అక్టోబర్ 15 నుంచి కొత్త యూపీఐ రూల్స్.. రూ.300 వరకు ఎండీఆర్ ఛార్జీ
మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్ల వంటి నిర్దిష్ట వర్గాలకు 0.02 శాతం ఎండీఆర్ రేటు నిర్ణయించారు. ఈ సందర్భంలోనూ ఒక్కో లావాదేవీకి గరిష్ఠ ఎండీఆర్ రూ.300గా ఉంటుంది.
యూపీఐ వినియోగించే కోట్లాది మందిలో ఇప్పుడు ఒక ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. “రూ.2,000 దాటితే ఇక యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు చెల్లించాలా?” అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కొత్త నిబంధనను వినియోగదారుల కోణంలో చూస్తే అసలు విషయం వేరుగా ఉంది. సాధారణ కస్టమర్లు యూపీఐ చెల్లింపులు చేసినందుకు నేరుగా ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీసీఐ) ప్రకటించిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానం ప్రధానంగా వ్యాపారులు స్వీకరించే కొన్ని యూపీఐ చెల్లింపులకు సంబంధించినది. ఈ మార్పులు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
రూ.2,000 వరకు అయితే ఎలాంటి టెన్షన్ లేదు
మీరు ఒక షాపులో రూ.500, రూ.1,000 లేదా రూ.2,000 వరకు యూపీఐ ద్వారా చెల్లిస్తే కొత్త ఎండీఆర్ నిబంధన ప్రభావం ఉండదు. అలాగే పర్సన్-టు-పర్సన్ లావాదేవీలు కూడా ఉచితంగానే కొనసాగుతాయి. అంటే స్నేహితుడికి డబ్బులు పంపడం, కుటుంబ సభ్యుడికి యూపీఐ ద్వారా నగదు బదిలీ చేయడం వంటి లావాదేవీలపై ఈ ఎండీఆర్ విధానం వర్తించదు.
మొత్తం యూపీఐ , పర్సన్ టు పర్సన్ లావాదేవీల్లో 95 శాతానికి పైగా రూ.2,000 లోపే ఉండటంతో అత్యధిక చిన్న చెల్లింపులకు ఈ మార్పు ప్రభావం ఉండదని ఎన్.పీసీఐ స్పష్టం చేసింది.
మరి రూ.2,000 దాటితే ఎంత?
ఇక్కడే అసలు విషయం ఉంది. నిర్దిష్ట వ్యాపార వర్గాలను మినహాయిస్తే రూ.2,000 దాటిన పర్సన్ టు పర్సన్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది. ఉదాహరణకు రూ.10,000 విలువైన అర్హత ఉన్న వ్యాపార చెల్లింపుపై ఎండీఆర్ రూ.40 అవుతుంది. రూ.50,000 చెల్లింపుపై రూ.200 వరకు ఉంటుంది. అయితే దీనికి ఒక గరిష్ఠ పరిమితి ఉంది. ఒక్కో లావాదేవీపై ఎండీఆర్ రూ.300కు మించదు. కాబట్టి రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన అర్హత ఉన్న లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 ఎండీఆర్ వర్తిస్తుంది.
రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్‌కు మాత్రం ఫ్లాట్ ఛార్జీ
అన్ని రంగాలకు ఒకే రేటు ఉండదు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి నిర్దిష్ట విభాగాల్లో రూ.2,000 దాటిన ప్రతి లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ వర్తించనుంది. అంటే ఈ విభాగాల్లో పెద్ద మొత్తంలో చెల్లింపు చేసినా సాధారణ 0.4 శాతం రేటు కాకుండా నిర్దేశిత ఫ్లాట్ ఎండీఆర్ విధానం అమలవుతుంది.
చిన్న వ్యాపారులకు ఊరట
కొత్త ఎండీఆర్ విధానంలో చిన్న వ్యాపారులకు కూడా మినహాయింపులు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు చెల్లింపులు స్వీకరించే అర్హత ఉన్న చిన్న వ్యాపారులకు జీరో-ఎండీఆర్ ప్రయోజనం కొనసాగనుంది. దీంతో చిన్న కిరాణా దుకాణాలు, స్థానిక వ్యాపారులు, చిన్న షాపులపై అదనపు భారం పరిమితంగానే ఉండనుంది.
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్లకు వేరే రేటు
మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్ల వంటి నిర్దిష్ట వర్గాలకు 0.02 శాతం ఎండీఆర్ రేటు నిర్ణయించారు. ఈ సందర్భంలోనూ ఒక్కో లావాదేవీకి గరిష్ఠ ఎండీఆర్ రూ.300గా ఉంటుంది.
కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయా?
ఇదే అంశంపై ఎక్కువగా అపోహలు వస్తున్నాయి. ఎండీఆర్ అనేది సాధారణంగా మర్చంట్/వ్యాపారి వైపు వర్తించే చార్జీ. కాబట్టి రూ.5,000 యూపీఐ పేమెంట్ చేసినంత మాత్రాన కస్టమర్ బ్యాంక్ ఖాతా నుంచి అదనంగా ఎండీఆర్ పేరుతో రూ.20 కట్ అవుతుందని అర్థం కాదు. ఎన్.పీసీఐ ప్రకారం సాధారణ వినియోగదారుల యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయి. అలాగే యూపీఐ యాప్స్ ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా దాచిన ఛార్జీలను విధించకూడదని కూడా స్పష్టం చేసింది.
అసలు మార్పు ఏంటి?
ఈ నిర్ణయాన్ని కేవలం “యూపీఐకి ఛార్జీలు వచ్చేశాయి” అనే కోణంలో చూడటం సరికాదు. వాస్తవానికి ఇది యూపీఐ ద్వారా జరిగే కొన్ని పెద్ద వ్యాపార లావాదేవీలపై వ్యాపారులకు వర్తించే ఎండీఆర్ వ్యవస్థలో మార్పు. చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపులను ఉచితంగా కొనసాగిస్తూ పెద్ద విలువైన నిర్దిష్ట పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు ఎండీఆర్ విధించడం ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో టైర్-3, అంతకంటే చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులను పెంచేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. చిన్న వ్యాపారుల్లో డిజిటల్ పేమెంట్స్‌ను మరింత విస్తరించడమే దీని లక్ష్యంగా ఉంది.
సింపుల్‌గా చెప్పాలంటే..
రూ.2,000 లోపు యూపీఐ పేమెంట్స్ కు ఎలాంటి ఎండీఆర్ లేదు.
పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ లేదు.
రూ.2,000 దాటిన అర్హత ఉన్న సాధారణ పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు 0.4% ఎండీఆర్ గరిష్ఠంగా రూ.300 విధిస్తారు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి విభాగాలు రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది. చిన్న వ్యాపారులకు నిర్దిష్ట పరిమితి వరకు జీరో ఎండీఆర్ ప్రయోజనం దక్కుతుంది.
కాబట్టి వినియోగదారులు మాత్రం “రూ.2,000 దాటితే యూపీఐ వాడటం ఖరీదైపోతుంది” అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త మార్పుల ప్రధాన ప్రభావం కస్టమర్‌పై కాకుండా, నిర్దిష్ట వ్యాపార చెల్లింపుల ఎండీార్ వ్యవస్థపైనే ఉంటుంది.