బీజేపీకి యూసీసీ చిక్కులు.. ఏపీ మాటేంటి?
వచ్చే 2029 ఎన్నికల నాటికి దేశంలోని అన్ని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో(ఏపీ కూడా ఉంది) యూసీసీని ఖచ్చితంగా అమలు చేస్తామని అమిత్ షా తాజాగా ముంబైలో ప్రకటించారు.
కేంద్రంలోని బీజేపీ చిక్కుల్లో పడుతోందా? యూసీసీని ఖచ్చితంగా అమలు చేసిన తర్వాత.. వచ్చే ఎన్నికలకు వెళ్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రకటన చేసిన తర్వాత.. రాజకీయ పరిణామాలు మారుతున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా బీహార్‌లో జేడీయూ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో తాజాగా యూసీసీ మంటలు రేపింది. ఇక, ఏపీలోనూ ఎన్డీయే కూటమి ఉన్న నేపథ్యం లో ఇక్కడ ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.
ఏంటీ యూసీసీ..
యూసీసీ అంటే.. యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి). అంటే.. భారత్‌లో నివసించే పౌరులు అందరికీ ఒకే విధమైన చట్టం వర్తించడం. ఉదాహరణకు ముస్లింలకు వివాహానికి సంబంధించి షియా చట్టలు అమలులో ఉన్నాయి. కానీ, ఇప్పుడు యూసీసీ అమలైతే.. వారంతా దానికిందకే వస్తారు. అలానే వారసత్వ హక్కులు కూడా ఇతర మతాల్లో భిన్నంగా ఉన్నాయి. యూసీసీతో అవి కూడా ఏకీకృతం అవుతాయి. మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత విషయాలలో ఒకే విధమైన సమాన చట్టాలను వర్తింపజేసే విధానం.
షా ఏమన్నారు?
వచ్చే 2029 ఎన్నికల నాటికి దేశంలోని అన్ని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో(ఏపీ కూడా ఉంది) యూసీసీని ఖచ్చితంగా అమలు చేస్తామని అమిత్ షా తాజాగా ముంబైలో ప్రకటించారు. ఆ వెంటనే ఈ వ్యవహారం రాజకీయ చర్చకు, రచ్చకు కూడా దారితీసింది. దీనిని తాము వ్యతిరేకిస్తున్నట్టు.. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీహార్ అధికార పార్టీ జేడీయూ ప్రకటించింది. దీనినిప్రజలు వ్యతిరేకిస్తున్నారని.. ప్రజల విశ్వాసాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామ ని ప్రకటించింది. దీంతో తొలి దెబ్బ బీహార్ నుంచే ప్రారంభమైంది. ఇక, కాంగ్రెస్ పార్టీ యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అలానే, పంజాబ్, యూపీలలోని ముస్లింలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు.
ఏపీ సంగతేంటి?
ఏపీలోనూ టీడీపీ నేతృత్వంలోని కూటమి(ఎన్డీయే) ప్రభుత్వమే ఉంది. అమిత్ షా ప్రకటన ప్రకారం ఏపీలోనూ యూసీసీని వచ్చే ఎన్నికల నాటికి అమలు చేయాల్సి వస్తే.. దీనికి చంద్రబాబు అంగీకారం తెలుపుతారా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. మతపరమైన ముస్లిం ఓటుబ్యాంకు 12 శాతంగా ఉంది. కర్నూలు, గుంటూరు, అనంతపురం, విజయవాడ సహా.. పలు ప్రాంతాల్లో ముస్లింలు కీలక రాజకీయ నేతలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి సర్కారుకు ఈ వ్యవహారం అగ్నిపరీక్షగా మారుతుందన్న చర్చ సాగుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.