ఈ తిరుపతి కుర్రాడు మామూలోడు కాదు.. రూ.6 కోట్లకు టెలిగ్రామ్ చానల్ అమ్మేశాడు
తిరుపతికి చెందిన ఒక కుర్రాడి ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.
తిరుపతికి చెందిన ఒక కుర్రాడి ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రగిరి మండలం నాగపట్నం గ్రామానికి చెందిన సుమంత్ అనే కుర్రాడికి టెలిగ్రామ్ లో క్రికెట్ ప్రిడిక్షన్ అనే చానల్ ఉంది. దానికి విపరీతమైన క్రేజ్ ఉంది. కారణం ఏమైనా కానీ.. ఉత్తరాదికి చెందిన ఒకరు ఆ చానల్ తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు.
ఇందుకు సరేనన్న సుమంత్.. సదరు టెలిగ్రామ్ చానల్ ను ఏకంగా రూ.6 కోట్లకు అమ్మేశాడు. తనకు వచ్చిన ఆ భారీ సొమ్ముల సమాచారాన్ని స్నేహితులతో షేర్ చేసుకున్నాడు. ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. స్నేహితుడికి వచ్చిన భారీ సంపద మీద అతడి స్నేహితుల కన్ను పడింది. ఆ సొమ్మును సొంతం చేసుకోవటానికి వారు దారుణ నేరానికి పాల్పడ్డారు. సుమంత్ కు వచ్చిన సొమ్ముల్ని సొంతం చేసుకోవటం కోసం.. సుమంత్ ను కిడ్నాప్ చేశారు.
అయితే.. ఒక స్నేహితురాలి సాయంతో సుమంత్ తనను కిడ్నాప్ చేసిన స్నేహితుల నుంచి తప్పించుకున్నాడు. ఆ వెంటనే తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కంప్లైంట్ ఇచ్చారు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో స్పందించిన తిరుపతి రూరల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ముగ్గురు నిందితులని అదుపులోకి తీసుకున్న వారు విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా నిందితులు అసలు విషయాన్ని చెప్పారు. టెలిగ్రామ్ చానల్ ను రూ.6 కోట్లకు అమ్మటం.. సుమంత్ కు వచ్చిన డబ్బుల లెక్క గురించి చెప్పి.. ఆ డబ్బుల కోసమే తప్పుడుపని చేసినట్లుగా ఒప్పేసుకున్నారు. అంతేకాదు.. సుమంత్ దాచిన సొమ్ముల సమాచారాన్ని అందించారు. దీంతో.. ఇంట్లో దాచి ఉంచిన రూ.1.10 కోట్ల మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ ప్లానింగ్ లోనూ.. దాన్ని అమలు చేయటంలో కీలకంగా వ్యవహరించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఉదంతం తిరుపతిలో సంచలనంగా మారింది.