యూపీఐ చార్జీల గుదిబండ జనం నెత్తి మీదకు ?
ఆ విధంగా చూస్తే మళ్లీ నగదు వాడకాన్ని జనాలకు అలాగే వ్యాపార వర్గాలకు అలవాటు చేసే పరిస్థితిని ఈ యూపీఐ కొత్త నిబంధనలు తీసుకుని రావచ్చు అని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు దాటిన యూపీఐ లావాదేవీల మీద చార్జీలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమలు చేయడానికి కూడా తీర్మానించింది. ఇక యూపీఐ కొత్త నిబంధనలు చూస్తే కనుక రెండు వేల లావాదేవీలు దాటిన ప్రతీ యూపీఐ వినియోగం పైనా చార్జీల మోత మోగనుంది. ఇది కేవలం వ్యాపారులకు వ్యక్తులు చేసే యూపీఐ చెల్లింపు అని చెబుతున్నారు. అలా రెండు వేల నుంచి మూడు వేల మధ్య ఐదు రూపాయలు ఛార్జీ వసూలు చేస్తారు. అలాగే మూడు వేల రూపాయలకు 12 రూపాయలు చార్జి ఉంటుంది. ఇక అక్కడ నుంచి యాభై వేల రూపాయలకు రెండు వందల రూపాయలు చార్జీ బాదుడు ఉంటుంది. అదే 75 వేల రూపాయలు అయితే 300 చార్జీగా ఆ పైన అలా వడ్డింపు కొనసాగుతుంది. అయితే చిరు వ్యాపారులకు లక్ష వరకు యూపీఐ లావాదేవీలకు ఎలాంటి చార్జీలు ఉండవని చెబుతోంది.
వారిమీదనే బాదుడు :
అయితే యూపీఐ లావాదేవీల విషయంలో కొత్త నిబంధనలు కేంద్రం తీసుకుని వచ్చినా ఇది బడా వ్యాపారులకే అని చెప్పినా చివరికి అది కాస్తా జనం నెత్తి మీదకే పడుతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అది ఎలా అంటే అది పరోక్షమైన పన్నుగా జనం మీద పడే ప్రమాదం ఉందని అంటున్నారు. వ్యాపారులు ఎవరూ తమ మీద విధించిన ఈ చార్జీలను ఉంచుకోరని అంటున్నారు. తిరిగి జనం మీదనే వాటిని మళ్ళిస్తారు అని ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో ఎక్కడైనా దుకాణందారులకు వినియోగదారులు రెండు వేల కంటే ఎక్కువ చెల్లించాలి వస్తే ఈ చార్జీల మోత తప్పించుకోవడానికి నగదునే వారు డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందని కూడా అంటున్నారు.
మళ్లీ నగదు వాడకం :
ఆ విధంగా చూస్తే మళ్లీ నగదు వాడకాన్ని జనాలకు అలాగే వ్యాపార వర్గాలకు అలవాటు చేసే పరిస్థితిని ఈ యూపీఐ కొత్త నిబంధనలు తీసుకుని రావచ్చు అని అంటున్నారు. నిజానికి గత పదేళ్ళుగా దేశంలో యూపీఐ వ్యవస్థ చక్కగా పనిచేస్తోంది అని గుర్తు చేస్తున్నారు. అలాంటి వ్యవస్థను ఇపుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ప్రశ్నలు వస్తున్నాయి. దీని విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని సూచనలు వెలువడుతున్నాయి. అదే జరిగితే బ్యాంకుల మీద నగదు నిర్వహణ భారం కూడా పడుతుందని చెబుతున్నారు.
సబ్సిడీ ఇస్తే నష్టమేంటి :
ఇక యూపీఐ లావాదేవీలు అన్నీ ఉచితం అని అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆర్ధిక నష్టం ఏమిటో చెప్పాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అంతా లాభమే జరిగిందని అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా 2.87 లక్షల కోట్ల రూపాయల మిగులు బదిలీ జరిగిందని గుర్తు చేసతున్నారు. లిస్టెడ్ బ్యాంకుల మొత్తం లాభాలు సైతం 4.11 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఎన్‌పీసీఐ ప్రీ ట్యాక్స్ మిగులు కూడా ఒక వేయి 888 కోట్ల రూపాయలుగా ఉందని ప్రస్తావిస్తున్నారు. మరి ఇంత బాగా జరుగుతున్న వ్యవస్థలో చార్జీల విధింపు అన్నది ఇబ్బందికరమైన పరిస్థితులను తెస్తుంది అన్నది అయితే ఆర్థిక నిపుణుల మాటగా ఉంది. చూడాలి మరి కేంద్రం అమలు చేయనున్న యూపీఐ కొత్త నిబంధనలు ఎలాంటి ప్రభావం చూపుతాయో.