బొత్స Vs చిన్న శ్రీను.. మామ, అల్లుడి మధ్య ఆసక్తికర యుద్ధం
విజయనగరం జిల్లా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత బొత్స, ఆయన మేనల్లుడు చిన్న శ్రీను మధ్య రాజకీయ పోరు నువ్వానేనా అన్నస్థాయికి చేరుకునేలా కనిపిస్తోందని అంటున్నారు.
విజయనగరం జిల్లా రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత బొత్స, ఆయన మేనల్లుడు చిన్న శ్రీను మధ్య రాజకీయ పోరు నువ్వానేనా అన్నస్థాయికి చేరుకునేలా కనిపిస్తోందని అంటున్నారు. తనను ధిక్కరించి అధికార టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్, మేనల్లుడు చిన్న శ్రీనును ఒంటరిని చేయాలని, జిల్లాలో తన పట్టు నిరూపించుకోవాలని సీనియర్ నేత బొత్స పట్టుదల ప్రదర్శిస్తుంటే, మామ బొత్సకు ఝలక్ ఇచ్చేలా జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను శరవేగంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మామా అల్లుళ్ల మధ్య నెలకొన్న రాజకీయ పోరు హాట్ టాపిక్ అవుతోంది. గడిచిన 30 ఏళ్లుగా ఒకరికొకరుగా రాజకీయం చేసిన ఇద్దరు తొలిసారి వ్యూహప్రతివ్యూహాలతో దెబ్బ తీసుకోవాలని చూడటం ఆసక్తి రేపుతోందని అంటున్నారు.
విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అనూహ్యంగా పార్టీ ఫిరాయించి అధికార టీడీపీతో చేతులు కలపడం విజయనగరం రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రధానంగా రాజకీయాలు మొదలుపెట్టిన నుంచి టీడీపీ వ్యతిరేక భావజాలంతో పనిచేసిన ఆయన.. తొలిసారిగా పసుపు కండువా కప్పుకుని పార్టీలో కుదురుకునేలా నడుచుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో చిన్న శ్రీను రాజీనామా చేయడాన్ని వైసీపీలో ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సీనియర్ నేత బొత్స అయితే బోరుబోరు విలపిస్తూ సెంటిమెంటును పండిస్తున్నారని అంటున్నారు. ఒక నాయకుడు పార్టీని వదిలి వీడిపోతే ఇంతలా చర్చ జరగడం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే తొలిసారి కావొచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి జడ్పీ చైర్మన్ తప్ప మరే పదవులు చేపట్టని చిన్న శ్రీను రాజీనామాపై ఇంత చర్చ జరగడానికి ఇన్నాళ్లు ఆయన నడిపిన రాజకీయమే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. తన మేనమామ బొత్సకు నీడలా పనిచేయడం ద్వారా జిల్లా రాజకీయాల్లో చిన్న శ్రీను ప్రభావం పెరిగిందని చెబుతున్నారు. 1999లో బొత్స ఎంపీగా గెలిచిన సమయంలో సామాన్యుడిలా ఉన్న చిన్నశ్రీను 2004లో బొత్స ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షాడో మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన రాజకీయ వ్యవహారాల బాధ్యతలు అన్నీ బొత్స మేనల్లుడు చిన్నశ్రీనుకే అప్పగించారు. ఇలా దాదాపు రెండున్నర దశాబ్దాలు పాటు బొత్స రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించిన చిన్న శ్రీను సొంత ముద్ర కోసం వేరుపడటంతో విజయనగరం రాజకీయాలు ఇంట్రెస్టింగుగా మారాయి.
జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగిన చిన్న శ్రీను టీడీపీలో పోషించబోయే పాత్ర సీనియర్ నేత బొత్సకు సవాల్ విసరనుందని భావిస్తున్నారు. బొత్స బలం, బలహీనత ఏంటో తెలిసిన చిన్న శ్రీను టీడీపీ తరఫున పనిచేయడం ద్వారా స్థానిక ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేస్తున్న బొత్స పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారని అంటున్నారు. దీంతో గత 25 ఏళ్లుగా ఎన్నడూ లేనివిధంగా జిల్లాలోని ప్రతి మండల నాయకుడితోనూ బొత్స మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. చిన్న శ్రీను వెంట ఎవరూ వెళ్లొద్దని, అందరి బాధ్యత తాను చూసుకుంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు టీడీపీలో చేరిన తర్వాత వరుసగా ఆ పార్టీ పెద్దలను కలుస్తూ వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చాటిచెబుతున్న చిన్న శ్రీను ఇప్పటివరకు వైసీపీలో తన అనుచరులతో మాట్లాడలేదని అంటున్నారు. ఆయన మాటలు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు. ప్రస్తుతానికి వైసీపీ నుంచి ఎవరూ వెళ్లకుండా బొత్స అడ్డుపడుతున్నారని, అయితే చిన్నశ్రీను రంగంలోకి దిగిన తర్వాత ఆయన ఎంతవరకు నియంత్రించగలరు? అన్నదే ఉత్కంఠ రేకెత్తిస్తోందని చెబుతున్నారు.