వొడాఫోన్ కు మరో షాక్ తగలనుందా?
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ.. అనైతిక పద్దతులకు ఐడియా వొడాఫోన్ పాల్పడుతుందని పేర్కొంటూ జియో.. ఎయిర్ టెల్ ఫిర్యాదు చేశాయి.
మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఐడియా వొడాఫోన్ తాజా పరిస్థితి. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కిందా మీదా పడుతూ.. తనకున్న చందాదారుల్ని కాపాడుకోవటానికి నానా తిప్పలు పడుతున్న సదరు టెలికాం సంస్థపై దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థలైన జియో, ఎయిర్ టెల్ లు తీవ్ర ఆరోపణలు చేయటమే కాదు.. ట్రాయ్ (భారత టెలికాం నియంత్రణ సంస్థ) కు ఫిర్యాదు చేశారు. ఇంతకూ వొడాఫోన్ మీద చేసిన ఫిర్యాదు ఏంటి? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈ విషయంలో వొడాఫోన్ వాదన ఏంటి? లాంటి అంశాల్లోకి వెళితే..
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ.. అనైతిక పద్దతులకు ఐడియా వొడాఫోన్ పాల్పడుతుందని పేర్కొంటూ జియో.. ఎయిర్ టెల్ ఫిర్యాదు చేశాయి. ప్రత్యర్థి నెట్ వర్క్ ల ఎగ్జిక్యూటివ్ లు మాదిరిగా కొందరు నటిస్తూ తమ కస్టమర్లకు ఫోన్ చేసి.. త్వరలో టారిఫ్ ధరలు భారీగా పెరగబోతున్నాయి.. మీ ప్లాన్ మారుతుందని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి కాల్స్ వచ్చిన కాసేపటికే వొడాఫోన్ ప్రతినిధులు అదే కస్టమర్లకు ఫోన్ చేసి తమ నెట్ వర్క్ లోకి మారాలని.. పోర్టు చేసుకుంటే ఛార్జీల భారం ఉండదని చెబుతున్నట్లుగా ఆరోపించారు.
కస్టమర్లు వేరే నెట వర్క్ లోకి మారేందుకు 1900 నంబర్ కు పంపే యునిక్ పోర్టింగ్ కోడ్ ఎస్ఎంఎస్ లను వొడాఫోన్ ఐడియా కొన్ని సర్కిళ్లలో ఉద్దేశపూర్వకంగా నిరోధిస్తుందని.. ఇది నిబందనలకు విరుద్ధంగా పేరకొన్నారు. అంతేకాదు.. వేరే నెట్ వర్క్ నుంచి తమ నెట్ వర్క్ లోకి పోర్టు అయ్యే వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరలకే పోస్ట్ పెయిడ్ ప్లాన్ లను.. డిస్కౌంట్లను ప్రచారం చేయటం కూడా రూల్స్ కు విరుద్ధమని ట్రాయ్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై ట్రాయ ఛైర్మన్ అనిల్ కుమార్ స్పందిస్తూ.. టెలికాం ఆపరేటర్ల మధ్య ఈ తరహా ఫిర్యాదు రావటం సహజమని.. తమకు అందిన ఫిర్యాదును.. అందుకు తగ్గ ఆధారాల్ని ట్రాయ్ నిశితంగా పరిశీలిస్తుందని.. తదుపరి చర్యల కోసం విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. తమపై వచ్చిన ఆరోపణల్ని వొడాఫోన్ ఐడియా ఖండించింది. తాము నిబంధనలకు లోబడే వ్యాపారం చేస్తున్నట్లుగా పేర్కొంది. తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని.. ఆరోగ్య పోటీని తాము విశ్వసిస్తున్నట్లుగా పేర్కొంది. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ.66వేల కోట్లకు పైనే రుణం ఉంది. ఇటీవల ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ కొండలాంటి అప్పు భారం ఆ సంస్థను వెంటాడుతోంది. ఇలాంటి వేళ ఆ సంస్థపై వచ్చిన ఫిర్యాదులో నిజం ఉందని తేలితే మాత్రం.. వొడాఫోన్ కు మరిన్నిచిక్కులు ఖాయం. మరేం జరగుతుందో చూడాలి.