అడకత్తరలో పోక చెక్కలా ఎఫ్-1 విద్యార్థి వీసాల పరిస్థితి
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత భారీ ఉపశమనం లభించింది.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత భారీ ఉపశమనం లభించింది. ఎఫ్-1 విద్యార్థి వీసా నిబంధనలలో కఠినమైన మార్పులు తీసుకురావాలని భావించిన అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించిన నూతన విధానానికి యుఎస్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ కొత్త కఠిన నిబంధనలు అమల్లోకి రావడానికి కేవలం ఒక్కరోజు ముందు బోస్టన్ ఫెడరల్ జడ్జి స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్పుతో ఒక్కసారిగా అమెరికాలోని విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటివరకు అమెరికాలో ఎఫ్-1 వీసాపై విద్యను అభ్యసించే అంతర్జాతీయ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం అమలులో ఉంది. ఈ విధానం ప్రకారం ఒక విద్యార్థి తను చేరిన విశ్వవిద్యాలయంలో కోర్సు నిబంధనలను సక్రమంగా పాటిస్తూ చట్టబద్ధమైన విద్యార్థి హోదాను కొనసాగిస్తున్నంత కాలం ఎలాంటి అదనపు అనుమతులు లేకుండా అమెరికాలోనే ఉండేందుకు వెసులుబాటు లభిస్తుంది. అయితే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రవేశపెట్టాలని చూసిన కొత్త విధానం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. దీనిప్రకారం విద్యార్థులకు నిర్దిష్ట కాలానికి మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ అకడమిక్ కారణాల వల్ల లేదా పరిశోధన ఆలస్యం కావడం వల్ల కోర్సు పూర్తవ్వడానికి అదనపు సమయం పడితే విద్యార్థులు ప్రత్యేకంగా విసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది.
ఈ ప్రతిపాదిత మార్పులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపించాయి. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో పరిశోధనాత్మక కోర్సులు చేసే అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయుల సంఖ్యే అత్యధికం. ముఖ్యంగా దీర్ఘకాలిక పరిశోధనలు చేసే విద్యార్థులకు అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టడం సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితులలో ప్రతిసారీ ప్రభుత్వ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు పొందాల్సి రావడం.. పరిపాలనాపరమైన ఆలస్యాలు ఎదుర్కోవడం విద్యార్థులపై మానసిక, ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా పెంచేది.
బోస్టన్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఈ అత్యవసర ఆదేశాల వల్ల తక్షణమే అమల్లోకి రావలసిన కఠిన నిబంధనలు ఆగిపోయాయి. దీనితో ప్రస్తుతం అమెరికాలో ఉన్న విద్యార్థులతో పాటు, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విద్యార్థులకు పెద్ద ఊరట లభించింది. అయితే ఈ ఉపశమనం తాత్కాలికం మాత్రమేనని.. న్యాయపోరాటం ఇంకా ముగిసిపోలేదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించిన నిబంధనలపై కోర్టులో తదుపరి విచారణలు కొనసాగనున్నాయి. న్యాయస్థానం వెల్లడించే తుది తీర్పుపైనే ఎఫ్-1 వీసాదారుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు యుఎస్ ప్రభుత్వం.. తమ తమ విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ విద్యార్థి విభాగాలు విడుదల చేసే అధికారిక సూచనలను నిరంతరం గమనిస్తూ జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.