సువేందు ఒక్క ప్లాన్.. దేశమంతా షాక్.. మమతా బెనర్జీ కోలుకుంటుందా?
ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీఎంసీని ఓడించి బీజేపీ అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అత్యంత ప్రభావవంతమైన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక వ్యూహాత్మక, భావోద్వేగ నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి మాజీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) దివంగత చంద్రనాథ్ రథ్ తల్లి, సీనియర్ నాయకురాలు హసిరాణి రథ్‌కు బీజేపీ తమ అభ్యర్థిత్వ టికెట్ కేటాయించింది. ఈ నిర్ణయంతో నందిగ్రామ్ సమరం ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా మారింది.
నందిగ్రామ్‌లో బిజెపి సెంటీమెంట్ వ్యూహం
ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీఎంసీని ఓడించి బీజేపీ అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కేవలం రెండు రోజుల ముందు ఆయన నమ్మకస్తుడైన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం కొడుకును కోల్పోయిన శోకంలో ఉన్న రథ్ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు.. ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకునేందుకే బీజేపీ హసిరాణి రథ్‌ను బరిలోకి దించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రనాథ్ హత్యను, ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రధాన ప్రచారాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాషాయ దళం సిద్ధమవుతోంది.
ఎవరీ హసిరాణి రథ్?
62 ఏళ్ల హసిరాణి రథ్‌కు స్థానిక రాజకీయాల్లో మంచి పట్టు ఉంది. తూర్పు మేదినీపూర్‌లోని చండీపూర్ ప్రాంతం, కులుప్ గ్రామానికి చెందిన ఆమె పంచాయతీ స్థాయిలో ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు. గతంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో పనిచేసిన ఆమె.. సువేందు అధికారి బీజేపీలో చేరిన సమయంలో తన కుటుంబంతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రథ్ కుటుంబానికి, సువేందు అధికారి కుటుంబానికి రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన రాజకీయ, వ్యక్తిగత అనుబంధం ఉంది. సువేందు రాజకీయ ఎదుగుదలలో ఈ కుటుంబం నిరంతరం తోడుగా నిలిచింది.
ఉపఎన్నికకు కారణమేంటి?
2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి భవానీపూర్, నందిగ్రామ్ రెండు స్థానాల నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా భవానీపూర్ స్థానంలో టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీపై గెలుపొంది సంచలనం సృష్టించారు. అనంతరం భవానీపూర్ స్థానాన్ని నిలుపుకుంటూ నందిగ్రామ్ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
నందిగ్రామ్‌లో పోరు ఎవరెవరి మధ్య?
బీజేపీ అభ్యర్థిగా హసిరాణి రథ్ బరిలో నిలవగా.. టీఎంసీ అభ్యర్థిగా సంచిత ప్రధాన్ పోటీచేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, టీఎంసీ రెబల్ గ్రూపులు కూడా తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఎంసీల మధ్యే నెలకొంది.
అక్టోబర్ 6న పోలింగ్
నందిగ్రామ్‌తో పాటు రేజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అక్టోబర్ 6న పోలింగ్ జరగనుంది. సువేందు అధికారికి మంచి పట్టు ఉన్న నందిగ్రామ్ కోటలో బీజేపీ తన సెంటిమెంట్, అభివృద్ధి కార్డుతో ప్రచారం చేపడుతుండగా.. టీఎంసీ ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తోంది. అక్టోబర్ 6న ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.