బాబు ఆధ్యాత్మిక రికార్డు సరికొత్తగా !

ఇదిలా ఉంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం అదృష్టమని చంద్రబాబు చెప్పారు.

Update: 2026-09-15 16:48 GMT

చంద్రబాబు రాజకీయంగానే కాదు ఆధ్యాత్మిక పరంగానూ అదృష్టవంతుడే అని అంటున్నారు. నిజానికి రాజుల కాలంలో కూడా తిరుమల శ్రీవారికి ఇన్ని సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన మహరాజులు ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. కానీ ప్రజా స్వామ్యంలో ఆధునిక యుగంలో చంద్రబాబుకు ఆ భాగ్యం కలిగింది. తాజాగా మంగళవారం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసారితో కలిపి 15 సార్లు శ్రీవారికి బాబు పట్టువస్త్రాల సమర్పించినట్లుగా కొత్త రికార్డు నమోదు అయింది. ఇది ఆధ్యాత్మిక పరంగా చూస్తే అరుదైనదిగా అంతా భావిస్తున్నారు.

తొలిసారి ఆనాడు :

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు తొలిసారి ప్రమాణం చేశారు. ఆ మరుసటి నెలలోనే ఆయన శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటిసారి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్ళు బాబు పాలించారు. మొత్తంగా 7 సార్లు శ్రీవారికి ఆ సమయంలో పట్టు వస్త్రాలు ఆయన బ్రహ్మోత్సవాల వేళ సమర్పించారు. ఇక విభజన ఏపీలో 2014 నుంచి 2019 దాకా అయిదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరిగి 2024లో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో వరుసగా మూడు సార్లు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో 15 సార్లు పూర్తి అయింది. మరో రెండేళ్ల పాటు ఈ టెర్ములోనే బాబు స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి ఆ సంఖ్య 17 కి చేరుకుంటుంది అని అంటున్నారు.

బద్దలు కొట్టలేనిదే :

చంద్రబాబుకు ఇష్ట దైవం తిరుమల శ్రీవారు. ఆయన అనేక సందర్భాలలో ఈ విషయాన్ని బహిరంగ సభలలో చెప్పి ఉన్నారు. ఇక బాబుకు అందుకే ఆ శ్రీవారు కూడా ఈ వరాన్ని ప్రసాదించారు అని ఆధ్యాత్మిక పరులు చెబుతారు. బాబు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో నెలకొల్పిన ఈ అరుదైన రికార్డుని బద్ధలు కొట్టడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదనే అంటున్నారు. ఆ రికార్డు బద్దలు కొట్టాలంటే సుదీర్ఘ కాలం అధికారంలో ఉండాలి. బాబు మాదిరిగా నాలుగు సార్లు సీఎం గా కూడా ఉండాలి. మరి అంతటి రాజకీయ సామార్ధ్యం అయితే ఎవరికి ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా బాబుకు రాజకీయంగా ఎన్నో రికార్డులు ఉన్నాయి. అందులో ఈ రికార్డు ప్రత్యేకమైనది అని అంటున్నారు.

అదృష్టమన్న బాబు :

ఇదిలా ఉంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం అదృష్టమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రజల క్షేమంతో పాటు ఏపీ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని అలాగే భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలని స్వామివారిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. టీటీడీ భక్తుల కోసం అనేక సంస్కరణలు చేపడుతూ తిరుమలను ఆలయ సంస్కృతికి రోల్ మోడల్‌గా నిలిపినందుకు టీటీడీ బోర్డును అధికారులను బాబు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

Tags:    

Similar News