష్టం వాటిల్లుతోంది.
యుద్ధం సంభవించినప్పుడు ప్రయోగించే ఒక్కో బ్రహ్మోస్ క్షిపణి లేదా అధునాతన రాకెట్ వ్యవస్థల వ్యయం రూ. 40 కోట్ల పైమాటే ఉంటుంది. నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి పెట్టే ఖర్చు కంటే.. యుద్ధంలో లేదా ఉగ్రదాడులను నిరోధించడంలో అయ్యే ఆర్థిక వ్యయం మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల భారత నిఘా సంస్థలు కేవలం నివేదికలు రాసే సాధారణ ప్రభుత్వ శాఖల్లా కాకుండా...శత్రువుల స్థావరాల వద్దే ముప్పును ముందే గుర్తించి నిర్మూలించే స్థాయిలో స్వతంత్రంగా.. అత్యంత ప్రాధాన్యతా క్రమంలో ఆవిష్కరణలతో పనిచేయాల్సిన అవసరం ఉంది.
భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న వేళ... సరిహద్దు శత్రువులు మనదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి భయపడేలా మన సైనిక, నిఘా వ్యవస్థల ప్రతిబంధకం ఉండాలి. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో బలమైన రాజకీయ నాయకత్వం ఉన్నా.. వలసరాజ్యాల కాలంనాటి బ్యూరోక్రసీ, సీనియారిటీ పద్ధతులకే పరిమితం కాకుండా నిఘా వర్గాలకు సంపూర్ణ అధికారాలు, స్వేచ్ఛ ఇవ్వాలి. కార్గిల్ అమరవీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి.. మన నిఘా - భద్రతా వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్ది... మరేదైనా సరిహద్దులో కార్గిల్ వంటి ఘటన పునరావృతం కాకుండా చూడటమే.